Idream media
Idream media
ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. కొత్త మ్యూటేషన్లు వస్తుండడంతో వైరస్ వ్యాప్తి నిత్యకృత్యమైపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో కరోనా నాలుగోవేవ్ వస్తుందనే ఆందోళన మొదలైంది. కేంద్రం కూడా నాలుగో వేవ్ వచ్చే ప్రమాదం ఉందంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. నిపుణులు కూడా నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ అంచనా వేస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో నాలుగో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. వ్యాక్సిన్ ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని,దాని తీవ్రతను కూడా బాగా తగ్గించవచ్చని మూడోవేవ్‌తో అర్థమైంది.మూడో వేవ్‌లో కరోనావేరియంట్ ఒమిక్రాన్ ఎంతవేగంగా వ్యాపించిందో అంతే వేగంగా తగ్గిపోయింది. ప్రజలపై దాని ప్రభావం కూడా చాలాతక్కువగానే ఉంది.ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితిరాలేదు. ప్రాణ నష్టం కూడా తగ్గింది. దీనికి కారణం వ్యాక్సిన్ తీసుకోవడమే. కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని వారే ఒమిక్రాన్ వల్ల ఆస్పత్రిపాలయ్యారు.
ఈ పరిస్థితులను బేరీజు వేసుకున్న కేంద్ర ప్రభుత్వం.. రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలకు బూస్టర్‌డోసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇవ్వడం వల్ల నాలుగో వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని యోచిస్తోంది. ఇప్పటికే దేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు అందరికీ రెండు డోసులు ఇచ్చింది. దాదాపు 180 కోట్ల డోసులు పంపిణీ చేసింది. అంతేకాకుండా మూడో వేవ్ సమయంలో 60 ఏళ్లు పైబడిన వారికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు 2.17 కోట్ల బూస్టర్ డోసులను ఇచ్చింది. 18 ఏళ్లు పైబడిన వారికి రెండు డోసులు పూర్తికావడంతో 15 – 17 ఏళ్ల వారికి, 12–14 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తోంది. 15–17 ఏళ్ల వారికి మొదటి డోసు పూర్తి కాగా, ప్రస్తుతం 12–14 ఏళ్ల వారికి మొదటి డోసు వేసే కార్యక్రమం మొదలైంది.
కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదని, మధ్యలో ఉన్నామని చెబుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసింది. ఇప్పటికే అమెరికా,ఇంగ్లాండ్ వంటి దేశాల్లో బూస్టర్ డోసు కూడా పూర్తయింది. అక్కడ రెండో బూస్టర్ డోసు ఇచ్చే అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఆయా దేశాల్లో మాదిరిగా భారత్‌లోనూ బూస్టర్ డోసు ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే బూస్టర్ డోసు ఉచితంగానే ఇవ్వాలా..? లేదా ధర నిర్ణయించాలా..? అనే అంశంపై కూడా మోడీ సర్కార్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.