iDreamPost
iDreamPost
ఆహారం.. మనిషి జీవించడానికి అతి ముఖ్యమైనది. మన తాతముత్తాతలు తిన్న ఆహారమే ఇప్పుడు వినియోగిస్తున్న వాటికంటే ఎంతో మెరుగని అనేక మంది నిపుణులు చెబుతుంటారు. కానీ రుచికోసం అర్రులు చాచే నాలుకలు ఆధునిక ఆహార పదార్ధాల కోసం వెంపర్లాడుతుంటాయి. వినియోగదారుల అభిరుచిని తమ వ్యాపారం మల్చుకున్న అనేక కార్పొరేట్ సంస్థల నుంచి, గల్లీలోని ఫాస్ట్‌ఫుడ్ బండి వరకు లక్షల్లోనే వెలిసాయి. ఆయా ప్రదేశాల్లో స్థానిక ఆహార పదార్ధాలు ఏ మాత్రం దొరకవు. ఉత్తర, దక్షిణ భారత దేశాలకు చెందిన అనేక రుచులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చి తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు, ఆరుకాయలు మాదిరిగా నిర్వహించుకుంటున్నారు. బైట తొరికే తిండికి ఎక్కువగానే ప్రజలు కూడా ఆధారపడుతున్నారు. దీంతో వీరి వ్యాపారానికి అడ్డేలేకుండా పోతోంది. అదే రీతిలో కల్తీకి, నాణ్యత లేకపోవడానికి ఆస్కారం కలుగుతోంది.
రోడ్ల మీద లభించే ఆహార పదార్ధాల్లో నాణ్యత ఎంత? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం. ముఖ్యంగా మాంసాహారం విషయంలో ఈ నాణ్యతకు కొలమానాలు ఉండవు. సహజంగా సదరు పదార్ధానికి ఉండే గుణాన్ని కూడా మార్చివేసి వివిధ రకాల రసాయనాలు, కృత్రిమ రంగులు అద్ది వినియోగదారుడ్ని బుట్టలో వేసేస్తున్నారు. తమ వ్యాపారాన్ని దిగ్విజయంగా నిర్వహించేసుకుంటున్నారు. అయితే ఇలా నాణ్యత లేని ఆహార పదార్ధాల అమ్మకాలను పర్యవేక్షించి, నిరోధించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా అందుబాటులో ఉండదు. ఒక వేళ ఎవరికైనా కల్తీ లేదా నాణ్యత లేని ఆహార పదర్ధం గుర్తిస్తే ఎవరికి ఫిర్యాదులు చేయాలి? ఫిర్యాదు చేస్తే వారు వచ్చి తీసుకునే చర్యలు ఏంటి? తదితర సమాచారం కూడా ఎక్కడా అందుబాటులో ఉండదు.
విజయవాడ లాంటి నగరాల్లోనే విజిలెన్స్ అధికారులు చేసిన దాడుల్లో కుళ్ళిపోవడానికి సిద్దంగా ఉన్న మాంసాన్ని వంటలకు వినియోగిస్తున్న విషయం బైటపడింది. అలాగే సింథటిక్ రంగులను కూడా వాడుతున్నట్టు గుర్తించారు. అక్కడ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. విజయవాడలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక పల్లెల్లో పరిస్థితి ఏంటన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల అన్ని హంగులతో రెస్టారెంట్లు ఈ సంస్థ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వీధికో హోటల్, సందుకో బిర్యానీ బండి, గల్లీకో మెస్‌లుగా వెలుస్తున్న ఆహార వ్యాపారం యధేశ్చగానే సాగుతోంది. కానీ వీటి నాణ్యతపై మాత్రం ఎటువంటి పర్యవేక్షణలు ఉండడం లేదన్న ఆరోపణ ప్రజల నుంచి బలంగానే ఉంటోంది.
కల్తీ లేదా నిల్వ చేసిన ఆహార పదార్ధాలు, కృత్రిమ రంగుల కారణంగా వెంటనే పెద్దగా ప్రభావం లేకపోయినప్పటికీ దీర్ఘకాలంలో మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అమీబియాసిస్ మొదలుకుని, తీవ్రమైన కేన్సర్ వంటి అనారోగ్యాలకు కూడా కారణంగా నిలుస్తాయంటున్నారు. ఇప్పుడు కల్తీ లేదా నిల్వ ఆహార పదార్ధాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే అంతిమంగా అది తిరిగి ప్రభుత్వాలపైనే ఒత్తిడిగా పడుతుందన్నది కాదనలేనిది. ప్రజారోగ్యం పట్ల కోట్లాది రూపాయలను ప్రభుత్వాలు ప్రతియేటా ఖర్చు చేస్తున్నాయి. అయితే నాణ్యమైన ఆహారం లభించకపోతే ప్రభుత్వాలకు ఈ ఖర్చు మరింత పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్తీ ఆహార పదార్ధాలను అమ్మేవారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందుంటున్నారు. దీనిపై ఆయా ప్రభుత్వాలు దృష్టి పెట్టడం ఇప్పుడు తక్షణావసరం.