iDreamPost
iDreamPost
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్ (ఎంపీ ల్యాడ్స్)కు కేంద్రం మోక్షం కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలానికి నిధులు మంజూరు చేసేందుకు పచ్చజెండా ఊపింది. దీనితో కరోనా వల్ల ఏడాదిన్నరగా నిలిచిపోయిన ఎంపీ ల్యాడ్స్‌కు మోక్షం లభించింది.
దివంగత పి.వి.నరసింహా రావు హాయాంలో 1993 డిసెంబరు నుంచి ఎంపీ ల్యాడ్స్ అమలులోకి వచ్చింది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఈ పథకం ద్వారా తొలినాళ్లలో ఏడాదికి రూ.కోటి ఇచ్చేవారు. తరువాత కాలంలో నిధులు కేటాయింపు పెరుగుతూ ప్రస్తుతం ఏడాదికి రూ.ఐదు కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నారు. ఈ నిధులను పార్లమెంట్ సభ్యులు ఎక్కువగా రోడ్లు, వంతెనలు, కమ్యూనిటీ భవనాలు, పాఠశాలల భవనాలు, రైతు ప్రయోజన కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. నిధులలో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీల అభివృద్ధికి కేటాయించాల్సి ఉంది. ఈ నిధులు వాడకంలో కొంతమంది ఎంపీలు నిర్లప్తతగా ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి విమర్శలు ఎదుర్కునే వారిని తీసివేస్తే మెజారిటీ ఎంపీలు ఈ నిధులు వల్ల గరిష్ఠంగ ప్రయోజనం పొందుతున్నారు.
2020 నుంచి నిధుల కేటాయింపును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనా కారణంగా ఆదాయం పడిపోవడం.. కరోనా నియంత్రణకు అధికంగా నిధులు కేటాయించాల్సి రావడంతో రెండేళ్లపాటు అంటే 2020`21, 2021`22 ఆర్థిక సంవత్సరాలకు గాను నిధులు ఇవ్వలేమని కేంద్రం తెలిపింది. అయితే తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగిలిన కాలానికి రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇస్తామని కేంద్రం మంత్రివర్గం తీర్మానం చేసింది. గత ఏడాది రూ.5 కోట్లు, ఈ ఏడాది తొలి అర్థభాగం రూ.3 కోట్ల చొప్పున ఒక్కొక్క ఎంపీ రూ.8 కోట్ల చొప్పున నిధులు కోల్పోయినట్టయ్యింది.
ఉభయ రాష్ట్రాల ఎంపీలు ఇప్పటి వరకు రూ.480 కోట్ల ఎంపీ ల్యాడ్స్ నిధులు కోవిడ్ కారణంగా పొందలేకపోయారు. ఏపీలో 25 లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యుల చొప్పున మొత్తం 36 మంది పార్లమెంట్ సభ్యులున్నారు. ఇక తెలంగాణాలో 17 మంది లోక్‌సభ, 7 రాజ్యసభ సభ్యులు కలుపుకుని మొత్తం 24 మంది పార్లమెంట్ సభ్యులున్నారు. రెండు రాష్ట్రాలలో 60 మంది ఎంపీలు ఏడాదిన్నర కాలంగా ఎంపీ ల్యాడ్స్ నిధులు నిలిచిపోవడంతో స్థానికంగా అభివృద్ధి పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణంలో ఉన్న పనులకు నిధులు కేటాయించడంతోపాటు, నియోజకవర్గ పరిధిలో కొత్తగా గుర్తించిన పనులకు సైతం నిధులు కేటాయించాల్సి ఉంది. ఇందుకు ఎమ్మెల్యేలు, కార్యకర్తల నుంచి ఎంపీలపై వత్తిడి ఉంది. ఎట్టకేలకు నిధులు కేటాయింపు నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించడం ఎంపీలకు ఊరటనిచ్చే అంశంగా మారింది.
Also Read : KCR National Politics -గులాబీ బాస్ గురి జాతీయ రాజకీయాల వైపు మళ్లిందా?