అరాచకంలోకి దిగజారుతున్న అనుభవం

చంద్రబాబు నాయుడు గురించి అభిమానులు విజనరీ అని, అపర చాణక్యుడు అని, గిట్టనివారు మీడియా మేనేజర్ అని, మానిప్యులేటర్ అనీ అంటారు. అయితే ఎవరైనా ఒప్పుకునే విషయం ఏమిటంటే ఆయన ఎంతటి క్లిష్టమైన పరిస్థితిలో అయినా నిబ్బరం కోల్పోకుండా ఉంటారన్నది. ఎన్టీఆర్ ని దించిన ఆగస్టు సంక్షోభం సమయంలో కానీ, తన నాయకత్వంలో విజయం సాధించినప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి చేతిలో రెండు సార్లు వరుసగా ఓడిపోయినప్పుడు కానీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాడు. ఓడిపోయినందుకు కృంగిపోకుండా రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలో అన్నదాని మీదే తన దృష్టి నిలిపి ముందుకు పోయాడు.

అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేతిలో దారుణ పరాజయం ఎదుర్కున్నాక మునుపటి నిబ్బరం చూపించలేక పోతున్నాడు చంద్రబాబు. అందుకు ఒక కారణం ఇది ఆయన ఏమాత్రం ఊహించని ఓటమి. ఆయన చుట్టూ ఉన్న కోటరీలాంటి మీడియా చివరి వరకూ “ఆల్ ఈజ్ వెల్” అన్న భ్రమలో ఆయన్ని ఉంచడం ఒక కారణం అయితే, ప్రజలు జగన్ లాంటి అనుభవం లేని వ్యక్తిని నమ్మి తనని ఓడిస్తారు అని ఆయన అనుకోలేదు.

Also Read:జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అరెస్ట్

ఇప్పుడు ఆయన్ని వేధించే మరొక విషయం అంధకారంగా కనిపించే భవిష్యత్తు. తనకి వయసు పైన పడుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకిశోరం ఆశించిన ప్రభావం చూపించలేకపోవడం, తనవల్ల, పార్టీ వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందిన నాయకులు ఒకరొకరుగా పార్టీని వదిలి పోతూ ఉండడం కూడా ఆయనలో ఆవేదన రేకెత్తడానికి కారణాలు అవుతూ ఉన్నాయి.

అచ్చెన్నాయుడి అరెస్టు-చంద్రబాబు స్పందన
తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు పట్ల చంద్రబాబు స్పందించిన వైనం చూస్తేనే ఆయన మానసికంగా ఎంత అశాంతిలో ఉన్నారో అర్థం అవుతోంది. ఇదివరకు అయితే చేతనైతే మా ఎమ్మెల్యే మీద ఆరోపణలు నిరూపించండి చూద్దాం అని, న్యాయస్థానంలో తేల్చుకుందాం అని కనీసం మాటల్లో ధీమా చూపించి ఉండేవాడు.

ఇప్పుడు తన స్థాయికి ఏమాత్రం తగినట్లు లేకుండా కులం కార్డును తెర మీదకు తీసుకొచ్చాడు చంద్రబాబు. అచ్చెన్నాయుడు అక్రమాలకు పాల్పడలేదు అనకుండా, ఫలానా సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి అరెస్టు చేశారు, ఇది ఆ వర్గం మీద ప్రభుత్వం చేసిన దాడి అని ఒక విచిత్రమైన వాదన తెరమీదకు తీసుకొచ్చాడు.

చంద్రబాబు కులం కార్డును ప్రభుత్వం మీద ప్రయోగించడం ఇది మొదటిసారి కాదు. ఇటీవల ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ విషయంలో కూడా దళిత కార్డు వాడాలని చూశాడు కానీ, సుధాకర్ ఎపిసోడ్ కెమెరాల కంట పడి, రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు కాబట్టి అది అంతగా పేలలేదు.

Also Read:తరువాత ఎవరు? తెలుగు తమ్ముళ్లలో టెన్షన్…

ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్టు బీసీల మీద దాడి అనీ, రాష్ట్రంలో బీసీలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని అరాచకం రేకెత్తించే పిలుపు ఒకటి ప్రజలకు ఇవ్వడమే చంద్రబాబును అభిమానించే వారు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. అచ్చెన్నాయుడు నిర్దోషి అన్న నమ్మకం ఉంటే ఆ విషయం నిరూపించుకోవడానికి కోర్టులున్నాయి. అక్కడ పోరాటం చేయాలి కానీ, ప్రజలను ఉద్యమించమని పిలుపునివ్వడం ఏ విధంగా సమర్ధనీయం?! పైపెచ్చు అచ్చెన్నాయుడు అరెస్టుకీ, అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికీ పోలిక తీసుకొచ్చి, అక్కడ ప్రజలు ఉద్యమించినట్టు రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చాడు.

ఇదే లాజిక్ అనుసరించి భవిష్యత్తులో ఎవరినైనా అవినీతి ఆరోపణల మీద అరెస్టు చేస్తే అతని కులానికి, మతానికో చెందిన వారందరూ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాలని చంద్రబాబు కోరుతున్నారా?! ఒక జాతీయ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా పని చేసిన వ్యక్తీ, దేశంలోకెల్లా సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు స్థాయికి తగిన పనులా ఇవి?!

రాజకీయ జీవితం చరమాంకంలో ఉన్న చంద్రబాబు సంకుచిత ప్రయోజనాల కోసం కాకుండా, రాబోయే తరాలు, చరిత్ర ఉన్నతంగా గుర్తుంచుకునేలా ప్రవర్తిస్తే బావుంటుందని గ్రహిస్తే మంచిది.

Show comments