Idream media
Idream media
గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 941 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 12,759 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. వైరస్ కారణంగా ఈరోజు 37 మంది మరణించారని చెప్పారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 420 కి చేరింది. వైరస్ నుంచి 1,515 మంది కోలుకున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 2.90 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపారు.
ఈనెల 25వ తేదీ నుంచి దేశంలో రంజాన్ మాసం ప్రారంభం కాబోతోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సమయంలో సామూహిక ప్రార్థనలు చేస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ వచ్చే నెల 3వ తేదీ వరకు అమల్లో ఉండనుంది. అంతకు దాదాపు వారం రోజులు ముందుగానే రంజాన్ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో సామూహిక ప్రార్థనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దేశంలో 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వీటి పరిధిలో దేశవ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల మసీదులు, దర్గాలు ఉన్నాయి. రంజాన్ మాసంలో ఇళ్ల వద్దనే ప్రార్ధనలు చేసుకునేలా వక్ఫ్ బోర్డు నుంచి ఆయా దర్గాలు, మసీదులకు కేంద్ర మైనారిటీ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సామూహిక మత ప్రార్థనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు ఇప్పటి నుంచే చేపడుతోంది.