iDreamPost
android-app
ios-app

విశాఖ ఉక్కు వాటాల విక్రయం దిశగా కేంద్రం అడుగులు?

  • Published Jan 30, 2021 | 2:04 PM Updated Updated Jan 30, 2021 | 2:04 PM
విశాఖ ఉక్కు వాటాల విక్రయం దిశగా కేంద్రం అడుగులు?

విశాఖ ఇప్పుడంటే మహానగరం గానీ 4 దశాబ్దాల కింద అక్కడి పరిస్థితి వేరు. స్వాతంత్రానంతరం నగరంలో షిప్ యార్డ్ సహా పలు పరిశ్రమలు రావడంతో కొంత అభివృద్ధి జరిగింది. కానీ విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణంతోనే ఆ నగర రూపు రేఖలు మారిపోయాయి. మహానగరంగా మారేందుకు రాచబాట పడింది. ప్రస్తుతం దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల్లో విశాఖకు చోటు దక్కడానికి దోహదపడింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఓ వైపు ప్రకృతి సోయగాలు, మరోవైపు సాగర హొయలతో పర్యాటకులనే కాకుండా, సహజవనరుల రీత్యా పారిశ్రామికవేత్తలను కూడా ఆకర్షిస్తున్న ఈ నగరానికి మణిదీపంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ప్రైవేటు చేతుల్లోకి వైజాగ్ స్టీల్ వెళుతుందా అనే చర్చ మొదలయ్యింది.

పోరాటాల ఫలితం విశాఖ ఉక్కు

విశాఖ ఉక్కు కర్మాగార నిర్మాణం వెనుక ఎన్నో త్యాగాలున్నాయి. ఎందరో అమరులయిన అనుభవాలున్నాయి. పలు పోరాటాల ఫలితంగా కనిపిస్తుంది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదం 60,70 దశకాలలో విరివిగా వినిపించింది. విస్తృత ఉద్యమాలకు వేదికయ్యింది. చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి పరిశ్రమ నిర్మాణానికి పూనుకోవడంతో 1980వ దశకం తొలినాళ్లలో వైజాగ్ స్టీల్ మనుగడలోకి వచ్చింది.

1966 నవంబర్ ఒకటిన ఒక్క రోజులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా కలిపి విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్న వారిలో 32 మంది ప్రాణాలు విడిచారు. పోలీసు కాల్పులతో విశాఖలో సాగుతున్న నిరసన ప్రదర్శనలో ముగ్గురు విద్యార్థులతో పాటుగా ఆరుగురు మరణించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మూడు పదుల మంది ప్రాణాలు కోల్పోయే స్థాయిలో ఈ పోరాటం సాగిందంటే ఆ సమరశీలత అర్థం చేసుకోవచ్చు. చివరకు కేంద్రం దిగి వచ్చి అర్థ శతాబ్దం క్రిందట 1971లో శంకుస్థాపన చేసేందుకు సిద్ధమయ్యింది.

అప్పటికే ఉత్తర భారతదేశంలో రూర్కెలా(ఒడిశా), భిలాయ్(చత్తీస్ ఘడ్), అసన్‌సోల్ (పశ్చిమబెంగాల్)లలో మూడు ఉక్కు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. నాలుగో పంచవర్షఫ్రణాళికలో భాగంగా మరో రెండు ఉక్కు పరిశ్రమలు నెలకొల్పాలని నిర్ణయించారు. అందులో ఒకటి బొకారో స్టీల్ ప్లాంట్ కాగా, రెండోది దక్షిణ భారతంలో నిర్మించాలనే ఆలోచన రాగానే విశాఖ ఉక్కు ప్రస్తావన ముందుకొచ్చింది. అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు పి.వెంకటేశ్వర్లు (సీపీఐ), టి.నాగిరెడ్డి (సీపీఎం), జి.లచ్చన్న (స్వరాజ్య), తెన్నేటి విశ్వనాథం (నేషనల్ డెమొక్రాట్స్), వావిలాల గోపాల కృష్ణయ్య(ఇండిపెండెంట్) తదితరులు ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపారు.

దేశంలోనే అత్యున్నత స్థానానికి విశాఖ ఉక్కు

దేశంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అత్యున్నత స్థానంలో ఉంది. ఆర్ఐఎన్ఎల్‌లో 17 వేలమంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏటా 6.3 మెట్రిక్ టన్నుల మేర స్టీల్‌ను ఉత్పత్తి అవుతుంది ఇందులో. ఈ స్టీల్ ప్లాంట్ ఉత్పాదక సామర్థ్యాన్ని 7.3 మెట్రిక్ టన్నులకు పెంచాలనే డిమాండ్ కొంతకాలంగా ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. 2020 సంవత్సరం కోవిడ్‌ వంటి ఎన్నో సవాళ్లను అధిగమించి 2020 డిసెంబర్‌ నాటికి దేశీయ మార్కెట్‌లో రూ.3109 కోట్ల అంటే 141 శాతం మేరకు రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేసింది. మధ్యలో కొన్నాళ్ల పాటు పరిశ్రమకు కొన్ని నష్టాలు తప్పడం లేదని రికార్డులు చెబుతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1,369 కోట్ల రూపాయల నష్టాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ చవి చూసింది. అనంతరం అద్భుత ఫలితాలను సాధించగలిగింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2018-19 ఆర్థిక సంవత్సరానికి నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా.. 97 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఆ తరువాత మళ్లీ వరుసగా రెండేళ్ల పాటు నష్టాల్లో మునిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,910 కోట్ల రూపాయల నష్టాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సామర్థ్యం రీత్యాను, నాణ్యతలోనూ విశాఖ ఉక్కుకి మంచి కీర్తి గడించింది. సొంతంగా ఐరన్ ఓర్ గనులు కేటాయించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో స్పందించలేదు.

వాటాల విక్రయం దిశగా వేగంగా అడుగులు

మోడీ ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆర్ఐఎన్ఎల్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని, ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఇదివరకే ఎయిరిండియా, జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), భారత్ పెట్రోలియం, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ వంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఎయిరిండియాను విక్రయించడానికి నాలుగైదేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. కొనడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపట్లేదు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు చెందిన సేలం, దుర్గాపూర్, భద్రావతి ప్లాంట్లను ఇదివరకే అమ్మకానికి ఉంచింది.

తాజాగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)కు చెందిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని విక్రయించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సిద్దం చేసింది. తాజా కేబినెట్ భేటీలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉన్న వైజాగ్ స్టీల్ లో వందశాతం కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. అదే సమయంలో దీన్ని విక్రయానికి ఉంచాలంటూ కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్మికుల్లో ఆందోళన మొదలయ్యింది. ఏపీ ప్రభుత్వపక్షం వైఎస్సార్సీపీ, విపక్ష టీడీపీలు ఈ విషయంలో ఎలా స్పందిస్తాయన్నది కీలకంగా మారింది. పార్లమెంట్ లో విశాఖ ఉక్కు పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన పట్ల ఏమేరకు స్పందిస్తారన్నది చూడాలి.