కొత్త జాతీయ రహదారి 167కే.. కృష్ణానదిపై పొడవైన వంతెన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌ నగర్‌ జిల్లా కల్వకుర్తి నుంచి కర్నూలు జిల్లా కరివెను వరకూ ఉన్న 122 కిలోమీటర్ల మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించింది. దీనికి 167 కే జాతీయ రహదారిగా నామకరణం చేసింది. భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా 122 కిలోమీటర్లను అభివృద్ధి చేయనుంది.

భారత్‌మాల ఫేజ్‌ – 1లో భాగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. ఇందు కోసం 820 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల పొడవైన భారీ వంతెనను నిర్మించనున్నారు. తెలంగాణ రాష్ట్రం నాగర్‌ కర్నూలు జిల్లా సోమశిల నుంచి సంగమేశ్వరం మీదుగా కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రాంతం మధ్య నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు.

2007లో కృష్ణా నదిలో తెప్ప ప్రమాదం జరిగింది. సింగోటం జాతరకు కర్నూలు జిల్లా ఆత్మకూరు, సంగమేశ్వరం ప్రాంతానికి చెందిన వారు తెప్పమీద వస్తూ నదిలో ప్రమాదం జరిగి 60 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ 2008లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.

వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు, టీడీపీ ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి సారించలేదు. పుష్కర కాలం తర్వాత నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రతిపాదనలు ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఆచరణలోకి వస్తున్నాయి.

కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణంతో సహా జాతీయ రహదారిగా మహబూబ్‌ నగర్‌ జిల్లా కల్వకుర్తి నుంచి కర్నూలు జిల్లా కరివెను మార్గాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు ఉపయోగంగా ఉంటుంది. ఆత్మకూరు పరిసర ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రాంతానికి రాకపోకలు సాగించేందుకు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండాపోతుంది. ఫలితంగా ప్రయాణ దూరం తగ్గుతుంది.

Show comments