ముగిసిన కేబినెట్‌ భేటీ – రాజధానిపై తేల్చని మంత్రివర్గం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ముగిసింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ భేటీ ప్రధానంగా రాజధాని, రాష్ట్ర సమాగ్రాభివృద్ధిపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు ఇచ్చిన నివేదికపై చర్చ సాగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏకధాటిగా రెండు గంటల పాటు సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిప్రాంతాల ప్రజలు, రాజకీయ నేతలు ఎదురు చూస్తున్న రాజధాని అంశంపై మంత్రివర్గ సమావేశం ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో రాజధాని అంశంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. సమాచార ప్రసార మంత్రి పేర్ని నాని మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు వెల్లడించనున్నారు.

కాగా, బోస్టన్‌ కన్సల్టెంగ్‌ గ్రూప్‌ (బీసీజీ) కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని మంత్రి చెప్పారు. కాగా, ఈ కమిటీ నివేదిక మరో వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని సమాచారం.

గత ప్రభుత్వ హాయంలో జరిగిన పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అధ్యక్షతన ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చించినట్లు సమాచారం.

Show comments