iDreamPost
iDreamPost
చంద్రబాబు ఆరోపణలన్నీ నిరాధారమని నిరూపించబడుతున్నాయి. నిజాలు కావని తేలిపోతోంది. ఇన్నాళ్లుగా జగన్ తో పాటుగా ఆయన స్థాపించిన సాక్షి సంస్థలపై టీడీపీ చేసిన ప్రచారమంతా బురదజల్లుడని రుజువవుతోంది. అవినీతి, అక్రమాలంటూ సాగించిన వాదనంతా దుష్ప్రచారమని అర్థమవుతోంది. దాంతో చంద్రబాబుకి చిరాకు కలిగిస్తోంది. తాను చెప్పినట్టుగా సంస్థలన్నీ నడవాలి, తాను చెప్పిందే వాస్తవమని చెప్పాలన్నట్టుగా ఆయన తీరు కనిపిస్తోంది. అందుకే తాజాగా ఇన్ కమ్ ట్యాక్స్ అప్పీలేట్ తీర్పుని బాబు తప్పుబడుతున్నారు. మరోసారి సాక్షి సంస్థలను నడుపుతున్న జగతి పబ్లికేషన్స్ మీద విషం జల్లడానికే పరిమితమవుతున్నారు.
నిజానికి దేశంలో ఏ నిందా నిరూపించకుండా ఎవరూ దోషులు కారు. కేవలం నిందితులు మాత్రమే అవుతారు. కానీ ఏపీలో ఓ వర్గం మీడియా, టీడీపీ నేతలు మాత్రం జగన్ ని దాదాపుగా ప్రపంచ క్రిమినల్ అనేటంత స్థాయిలో ప్రచారం చేశారు. లక్షల కోట్ల అవినీతి అంటూ నిత్యం వల్లించారు. వాటి ప్రభావం కూడా మధ్యతరగతి మీద పడింది. 2014లో స్వల్ప ఓట్ల తేడాతో చంద్రబాబు గెలుపునకు అది కూడా కొంత తోడ్పడిందనే చెప్పవచ్చు. కానీ చంద్రబాబు అండ్ కో చేసిన ప్రచారం పూర్తిగా నిందలు మాత్రమేనని, నిజాలు కావని జగన్ అప్పుడూ, ఇప్పుడూ చెబుతూనే ఉన్నారు.. ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా చాటుతున్నాయి. ఇది చంద్రబాబుకి జీర్ణం కావడం లేదు.
జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో ఆదాయపన్ను శాఖ అప్పీలెట్ ట్రైబ్యునల్ తీర్పు పచ్చ బ్యాచ్ కి గిట్టడం లేదు. ఆ సంస్థ పెట్టుబడుల కేసులో వైఎస్ జగన్ తో పాటుగా జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు భారీ ఊరట కలిగించడం సహించలేకపోతున్నారు. తమ ప్రచారమంతా డొల్ల తప్ప వాస్తవం లేదని ప్రజలకు ఈ తీర్పు చెబుతుండడం టీడీపీ కి మింగుడుపడడం లేదు. జగతి పబ్లికేషన్‌లో వివిధ కంపెనీలు పెట్టిన పెట్టుబడులను క్విడ్ ప్రోకోగా చూడలేమంటూ తేల్చి చెప్పడాన్ని తట్టుకోలేని స్థాయికి చేరుకున్నారు.
Also Read : చంద్రబాబుకు మరోసారి స్టే పొడిగింపు
తాజాగా ఆదాయపన్ను శాఖ అధికారుల మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దానికి అద్దంపడుతున్నాయి. జగన్ కేసుల్లో అవినీతి జరగిందనే దానికి ఆధారాలు లేవని అనేక మంది చెబుతూనే ఉన్నారు. అయినా తనను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలు పాలుజేశారని జగన్ వాపోయారు. అయినా ఆటంకాలను అధిగమించి కేసులను ఎదుర్కొంటూ ప్రజా జీవితంలో జగన్ జన విజేతగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ కేసులన్నీ కేవలం కుట్రపూరితమనే జగన్ వాదనకు బలపరిచేలా తీర్పులు వస్తున్నాయి. చివరకు కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానని జగన్ చెప్పిన మాటకు అనుగుణంగా ఫలితాలున్నాయి.
ఈ తరుణంలో అడ్డదారులలో సంపాదించడం జగన్ మోడల్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయనలో అసహనాన్ని తెలియజేస్తున్నాయి. జగన్ తో పోలిస్తే చంద్రబాబు జీవితం సాధారణంగా మొదలయ్యింది. అసాధారణ స్థాయికి ఆయన ఆస్తులు చేరుకున్నాయి. హెరిటేజ్ వంటి భారీ సంస్థలను చంద్రబాబు సంపాదించారు. ఇతర అనేక బినామీల వ్యవహారం రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు.
అయినప్పటికీ జగన్ మీద మాత్రం అవినీతి ముద్ర వేసి చంద్రబాబు, సోనియా గాంధీ సంయుక్తంగా పన్నిన కుట్ర ఫలితాలు ప్రజలు గుర్తించారు. చివరకు ఇప్పుడు ఒక్కో కేసులోనూ జగన్ మీద వేసిన నిందలన్నీ చెల్లాచెదురుకావడం టీడీపీ నేతల అసత్య ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు దోహదపడుతోంది. ఇన్నాళ్లుగా జగన్ ని బూచోడిగా,అవినీతిపరుడిగా చిత్రీకరించిన టీడీపీకి ఇప్పుడు తాము చేసినంతా దుష్ప్రచారంగా తేలడంతో తల్లడిల్లిపోతున్నట్టు స్పష్టమవుతోంది. చంద్రబాబు వ్యాఖ్యలు దానికి అద్దంపడుతున్నాయి.
Also Read : రఘురామకృష్ణంరాజు ఇంటికి మరోసారి ఏపీ సీఐడీ అధికారులు, అసలేం జరుగుతోంది..