iDreamPost
android-app
ios-app

సీబీఐ కస్టడీకి బొల్లినేని గాంధీ.. వెలుగులోకి రానున్న వందల కోట్ల ఆస్తులు

సీబీఐ కస్టడీకి బొల్లినేని గాంధీ.. వెలుగులోకి రానున్న వందల కోట్ల ఆస్తులు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్‌ అయిన బొల్లినేని గాంధీని సీబీఐ కస్టడీకి ఇస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు సీబీఐ గాంధీని తమ కస్టడీలోకి తీసుకోనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గాంధీని గత నెల 21వ తేదీన సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈడీ, జీఎస్టీ విభాగాల్లో పని చేసిన బొల్లినేని గాంధీ భారీగా అవినీతికి పాల్పడినట్లు తేలింది. దీంతోపాటు గత ఏడాది హైదరాబాద్‌లో ఓ వ్యాపారి నుంచి ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా సీబీఐకి పట్టుబడ్డారు. దీంతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు.

బొల్లినేని గాంధీ భారీగా ఆస్తులు పోగేసినట్లు సీబీఐ ప్రాథమికంగా గుర్తించింది. హైదరాబాద్‌తోపాటు అమరావతిలోనూ విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. అక్రమాస్తుల కేసుపై లోతైన దర్యాప్తు చేసేందుకు గాంధీని తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో విచారణ వేగవంతం కానుంది. హైదరాబాద్, అమరావతిలోని గాంధీ ఆస్తులు మార్కెట్‌లో 250 కోట్ల రూపాయల విలువ ఉంటాయని చెబుతున్నారు.

తాజా పరిణామం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. బొల్లినేని గాంధీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరొందారు. ఢిల్లీలో చంద్రబాబు తెరవెనుక వ్యవహారాలను గాంధీనే చక్కబెట్టేవారనే విమర్శలున్నాయి. అమరావతిలో భారీ ఆస్తులు ఉన్నట్లు సీబీఐ గుర్తించడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అమరావతిలో చంద్రబాబు, ఆయన సన్నిహితులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో భారీగా భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిపై జరుగుతున్న విచారణను కోర్టు స్టేల ద్వారా బాబు అండ్‌ కో నిలిపివేయించుకుంది. బొల్లినేని అక్రమాస్తుల వ్యవహారంలో అమరావతిలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Also Read : సీఐడీ మరో నోటీసు.. ఉమా మెంటల్‌గా ఫిక్స్‌ అయ్యారు..!