iDreamPost
iDreamPost
హెడ్డింగ్ చూసి సినిమా స్క్రీన్ ప్లే అలా పరుగులు పెట్టడం గురించి అనుకునేరు. కాదండి. చూశాక లేక చూస్తున్నంత సేపు థియేటర్ బయటికి ఎలా వెళ్ళాలో ఎదురు చూసే ఆడియన్స్ బిక్క చూపులనే అర్థంలో దీన్ని తీసుకోవాలి. నిన్న 9న బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ, ఒకే ఒక జీవితం విడుదల ఉండటంతో దానికన్నా ముందు 8న విడుదలైన సినిమా కెప్టెన్. అల్లు అర్జున్ వరుడులో విలన్ గా మనకు పరిచయమైన ఆర్య ఇందులో హీరో. సోసోగా ఆడిన ఒకటి అరా డబ్బింగ్ సినిమాలు ఇతనివి గతంలో వచ్చాయి కానీ అవేవీ పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. భారీ బడ్జెట్ తో రూపొందిన కెప్టెన్ మీద బోలెడు నమ్మకంతో ఒకేసారి తమిళం తెలుగులో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందటం లేదా కాపీ కొట్టడం ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే వాటిలో కంటెంట్ ఇప్పటి ఆడియన్స్ సెన్స్టిటివిటికి, ఇంటెలిజెన్స్ కి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. దర్శకుడు శక్తి సౌందర రాజన్ అదేమీ పట్టించుకోకుండా రాసుకున్న కథే కెప్టెన్. 1987లో వచ్చిన ప్రిడేటర్ ని ఇన్స్ పిరేషన్ గా తీసుకుని దాన్ని ఇండియనైజ్ చేయబోయాడు. సిక్కిం దగ్గరలో ఉన్న ఓ అటవీ ప్రాంతంలో వింత రాకాసి జీవులు అక్కడికి వచ్చిన వాళ్ళను బలితీసుకుంటూ ఉంటాయి. వీటి వల్ల తన స్నేహితుడిని కోల్పోయిన కెప్టెన్ విజయ్ కుమార్ వాటి అంతు చూసేందుకు అడవిలో అడుగు పెడతాడు. ఆ తర్వాత జరిగేది తెరమీద చూసి తరించాలి.
ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కదా ఇప్పుడు ఎవరికీ గుర్తుండదన్న నమ్మకంతో సౌందర రాజన్ ఈ లైన్ ని అనుకోవడం వరకు బాగానే ఉంది, దాన్ని అరెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేసే కంటెంట్ తో ప్రెజెంట్ చేయడంలో ఫెయిలయ్యాడు. ఏ మాత్రం ఆసక్తి కలిగించని సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ లో తేలిపోయిన ప్రొడక్షన్ వేల్యూస్, థ్రిల్లింగ్ గా ఉండాల్సిన యాక్షన్ ఎపిసోడ్స్ చప్పగా సాగిపోవడం లాంటి ఎన్నో లోపాలు కెప్టెన్ ని భరించలేని ప్రహసనంగా మార్చాయి. రిలీజ్ కు ముందు డైరెక్ట్ ఓటిటికి పెద్ద ఆఫర్ వచ్చినా నిర్మాతలు తిరస్కరించారు. ఇప్పుడు చూస్తేనేమో థియేటర్ల నుంచి కనీస పెట్టుబడి వెనక్కు రావడం కూడా అనుమానమే