Idream media
Idream media
టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం రాయపాటి నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో సీబీఐ అధికారులు రైడ్స్ చేశారు. ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంపై ఈ సోదాలు జరుగుతున్నాయని సమాచారం.
రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ నిర్మాణ సంస్థపై బ్యాంకు మోసాల కింది సీబీఐ కేసులు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసుపై సీబీఐ విచారణ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సీబీఐ సోదాలు నిర్వహిస్తోందని తెలుస్తోంది. సీబీఐ సోదాలు చేసే సమయంలో రాయపాటి ఇంట్లోనే ఉన్నారు. గతంలోనూ సీబీఐ అధికారులు రాయపాటి ఇంట్లో ఇదే విషయంపై సోదాలు నిర్వహించారు.
ట్రాన్స్ ట్రాయ్ నిర్మాణ సంస్థకు రాయపాటి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరం పనులను ట్రాన్స్‌ట్రాయ్‌కే అప్పటించారు. ట్రాన్స్ ట్రాయ్‌కి ఆర్థిక సామర్థ్యం లేదని, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టులను నిర్మించే సత్తా లేదనే విమర్శలు వచ్చినా.. చంద్రబాబు ఆ సంస్థకే నిర్మాణ పనులను కట్టబెట్టారనే విమర్శలు వచ్చాయి. కొద్ది రోజులకే ఆ విమర్శలు నిజమనేలా.. ట్రాన్స్ ట్రాయ్ పనులను సబ్‌కాంట్రాక్టర్లకు ఇవ్వడం మొదలుపెట్టింది. వారికి బిల్లులు చెల్లించడంలోనూ ఆలస్యం చేయడంతో వారు పనులు మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. పలుమార్లు కూలీలకు చెల్లింపులు లేకపోవడం, వాహనాలకు డీజిల్ లేదనే కారణంతో పనులు ఆగిపోయిన ఘటనలు పోలవరంలో ఉన్నాయి.