iDreamPost
android-app
ios-app

సెలెబ్రిటీలు స్పందించరేం…?

సెలెబ్రిటీలు స్పందించరేం…?

ఈ మధ్య దేశంలో జరుగుతున్న పరిణామాలపై సెలెబ్రిటీలు స్పందించడం లేదని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ స్పందిస్తే ఆ విషయంలో ఎందుకు స్పందించారంటూ మరికొందరు స్పందించిన సెలెబ్రిటీలపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు పలువురు సెలెబ్రిటీలు.

గతంలో దేశంలో అరాచక పాలన సాగుతుందంటూ బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన ప్రకాష్ రాజ్, కమల్ హాసన్ ల వ్యాఖ్యలపై కొందరు నిరసనలు వ్యక్తం చేస్తూ కేసులు కూడా పెట్టారు. మరికొందరేమో ఆ వ్యాఖ్యలను సమర్ధించారు. తాజాగా JNU లో జరిగిన దాడిని ఖండిస్తూ, విద్యార్ధులకు సంఘీభావాన్ని తెలిపిన దీపికా పదుకుణే తీరును కొందరు తప్పుబట్టగా ఆమె చేసిన పని సరైనదే నంటూ దీపికా చేసిన పనిని మెచ్చుకుంటూ ఆమెకు తమ మద్దతు తెలిపారు.

కాగా దీపికా నటించిన చపాక్ సినిమాను బహిష్కరించాలని ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారి సంఖ్య కూడా తక్కువేమి కాదు. ఏదైనా విమర్శ చేస్తే ఆ విషయం కాస్తా తమ మెడకు చుట్టుకుంటుందేమో అన్న భయంతో కొందరు సెలెబ్రిటీలు కొన్ని విషయాల పట్ల స్పందించడానికి భయపడుతున్నారు. కొందరు మాత్రమే ధైర్యం చేసి తమ భావాలను వెల్లడి చేస్తున్నారు. JNU పై దాడి విషయంలో దీపికకి మద్దతుగా కంగనా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.. శృంగార తార సన్నీ లియోన్ కూడా JNU దాడిని ఖండిస్తూ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పుపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అమరావతి ప్రాంతంలో ఏర్పడ్డాయి. తాజాగా అమరావతి విషయంలో స్పందించాలని తెలుపుతూ హైదరాబాద్ లో ఉన్న మహేష్ బాబు ఇంటిముందు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకి ప్రయత్నించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలా నిరసన వ్యక్తం చేసిన ముగ్గురిని పోలీస్ స్టేషన్ కు తరలించడం వార్తల్లో నిలిచింది.

ఏదైనా విషయంలో స్పందించాలా వద్దా అనేది ఆయా వ్యక్తుల వ్యక్తిగత విషయం. కానీ సెలెబ్రిటీలు స్పందించడం లేదని నిరసనలు వ్యక్తం చేయడం, స్పందించిన వారినేమో విమర్శిస్తూ ఉండటంతో అడకత్తెరలో పోక చెక్క మాదిరి అయ్యింది సెలెబ్రిటీల పరిస్థితి. భావ ప్రకటన హక్కుని రాజ్యాంగం మనకు ప్రసాదించింది. ఏదేమైనా ఇవేమి పట్టించుకోని కొందరు సెలెబ్రిటీలు స్పందించడం లేదని, ఒకవేళ స్పందించినా తమకు అనుకూలంగా స్పందించలేదని సెలెబ్రిటీలను ట్రోల్ చేస్తూ కాలం గడుపుతున్నారు. దీంతో సెలెబ్రిటీలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే అనవసర వివాదాలకు కేంద్ర బిందువులు కాకుండా మౌనంగా ఉంటున్నారని కొందరు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.