మరో ఆంధ్రామాల్యా టీడీపీ నేత రాయపాటి 

వేల కోట్ల రుణాలు తీసుకొని బ్యాంకులకు కుచ్చు టోపీ పెడుతున్న వారి లిస్టులో మరో టీడీపీ నేత చేరిపోయారు . గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి విదేశీ బ్యాంక్ ల వద్ద పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటుండగా ఇప్పుడు అదే టీడీపీ నుండి మరో మాజీ ఎంపీ రాయపాటి శ్రీనివాసరావు ఎగవేత లిస్ట్ లో చేరారు .

రాయపాటి కుటుంబానికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ తమ వద్ద తీసుకొన్న రుణాలకు సంభందించి 1172 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడంతో NPA (non performing asset) గా పరిగణించిన కెనరా బ్యాంక్ RBI కి తెలియజేయడంతో పాటు లోను ఖాతాల నిర్వహణలో పలు అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ CBI కి పిర్యాదు చేసింది . తమ బ్యాంక్ నుండే కాక దాదాపు పదిహేను ప్రభుత్వ రంగ బ్యాంక్ ల నుండి సీసీ , ఓడీ , ఎల్వోసీ ల రూపంలో తీసుకొన్న రుణాల తాలూకూ అన్ని బ్యాంక్ లకు చెల్లించాల్సిన బకాయిలు 9100 కోట్ల పై చిలుకుగా వెల్లడించారు . ట్రాన్స్ ట్రాయ్ కి ఋణాలిచ్చిన బాధిత బ్యాంక్ ల కన్సార్టియం కి కెనరా బ్యాంక్ లీడ్ గా వ్యవహరిస్తోంది .

మొదట పొగాకు వ్యాపారంలో ఉన్న రాయపాటి కుటుంబం 2001 లో రాయపాటి కుటుంబ సభ్యుల పేరిట ఏర్పడిన ట్రాన్స ట్రాయ్ సంస్థలో రాయపాటి భార్యతో పాటు చెరుకూరి శ్రీధర్ , మరికొందరు కుటుంబ సభ్యులు , బంధువులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు . రాయపాటి పై 70 వ దశకంలోనే చైనాకు పొగాకు ఎగుమతి విషయంలో దేశవ్యాప్తంగా పలు ఆరోపణలు వచ్చాయి . ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత పలు రాష్ట్రాల్లో కాంట్రాక్టులు నిర్వహించిన రాయపాటి కుటుంబం వాటి నిర్వహణ నిమిత్తం పేరిట పలు ప్రభుత్వ బ్యాంకుల్లో భారీ మొత్తాలు లోన్లుగా తీసుకొంది .

సంస్థ అప్పు తీసుకొన్న బ్యాంక్ ల నిబంధనల ప్రకారం ఖాతాలోని సొమ్ము తాము వ్యాపార లావాదేవీలు జరుపుతున్న మరో ఖాతాకే బదలాయించాలి తప్ప నగదు రూపంలోకి మార్చుకొనే వెసులుబాటు లేకపోవడంతో మరో మోసానికి తెర తీసింది ట్రాన్స్ ట్రాయ్ . సంస్థకు డైరెక్టర్లగా ఉన్న రాయపాటి కుటుంబ సభ్యుల , బంధువుల వద్ద పని చేసే డ్రైవర్లు , ఆయాలు , ఇంటి పని వారి పేరిట నకిలీ కంపెనీలు ఓపెన్ చేసి ట్రాన్స్ ట్రాయ్ నుండి ఆ కంపెనీల ఖాతాలకు నగదు బదిలీ చేసి చేతి వాటం ప్రదర్శించారని గుర్తించిన ఆయా బ్యాంకులు లబోదిబోమంటూ సీబీఐ కి ఆ వివరాలు అందించాయి .

వ్యాపారానికి అనుబంధంగా , మోసాలకు ఆలంబనగా రాజకీయ జీవితం .

దేశ విదేశాలలో నిర్వహించే పొగాకు లాంటి వ్యాపారాలకు రాజకీయ సహకార అవసరాన్ని గుర్తించిన రాయపాటి కాంగ్రెస్ పార్టీలో చేరి తొలుత గుంటూరు జిల్లా తాడికొండ సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు . 1982 లో 39 ఏళ్ల చిన్న వయసులోనే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోబడిన తర్వాత వెనుతిరిగి చూడలేదు రాయపాటి . కాంగ్రెస్ తరపున నాలుగు సార్లు లోకసభ ఎన్నికల్లో విజయం సాధించారు . విభజన తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో టీడీపీ తీర్థం పుచ్చుకొని 2014 లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు . 2019 లో కూడా టీడీపీ తరపున నరసరావుపేట నుండి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి వైసీపీ యువనేత లావు కృష్ణ దేవరాయలు చేతిలో ఓటమి పాలయ్యారు .

ఒక బ్యాంక్ నుండి ఏదేని సంస్థ వ్యాపార నిర్వహణ నిమిత్తం రుణం పొందిన తర్వాత వరుసగా మూడు నెలల పాటు ఆ ఖాతా నుండి లావాదేవీలు లేకపోవడం , వడ్డీ బకాయిలు చెల్లించకపోవడం జరిగితే NPA ఫస్ట్ ఫేజ్ గా గుర్తిస్తారు . తర్వాతి దశల్లో కూడా స్పందన లేకపోతే పై అధికారుల దృష్టికి , RBI దృష్టికి తీసుకెళ్లి బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకొని తనఖా పెట్టిన ఆస్తుల స్వాధీనం , వేలం లాంటి చర్యల తర్వాత ఇంకా నిల్వ బకాయి ఉంటే సంస్థ యజమానులకు చెందిన తనఖా పెట్టని ఆస్తుల స్వాధీనానికి వెళ్లటంతో పాటు లోను మంజూరు చేయటంలో ప్రధాన పాత్ర పోషించిన అధికారుల పై చర్యలు తీసుకొంటారు. 

టీడీపీ నేత రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తీసుకొన్న లోను ఖాతాలను 2015 లోనే కొన్ని బ్యాంకులు NPA గా పరిగణించినా , ఇతర బ్యాంక్స్ నుండి పోలవరం పేరిట వేల కోట్లు రుణాలు పొందుతున్న నిమ్మకుండటం , 2020 ఫిబ్రవరి వరకూ RBI కి సమగ్రంగా తెలియజేయకపోవడం , విచారణ సంస్థలకు పిర్యాదు చేయకపోవడాన్ని గమనిస్తే ఇందులో బ్యాంక్ అధికారుల పాత్ర కన్నా రాష్ట్రంలో 2019 వరకూ అధికారంలో ఉన్న పార్టీతో రాజకీయ సత్సంబంధాలు ఉన్న పలు బ్యాంక్ డైరెక్టర్ల , పెద్ద అధికారుల పాత్ర పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . ట్రాన్స్ ట్రాయ్ తాను చేపట్టిన పలు ప్రాజెక్టుల్లో అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్నా , 2015 లోనే డిఫాల్టర్ గా పలు బ్యాంకుల్లో నమోదైనా , నాటి టీడీపీ పార్టీ ఏ అర్హతలు చూసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం రాయపాటి సంస్థకు అప్పజెప్పిందో టీడీపీ అధినేత చంద్రబాబుకే తెలియాలి . పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట వందల కోట్ల మొబైలైజేషన్ అద్వాన్సులు తీసుకొన్న ట్రాన్స్ ట్రాయ్ తర్వాతి కాలంలో చేతులెత్తేయడంతో నిర్మాణ బాధ్యతలను మరో కంపెనీకి అప్పజెప్పారు బాబు . బహుశా ఈ సంఘటనలు గమనించే అనుకొంటా పోలవరం చంద్రబాబుకి ఏటీఎం లా మారింది అని పలువురు జాతీయ నాయకులతో పాటు సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ కూడా ఆరోపించింది .

ప్రస్తుతం రాయపాటి సాంబశివరావు వయస్సు 77 ఏళ్ళు . వయసు రీత్యా గమనిస్తే ఈ ఎగవేత అంశాల పై 2020 నవంబర్ లో పిర్యాదు అందుకొన్న సీబీఐ దీని పై విచారణ జరిపి చర్యలు తీసుకొని బ్యాంకుల ద్వారా నష్టపోయిన ప్రజాధనాన్ని వెనక్కి తెప్పించడం , బాధ్యులను శిక్షింపజేయడం అసాధ్యమనే చెప్పొచ్చు . అందులోనూ స్టేలు పొందడంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బాబు గారి తెర వెనుక పాత్ర ఉందని దేశ ప్రధాని పలు వేదికల పై ఆరోపించిన ఈ కుంభకోణం ఆటకెక్కినట్టే అని పలువురు మేధావుల అభిప్రాయం .

Show comments