iDreamPost
android-app
ios-app

జగన్‌ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌.. ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం..

  • Published Jan 07, 2022 | 1:45 PM Updated Updated Jan 07, 2022 | 1:45 PM
జగన్‌ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌.. ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం..

రహదారులే నాగరికతకు చిహ్నాలు.. ప్రగతికి ప్రవేశద్వారాలు కూడా. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో హైవేల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. దీర్ఘకాలంగా ప్రతిపాదనల్లో నలిగిపోతున్న ప్రాజెక్టులతోపాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులు చేర్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కేంద్ర ప్రాజెక్టులుగా చేపట్టే ఎక్స్ ప్రెస్ హైవేల ప్రతిపాదనల్లో వాటిని చేర్చి మంజూరు చేయాలని కోరారు. ఆ మేరకు ఆరు హైవేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 22 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణానికి ఆమోదం లభించగా వాటిలో ఆరు రాష్ట్రం మీదుగా వెళ్లేవి కావడం విశేషం. ఈ ఆరు ప్రాజెక్టులకు రూ. 15,876 కోట్లు ఖర్చు చేస్తారు.

378 కి.మీ. రోడ్లు.. 

రాష్ట్రం మీదుగా సాగే ఆరు ఎక్స్ ప్రెస్ హైవేల నిడివి 378 కిలోమీటర్లు ఉంటుంది. పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు ఉన్న ప్రాంతాలను దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేసేలా ఎక్స్ ప్రెస్ హైవేలు డిజైన్ చేశారు. దీనివల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తాయి. వీటి నిర్మాణాల్లో కొన్నింటిని 2024 నాటికి, మరికొన్నింటిని 2025 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.

– 272 కిలోమీటర్ల బెంగళూరు-చెన్నై రహదారి ఏపీలో చిత్తూరు, అనంతపురం జిల్లాల మీదుగా 92 కి.మీ. మేరకు సాగుతుంది. దీని మొత్తం నిర్మాణ వ్యయం రూ. 3,864 కోట్లు.

– చిత్తూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ వే పొడవు 125 కి.మీ. కాగా మన రాష్ట్రంలో  75 కి.మీ. మేరకు సాగుతుంది. దీని నిర్మాణ వ్యయం రూ. 3,150 కోట్లు.

– విశాఖ-రాయపూర్ మధ్య 464 కి.మీ. నిడివిన నిర్మించనున్న ఎక్స్ ప్రెస్ వే అత్యంత కీలకమైనది. రెండు పోర్టులు, రెండు స్టీల్ ప్లాంట్లు, నాల్కో వంటి భారీ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేసే ఈ రహదారి సరుకు రవాణాలో కీలకంగా మారనుంది. ఏపీలో విశాఖ, విజయనగరం జిల్లాల మీదుగా 100 కి.మీ. నిడివిన సాగే ఈ రహదారి నిర్మాణానికి మొత్తం రూ.4,200 కోట్లు ఖర్చు చేయనున్నారు.

– 457 కి.మీ. పొడవైన విజయవాడ-నాగపూర్ హైవే మన రాష్ట్రంలో 29 కి.మీ. మేరకు సాగుతుంది. దీనికి రూ. 1218 కోట్లు ఖర్చు కానున్నాయి.

– కర్నూలు-షోలాపూర్ మధ్య నిర్మించనున్న 318 కిలోమీటర్ల రహదారి మన రాష్ట్రంలో 10 కి.మీ. నిడివిన సాగుతుంది. దీనికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తారు.

– హైదరాబాద్-విశాఖపట్నం మధ్య 521 కి.మీ. నిడివిన ఏజెన్సీ ప్రాంతాల మీదుగా రహదారి నిర్మిస్తారు. మన రాష్ట్రంలో 72 కి.మీ. నిడివిన సాగే ఈ మార్గం నిర్మాణానికి రూ. 3,024 కోట్లు ఖర్చు చేస్తారు.

Also Read : పీఆర్సీని ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌ .. సంక్రాంతి ముందే ఉద్యోగులకు వరాలు