iDreamPost
android-app
ios-app

అగ్నివీర్స్ కోసం కేంద్రం ప్ర‌క‌టించిన ఏడు ప‌థ‌కాలు, నిర‌స‌న‌లు ఆగుతాయా?

  • Published Jun 20, 2022 | 9:13 PM Updated Updated Jun 21, 2022 | 11:50 AM
అగ్నివీర్స్ కోసం కేంద్రం ప్ర‌క‌టించిన ఏడు ప‌థ‌కాలు, నిర‌స‌న‌లు ఆగుతాయా?

అగ్నిప‌థ్(Agnipath ) ప‌థ‌కాన్ని వెనక్కి తీసుకోబోమని కేంద్రం తేల్చేసింది. ఇక అగ్నిప‌థ్ త‌ప్ప‌నిస‌రి మ‌రి నాలుగేళ్ల కాంట్రాక్ట్ తర్వాత సాయుధ బలగాల్లో అవ‌కాశం ద‌క్క‌ని అగ్నీవీర్ ల‌కు సంగ‌తేంటి?

గత వారం, భారత సాయుధ బలగాల కోసం సరికొత్త రిక్రూట్‌మెంట్ ప్లాన్ అగ్నిపథ్ ను కేంద్రం ప్రకటించిన వెంట‌నే దేశ‌మే ర‌గిలిపోయింది. హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయి. యువ‌త‌లో ఎందుకంత నిర‌స‌న‌? ఒక‌టి ఉద్యోగ భద్రత రెండోది వయస్సు. ఈ రెండింటిమీద‌నే ఆందోళనలు.

ఇండియ‌న్ ఆర్మీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు యువ‌ర‌క్తాన్ని ఎక్కించాలన్న‌ది త్రివిధ‌ద‌ళాల ఉద్దేశం. అందుకే నాలుగేళ్ల స్వల్పకాలిక ఒప్పందాలకు అగ్నివీర్(Agniveers)ల‌ను నియమించుకొని, కొత్త వ్య‌వ‌స్థ‌ను సృష్టించాల‌నుకొంటున్నారు. ఇక‌పై ఆర్మీ రిక్రూట్మెంట్ కేవ‌లం అగ్నిప‌థ్ తోనే నిర్వ‌హిస్తారు. నాలుగేళ్ల పదవీకాలం తర్వాత అర్హులైన‌ 25% మంది మాత్రమే ప‌ర్మినెంట్ అవుతారు. ఇక్క‌డే యువ‌త‌కు చిర్రెత్తుకొస్తోంది. ఆర్మీ అన్న‌ది ఉద్యోగ భ‌ద్ర‌త‌కు సంబంధించింది. ఒక‌సారి ఆర్మీలో చేరితే అక్క‌డే రిటైర్ కావాలి. ఇప్పుడు 75శాతం మందిని ఇంటికిపంపితే, వాళ్ల బ‌తుకుతెరువేంటి?

యువ‌త‌లో ఆందోళ‌న‌ల‌కు త‌గ్గించానికి ఈ 75శాతం అగ్నివీర్ ల‌కోసం అనేక పథకాలను ప్రకటించింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగ రిజర్వేషన్లు, వాటితోపాటు అగ్నివీర్లు(Agniveers) ఉపాధిని పొందే అవకాశాలు రెండూ ఉన్నాయి.

ఈ అగ్నిప‌థ్ ప‌థ‌కం కింద‌ నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత, అగ్నివీర్‌లకు రూ.11.71 లక్షల ప‌న్నులేని సేవా నిధి ప్యాకేజీతోపాటు రూ. 48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ జీవిత బీమా ఉన్నాయి. అయినా నిర‌స‌న‌లు ఆగ‌లేదు. అందుకే కేంద్రం ఏడు ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించింది.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA)
అగ్నిప‌థ్ ప‌థ‌కంపై నిర‌స‌లు పెర‌గానే ముందుగా హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF) తోపాటు అస్సాం రైఫిల్స్‌ రిక్రూట్‌మెంట్ లో అగ్నివీర్లకు ప్రాధాన్యతనిస్తామ‌ని ప్ర‌క‌టించింది. వారి 4ఏళ్ల‌ పదవీకాలం త‌ర్వాత, వారికోసం 10 శాతం రిజ‌ర్వేష‌న్ ను ప్ర‌క‌టించింది. వయస్సు ప్రమాణాలలో సడలింపులనిచ్చింది. మొద‌టి యేడాది అగ్నివీర్ ల వ‌యోప‌రిమితి క‌న్నా 5 ఏళ్ల వెసులుబాటునిచ్చింది. తరువాతి బ్యాచ్‌లకు సడలింపు 3 ఏళ్లు.

రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence)

త్రివిధ దళాల న‌డిపించే ర‌క్ష‌ణ‌మంత్రిత్వ శాఖ, యువ‌త‌కు న‌చ్చ‌జెప్పే ప‌ని మొద‌లుపెట్టింది. 21 ఏళ్లుకాదు 23 ఏళ్ల‌కు అర్హ‌త వ‌య‌స్సును స‌డలించింది. అంతేకాదు, ఖాళీల భ‌ర్తీలో 10శాతం రిజర్వేషన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు , 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్‌లల్లో ఉద్యోగాల‌కు రిజ‌ర్వేష‌న్ వ‌ర్తిస్తుంది. HAL, BELల రిక్రూట్మెంట్ లోనూ అగ్నివీర్ ల‌కు రిజ‌ర్వేష‌న్ ఉంది.

ఓడరేవులు, షిప్పింగ్ , జలమార్గాల మంత్రిత్వ శాఖ (Ministry of Ports, Shipping, and Waterways)
త్రివిధ ద‌ళాల్లో ఇప్ప‌టిదాకా జ‌వాన్, పైలెట్, సెయిల‌ర్ లాంటి ఉద్యోగాలున్నాయి. ఇప్పుడు వీట‌న్నింటిని అగ్నివీర్ లుగానే పిలుస్తారు. అగ్నివీర్ ల‌కోసం ఆర్మీ రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించ‌గానే, ఓడరేవులు, షిప్పింగ్ ,జలమార్గాల మంత్రిత్వ శాఖ మ‌రో అవ‌కాశాన్ని ప్ర‌క‌టించింది. ఇండియ‌న్ నేవీలో ప‌నిచేసి, నాలుగేళ్ల త‌ర్వాత బైట‌కొచ్చే అగ్నివీర్లను మర్చంట్ నేవీలో రిక్రూట్ చేసుకొంటారు. అగ్నివీర్‌ల నైపుణ్యాల‌ను పెంచుతారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మర్చంట్ నేవీలో చేరడానికి వాళ్లు అర్హులు.

స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ(Ministry of Skill Development and Entrepreneurship)

ఇంట‌ర్ తో స‌మాన‌మైన స‌ర్టిఫికెట్ పొందే అగ్నివీర్ ల‌కు ఇప్పుడు ఎక్క‌డ ఉద్యోగాలు దొరుకుతాయి? ఇది యువ‌త వేస్తున్న సూటి ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం, సర్వీస్‌లో ఉన్నప్పుడే అగ్నివీర్‌లు స్కిల్ ఇండియా సర్టిఫికేషన్ పొందుతారని, స్కిల్ ఇండియా మిషన్ చెబుతోంది. ఇంకా వివ‌రాలు అందాల్సి ఉంది.

విద్యా మంత్రిత్వ శాఖ(Ministry of Education)
యువ‌త‌కు భ‌విష్య‌త్తులో ఉద్యోగాలను సాధించే నైపుణ్య‌మేకాదు, తగిన స‌ర్టిఫికెట్ల‌ను అందించే బాధ్య‌త‌ను కేంద్ర విద్యాశాఖ తీసుకుంది. మూడేళ్ల నైపుణ్యం ఆధారిత డిగ్రీని, వారి స‌ర్వీసు పూర్తియిన త‌ర్వాత వాళ్ల కెరీర్ లో ఉప‌యోగప‌డేలా కోర్సుల‌ను ప్ర‌క‌టించింది. ఆమేర‌కు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) తీర్చిదిద్దిన డిగ్రీని విద్యా మంత్రిత్వ శాఖ ఇస్తుంది.

మ‌రి టెన్త్ పాస్ అయి అగ్నీవీర్ ల‌యితే, వాళ్ల ప‌రిస్థితి ఏంటి? నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణులైన అగ్నివీర్‌లకు, ఇంట‌ర్ తో స‌మాన‌మైన‌ స‌ర్టిఫికెట్ ఇస్తారు. కాని దానికో కోర్స్ చేయాల్సి ఉంటుంది.

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(Ministry of Corporate Affairs)
ఉద్యోగాలుస‌రే, ఒక‌వేళ సొంతంగా బ‌త‌కాల‌ని భావిస్తే? వ్యాపారం చేయాల‌ని అనుకొంటే? వాళ్ల‌కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోన్స్ ఇచ్చే అవ‌కాశాల‌ను సిద్ధంచేస్తోంది. లోన్స్ ఎవ‌రికి? ఎంత ఇవ్వాలి? అన్న‌ది ఇంకా చ‌ర్చ‌ల్లోనే ఉంది. ఈలోగా ప్రభుత్వ రంగ బ్యాంకుల‌తోపాటు, ప్రభుత్వ రంగ బీమా సంస్థ‌లు, అగ్నివీర్‌లకు ఉపాధి అవకాశాలను క‌ల్పించే ప‌నిలో ప‌డ్డాయి.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ(Ministry of Civil Aviation)

ఎయిర్ ఫోర్స్ లో ప‌నిచేసే అగ్నివీర్ ల‌కోసం పౌర విమాన‌య మంత్రిత్వ శాఖ ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ సర్వీసెస్‌లో అగ్నివీర్‌లను నియమించుకోవచ్చని, అంతేకాదు, విమానాలు నిర్వ‌హ‌ణ‌, మ‌ర‌మ‌త్తులలో పని చేయడానికి అగ్నివీర్ లు అర్హులని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.