సామాన్యులకు భారీ ఊరట.. దిగి రానున్న వంట నూనె ధరలు!

పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలేత్తుతున్నారు. కూరగాయలు మొదలు గ్యాస్‌ సిలిండర్‌ వరకు ప్రతి దాని ధరలు పెరగడమే తప్ప.. దిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇక రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా వంట నూనె ధరలు.. చుక్కలను తాకాయి. ఇప్పటికి కూడా దిగిరాలేదు. ఇక గత కొంత కాలంగా.. వంట నూనె ధరలు దిగి వస్తాయి అంటున్నారు. వాటిని నిజం చేస్తూ.. మోదీ ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పేందుకు రెడీ అయ్యింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వంట నూనె ధరలపై శుభవార్త అందించింది. రిఫైన్డ్ సోయాబీన్, సన్ ఫ్లవర్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 5 శాతం తగ్గించినట్లు ప్రకటించింది. అంటే ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకం 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. జూన్ 15, 2023 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది.

దేశీయంగా వంట నూనె లభ్యత పెంచడం, ధరలను నియంత్రించేందుకుగాను.. దిగుమతి సుంకంలో కోత పెట్టినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణంగా ముడి సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెల్ని మన దేశం దిగుమతి చేసుకుంటుంది. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం.. రిఫైన్డ్ నూనెలపైనా దిగుమతి సుంకాన్ని తగ్గించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకం 13.7 శాతంగా (సామాజిక సంక్షేమ సెస్‌తో కలిపి) ఉండగా.. ముడి వంట నూనెల దిగుమతులపై సుంకం 5.5 శాతం మాత్రమే ఉంది.

ప్రస్తుతం దేశంలో శుద్ధి చేసిన సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చాలా తక్కువగా ఉంది. సుంకాలు తగ్గించిన క్రమంలో దిగుమతులు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. వంట నూనెల దిగుమతి పెరగడం ద్వారా లభ్యత పెరిగి ధరలు దిగివస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఏడాది మన దేశంలోకి రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. దీని ఫలితంగా నూనె గింజల పంటల సాగు కూడా ఆలస్యం కావచ్చు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా సామాన్యులకు ఊరట కలిగే అవకాశం ఉంది అని అభిప్రాయపడుతున్నారు

రిఫైన్డ్ సోయాబీన్, రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై చివరి సారిగా 2021, అక్టోబర్‌లో సుంకాలను తగ్గించింది కేంద్రం. ఈ నిర్ణయం దేశీయంగా కూడా వంట నూనే ధరలపై ప్రభావం చూపించింది. ఆ సమయంలో దిగుమతి సుంకం 32.5 శాతం నుంచి 17.5కు తీసుకొచ్చింది. ఇప్పుడు దానిని మరో 5 శాతం తగ్గించి 12.5కు చేసింది. భారత్ అధికంగా 60 శాతం మేర వంట నూనెలను అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

Show comments