Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నగరమైన విశాఖ చారిత్రక నేపథ్యం సుదీర్ఘమైనది. ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతాలలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు చెబుతారు. ప్రాచీన నాగరికతకు ఆనవాళ్లు ఇక్కడ ఎన్నో. ఇటీవల బయటపడిన బంకర్ దానికి ఓ నిదర్శనం. రాముడు సీత కోసం వెదుకుతూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరిని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లుగా రామాయణం తెలియజేస్తోంది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతంలోనే అని ఆధ్యాత్మిక కారులు చెబుతారు. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. దీనికి సజీవ సాక్ష్యాలుగా నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల రాతి ఆయుధాలను చూడవచ్చు. అలాగే 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం ఒకటిగా ఉండేది.
పురాతన కాలం నాటి బంకర్ వెలుగులోకి…
నగర ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్ లు చాలా వరకు విశాఖ తీరంలో ఉన్నాయి. అయితే కాలక్రమంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని ఇసుకలో కూరుకుపోయాయి. జాలరి పేట వద్ద మాత్రం బంకర్ శిధిల స్థితిలో కనిపిస్తుంటుంది. తాజాగా వాతావరణ మార్పులతో పాండురంగ స్వామి టెంపుల్ సమీపాన ఓ బంకర్ బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధంలో సముద్రపు గుండా వచ్చే శత్రువులపై దాడి చేసేందుకు సైనికులు ఈ బంకర్‌లను నిర్మించుకుని అక్కడినుంచి దాడులకు దిగినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. ప్రాచీన నాగరికతకు ఆనవాలుగా చెప్పుకునే ఈ బంకర్ బయటపడడంతో విశాఖ వాసులు సందర్శిస్తున్నారు. కేవలం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే కాదు రాతి యుగంలో కూడా విశాఖలో నాగరికత ఉన్నట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇక ప్రాచీన చరిత్ర కలిగిన బంకర్ బయట పడిందన్న విషయం తెలిసినప్పటి నుంచీ దాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
చారిత్రక ప్రదేశాలెన్నో…
విశాఖ పరిసరాల్లో అతి పురాతన ప్రాంతాలెన్నో ఉన్నాయి. భీమునిపట్నం, రుషికొండ ల్లో అత్యధికంగా ఉన్నాయి. డచ్చి సమాధులు, డచ్ డెవిల్స్ మాన్షన్ , గడియార స్తంభం, పావురాల కొండ బౌద్ధ క్షేత్రం భీమునిపట్నంలో, తోట్ల కొండ బౌద్ధ క్షేత్రం, బావి కొండ బౌద్ధ క్షేత్రం రుషికొండలో ప్రాచుర్యం పొందాయి. ఆగ్రా లోనే కాదు.. ఇక్కడ కూడా ఓ తాజ్ మహల్ ఉంది. కురుపాం రాజులదిగా చెప్పుకుంటున్న ఆంధ్రా తాజ్ మహల్ ప్రసిద్ధి పొందింది. అలాగే విక్టోరియా టౌన్ హాల్, అనాకపల్లి దగ్గర గల బొజ్జన కొండ బౌద్ధ కిత్రం చారిత్రక ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి.