iDreamPost
android-app
ios-app

గాలి జనార్ధన్ రెడ్డికి భారీ షాక్.. ఆస్తుల సీజ్ చేయాలంటూ ఆదేశాలు!

  • Author Dharani Published - 05:45 PM, Wed - 14 June 23
  • Author Dharani Published - 05:45 PM, Wed - 14 June 23
గాలి జనార్ధన్ రెడ్డికి భారీ షాక్.. ఆస్తుల సీజ్ చేయాలంటూ ఆదేశాలు!

మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి, కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధినేత, ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన, ఆయన భార్య పేరు మీద ఉన్న ఆస్తులు జప్తు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొన్ని రోజుల్లోనే ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డి తన పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్ట్ ఆదేశాలతో ఆ ఆనందం ఆవిరి అయ్యే పరిస్థితి నెలకొంది.

గాలి జనార్ధన్ రెడ్డిపై నమోదైన అక్రమ మైనింగ్ కేసుల విచారణలో భాగంగా సీబీఐ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన భార్య అరుణ పేరు మీద ఉన్న 124 ఆస్తుల్లో వందకు పైగా ఆస్తులను జప్తు చేసుకోవాలని కోర్ట్ ఆదేశించింది. గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ పూర్తయ్యే వరకు ఈ ఆస్తులు జప్తులోనే ఉంటాయని సీబీఐ స్పెషల్ కోర్టు ఈ సందర్బంగా స్పష్టం చేసింది.

గాలి జనార్ధన్ రెడ్డి.. కర్ణాటకతోపాటు తెలంగాణలోనూ ఇళ్లు, ఇంటి స్థలాలు, ఫ్లాట్లతో పాటు వివిధ ఆస్తులను కొనుగోలు చేసినట్లు సీబీఐ బృందం గుర్తించింది. అక్రమ గనుల తవ్వకాలతోనే గాలి జనార్ధన్ రెడ్డి ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇక తాజాగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా.. గాలి జనార్దన్ రెడ్డి తన ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆ సందర్భంలో మాట్లాడిన గాలి జనార్ధన్ రెడ్డి.. మాట్లాడుతూ తాను జైలులో ఉన్న సమయంలో తనకు చెందిన రూ.1200 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారని.. కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేసి.. వాటిని వెనక్కి తెచ్చుకున్నట్లు వెల్లడించారు.

అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి.. కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు. ఈ పార్టీ తరఫున తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన భార్య అరుణ మాత్రం పరాజయం పాలయ్యారు.