iDreamPost
iDreamPost
బీజేపీ ఓ అవకాశం ఇస్తే కమలం కౌగిలిలో వాలిపోవాలని చంద్రబాబు ఆశిస్తున్నారు.. కానీ అది జరిగే పనికాదని భాజపా అధిష్టానం అంటోంది. అయినప్పటికీ బీజేపీ , టీడీపీలను ఒకే గూటికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇదే బాధ్యత తీసుకుని బీజేపీలో ఉన్న బాబు వర్గం పనిచేస్తోంది. వారికి తోడుగా జనసేనాని కూడా మళ్లీ 2014 ని పునరావృతం చేయాలని ఆశిస్తున్నారు. కానీ పరిస్థితులు దానికి అనుకూలంగా లేకపోవడంతో అంతా వన్ సైడ్ లవ్ అన్నట్టుగా మిగిలిపోతోందనే అభిప్రాయం ఇటీవల బాబు కూడా వ్యక్తపరిచారు.
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వ్యవహారం బీజేపీ నేతలు మరచిపోయేలా కనిపించడం లేదు. అప్పట్లో ఆయన చేసిన హంగామా, మోదీకి వ్యతిరేకంగా సాగించిన ప్రచారం అంతా ఇంతా కాదు. కాబట్టే ఇక బాబుని దగ్గరికి రానివ్వకూడదనే ఉద్దేశంలో బీజేపీ ఉంది. కానీ రాబోయే రెండేళ్లలో ముఖ్యంగా యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏదోటి జరగకపోతుందా అనే ఆశ మాత్రం టీడీపీ అధినేతలో ఉంది. అదే సమయంలో జనసేనాని చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాన్నిస్తాయనే అభిప్రాయం కూడా కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేస్తోంది. ఆపార్టీ శ్రేణుల నుంచి నాయకుల వరకూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా పవన్ ని కొనియాడే ప్రయత్నంలో కొందరు నేతలున్నారు. చివరకు కుప్పంలో చంద్రబాబుకే కొందరు కార్యకర్తలు సూచనలు చేశారు. ఎన్నికల్లో పొత్తు గురించి మాట్లాడుతూ జనసేనను కలుపుకుని పోవాలని సూచించారు. ఆ సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశాలయ్యాయి. అంతిమంగా ఎన్నికలకు ఇంకా గడువు ఉన్నందున పొత్తుల గురించి అప్పుడే మాట్లాడుదామనే రీతిలో ముగించారు. పైగా తాము ఒంటరిగా గెలవలేమని కొందరు అంటున్నారంటూ బాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం.
తాజాగా పవన్ కూడా తమ పొత్తులకు సంబంధించి చేసిన ప్రకటన సరిగ్గా బాబు తీరులోనే ఉంది. ఇప్పటికే బద్వేలు ఉప ఎన్నికలు సహా అనేక సందర్భాల్లో చంద్రబాబు మాటలనే జనసేన తనదైన పదాల్లో వల్లిస్తోంది. దాదాపుగా టీడీపీ వైఖరినే తమ విధానంగా మార్చుకుంటోంది. ఇప్పుడు ఎన్నికల పొత్తుల విషయంలో కూడా ఎన్నికలకు ఇంకా సమయమున్నందున అప్పుడే ఆలోచిద్దామంటూ పవన్ తన శ్రేణులకు తెలిపారు. అదే సమయంలో పొత్తుల గురించి సాగుతున్న ప్రచారం ఓ మైండ్ గేమ్ గా వర్ణించారు. ఇంతకీ మైండ్ గేమ్ అడుతున్నది టీడీపీ నేతలా, లేక ఇంకెవరైనా అన్నది పవన్ చెప్పకపోవడం గమనార్హం. కానీ సరిగ్గా చంద్రబాబు తీరులోనే ఎన్నికల పొత్తు గురించి ఇంకా టైముందని, ప్రస్తుతానికి పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలని కార్యకర్తలకు పిలుపునివ్వడం గమనార్హం.
టీడీపీ, జనసేన నేరుగా పొత్తు పెట్టుకున్నా లేకున్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్నేహం మాత్రం లింగమనేని ఎస్టేట్స్ మీదుగా వర్థిల్లుతోందన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న ప్రచారం. దానికి తగ్గట్టుగానే తాజా వ్యాఖ్యానాలు, చర్చలు సాగుతున్న తీరు గుర్తించాల్సి ఉంటుంది. పొత్తుల విషయంలో కూడా ఈ ఇద్దరు నేతలు ఒకే రీతిలో స్పందించడం కూడా కీలక సంకేతం. చివరకు బీజేపీ, టీడీపీ ఒకే బాటలోకి రాకపోతే పవన్ ఏం చేస్తారన్నదే ప్రశ్నార్థకం. బీజేపీని వీడి మళ్లీ బాబు పక్షాన చేరతారా లేక బీజేపీ కౌగిలి నుంచి బయటపడలేక , బాబుకి దగ్గర కాలేక అన్నట్టుగా ఉక్కిరిబిక్కిరి పరిస్థితి ఎదుర్కొంటారా అన్నది చూడాలి. అన్ని ఆటంకాలు చేధించి రెండు పార్టీలను ఒకే గూటికి చేరిస్తే మాత్రం కొంత ప్రభావం చూపగల స్థాయికి చేరుకుంటారని భావించవచ్చు.
Also Read : 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం లేకుంటే టీడీపీ గెలిచేదా?