iDreamPost
iDreamPost
పరిశ్రమను కథల కరువు ఎంతగా పీడిస్తుందో తెలిసిందే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని చోట్లా ఇదే వరస. అందుకే ఇతర బాషల నుంచి రీమేక్ చేయడమో లేదా పాత క్లాసిక్ ని తవ్వి వాడుకోవడమో చేయాల్సి వస్తోంది. అలాంటి పనే చేసింది కెప్టెన్ టీమ్. అల్లు అర్జున్ వరుడులో విలన్ గా నటించిన తమిళ యాక్టర్ ఆర్య గుర్తున్నాడుగా. నేనే అంబానీ అనే డబ్బింగ్ అప్పట్లో బాగానే ఆడింది. ఆ మధ్య విశాల్ ఎనిమిలోనూ కనిపించాడు. అతను హీరోగా నటించిన సినిమానే ఈ కెప్టెన్. శక్తి సౌందర రాజన్ రాసి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించగా హరీష్ ఉత్తమన్, ఆదిత్య మీనన్ లాంటి ఇతర తారాగణం ప్రధాన క్యాస్టింగ్.
ఇక అసలు విషయానికి వస్తే ఈ కెప్టెన్ ఎప్పుడో 1987లో వచ్చిన ప్రిడేటర్ కు ఫ్రీ మేక్ లా తోస్తోంది. ఆ టైంలో అది బ్లాక్ బస్టర్. ఒక అడవిలో చిక్కుకున్న ఆర్మీని అంతుచిక్కని రీతిలో ఒక కనిపించని జంతువు అతి క్రూరంగా చంపుతూ ఉంటుంది. మాములు మనిషి కంటికి అందని ఆ వికృత రూపాన్ని అంతమొందించడానికి పూనుకుంటాడు హీరో. తోటి సహచరులందరూ చనిపోయినా ఒక్కడే పోరాటం మొదలుపెడతాడు. చాలా థ్రిల్లింగ్ గా సాగే ఈ అడ్వెంచరస్ డ్రామా ఇండియాలోనూ బ్రహ్మాండంగా ఆడింది. ముఖ్యంగా హోమ్ వీడియోలో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. కండల వీరుడు ఆర్నాల్డ్ స్వాజ్నెగ్గర్ పాపులర్ అయ్యింది దీంతోనే. అంత చరిత్ర ప్రిడేటర్ ది.
ఇప్పుడీ కెప్టెన్ కూడా అదే మోడల్ ని ఫాలో అయ్యాడు. ఇతర అంశాలు చాలానే జోడించినప్పటికీ మెయిన్ పాయింట్ మాత్రం ప్రిడేటర్ నుంచి ఇన్స్ ఫైర్ అయినట్టుగా కనిపిస్తోంది. కాకపోతే ఆ క్రియేచర్ కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా బెటర్ ఉండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజువల్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ రిచ్ గానే కనిపిస్తున్నాయి. తెలుగు వెర్షన్ ని నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ అందిస్తుండటం విశేషం. ఇటీవలే కమల్ హాసన్ విక్రమ్ రూపంలో ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా డబుల్ ప్రాఫిట్స్ అందుకున్న ఈ సంస్థ మాచర్ల నియోజకవర్గంతో షాక్ తింది. ఇప్పుడీ కెప్టెన్ మళ్ళీ ఏమైనా ఊపునిస్తుందేమో చూడాలి.