iDreamPost
android-app
ios-app

ఏపీ భవన్‌ ఎవరిది..? : 12న కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ

ఏపీ భవన్‌ ఎవరిది..? : 12న కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ

ఏపీ, తెలంగాణ విడిపోయి ఏడేళ్లు అవుతోంది. కానీ.. ఇప్పటికీ ఎన్నో అంశాలపై చిక్కుముడులు వీడలేదు. పెద్దన్న పాత్ర పోషించి పరిష్కరించాల్సిన కేంద్రం సాగతీతధోరణి అవలంభిస్తుండడంతో తెలుగు రాష్ట్రాల మధ్య కీలక సమస్యలు కొలిక్కి రావడం లేదు. అప్పుడప్పుడూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఇరురాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నా..అవి తూతూమంత్రంగా మిగిలిపోతున్నాయే తప్ప.. ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం లభించడం లేదు. అందులో ఢిల్లీలోని ఏపీ భవన్‌ మొదలు, విజయవాడలోని అప్మెల్‌, విభజన చట్టంలోని షెడ్యూల్‌ తొమ్మిది, పది పరిధిలోని సంస్థల ఆస్తుల పంపకం ఎటూ తేలలేదు.

ఏపీ ఇలా.. తెలంగాణ అలా..

పలు వివాదాల్లో ఢిల్లీలోని ఏపీ భవన్‌ పంపిణీ ఇరు రాష్ట్రాల మధ్య ప్రధాన సమస్యగా మారింది. విభజన చట్టంలో.. ఇతర రాష్ట్రాల్లోని ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని ఉంది. ఆ ప్రకారం.. 58.32:41.68 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణకు ఆ భవనాన్ని పంపిణీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఈ వాదనను వ్యతిరేకిస్తోంది. ఏపీ భవన్‌ పూర్తిగా తెలంగాణకు చెందుతుందని వాదిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా 2017లో ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. 1956లో హైదరాబాద్‌ రాష్ట్రం, ఆంధ్రరాష్ట్రం విలీనమై.. ఆంధప్రదేశ్‌ ఏర్పడక ముందే నిజాం రాజు ఢిల్లీలో 18 ఎకరాల 18 గుంటల భూమిని కొనుగోలు చేసి, భవనాన్ని నిర్మించారని అందులో పేర్కొన్నారు. అందుకే.. ఆ భవనం తెలంగాణకే చెందుతుందని స్పష్టం చేశారు. కనీసం భవనంలోని బ్లాకుల వారీగానైనా విభజించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం మధ్యేమార్గంగా ఓ సూచన చేసినా అందుకు కూడా తెలంగాణ ఒప్పుకోవడం లేదు. ఈ నెల 12న జరిగే సమావేశంలో ఈ సమస్యకు కేంద్రం ఏ పరిష్కారం చూపుతుందో చూడాలి.

ఆస్తులు, అప్పుల సంగతేంటి..?

విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద చిక్కుముళ్లుగా మారాయి. ఈ షెడ్యూలు కింద మొత్తం 91 సంస్థలున్నాయి. వీటికి సంబంధించి ఉద్యోగుల విభజన పూర్తయింది. ఆస్తులు, అప్పుల సమస్యలు తేలాల్సి ఉంది. 68 సంస్థలకు సంబంధించి పెద్దగా వివాదాల్లేవు. ఇవి దాదాపుగా పరిష్కారమైనట్లే. మిగిలిన 23 ప్రధాన సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ కీలకంగా మారింది. ముఖ్యంగా ఆర్టీసీ, రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, హౌసింగ్‌ బోర్డు, దిల్‌, పాడి అభివృద్ధి సంస్థ, పరిశ్రమల అభివృద్ధి సంస్థ, పౌరసరఫరాల సంస్థ వంటి 23 సంస్థల ఆస్తులు, అప్పుల సమస్య తెగని పంచాయితీగా మారింది.

Also Read : భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై సుప్రీం ఏం చెప్ప‌బోతోంది..?

ఆయా సంస్థల ఆస్తులన్నింటినీ 58.32:41.68 నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలంటూ ఏపీ వాదిస్తోంది. హౌసింగ్‌ బోర్డు స్థలాలు హైదరాబాద్‌లో చాలా ఉన్నాయి. దిల్‌ సంస్థకు వివిధ జిల్లాల్లో భూములున్నాయి. ఉమ్మడి రాష్ట్ర నిధులతో వీటిని కొనుగోలు చేశారని, అందుకే ఆ స్థలాలు, భూముల్లో తమకు వాటా రావాల్సి ఉంటుందని ఏపీ మొదటి నుంచీ వాదిస్తోంది. కానీ.. చట్టంలోని 53 సెక్షన్‌ ప్రకారం హెడ్‌క్వార్టర్‌ భవనాలను మాత్రమే పంచాలనేది తెలంగాణ వాదనగా ఉంది. దీంతో.. 9వ షెడ్యూలు సంస్థల విజభనకు పరిష్కారం లభించడం లేదు.

‘అప్మెల్‌’ ఏపీకే కానీ..

సింగరేణి అనుబంధ సంస్థ అయిన ది ఆంధ్రప్రదేశ్‌ హెవీ మెషనరీ అండ్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌(అప్మెల్‌) సంస్థ విషయంలో ఇప్పటికీ పరిష్కారం లేదు. విజయవాడ సమీపంలోని కొండపల్లిలో ఉన్న ఈ సంస్థకు రూ.2,060 కోట్ల విలువైన 206 ఎకరాల భూమి ఉంది. దీనికి అనుబంధంగా మరో రూ.150-200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి కూడా ఉంది. అప్మెల్‌ను షిలా భిడే కమిటీ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో తెలంగాణకు న్యాయం చేయాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కేంద్రానికి లేఖ రాశారు. సంస్థ విజయవాడలో ఉన్నందున.. దాని ఆస్తి మొత్తం తమకే చెందుతుందని ఏపీ స్పష్టంగా పేర్కొంటున్నా ఎవరికి అనేది ఇంకా తేలలేదు. మరోవైపు విద్యుత్‌ బకాయిలపై కూడా చిక్కుముడులు వీడడం లేదు.

విభజన సమస్యలపై ఈ నెల 12న సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపింది. గతేడాది ఏప్రిల్‌ 7న కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో సమావేశం జరిగినా.. ఒక్క సమస్యా పరిష్కృతమవ్వలేదు. ఈ సమావేశంలో కనీసం కొన్ని సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి. మరి ఏం జరగనుందనేది వేచి చూడాలి.

Also Read : 400 మంది పార్ల‌మెంట్ సిబ్బందికి క‌రోనా : బ‌డ్జెట్ స‌మావేశాల మాటేంటి?