iDreamPost
iDreamPost
తాజా పరిణామాలతో ఏపీ ప్రభుత్వం దూకుడు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా నిర్ణయాలు కనిపిస్తున్నాయి. శాసనమండలిలో ఏపీ వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లు విషయంలో సెలక్ట్ కమిటీకి పంపిస్తూ చైర్మన్ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో చర్చకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తొలుత మండలి తీరుని అసెంబ్లీలో ప్రస్తావించారు.
రూల్ 71 పేరుతో ప్రభుత్వ బిజినెస్ ని ముందుకు తీసుకురావడం నిబంధనలకు విరుద్ధంగా సాగిందన్నారు. పాలకపక్షంతో పాటుగా వామపక్షాలు, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు చెప్పినా ప్రభుత్వ బిజినెస్ ని పరిగణలోకి తీసుకోలేదన్నారు. చివరకు తీసుకున్న వెంటనే సెలక్ట్ కమిటీ పంపించాలని లెటర్ రావడంతో నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉదయమే విపక్ష నేత సూచనలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ సెలక్ట్ కమిటీ ని ముందుకు తీసుకొచ్చినట్టు వివరించారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సెలక్ట్ కమిటీకి పంపించాలని నిబంధనలు ఉన్నాయని, తొలిరోజు బిల్లు ప్రవేశపెట్టగానే సెలక్ట్ కమిటీ ప్రతిపాదన తీసుకురావాలని దానికి విరుద్ధంగా సాగిందన్నారు. లెటర్లు చాలా ఇస్తుంటారని, అయినా దానిని సాకుగా చూపుతున్నారన్నారు.
రూల్ 154 ప్రకారం కూడా చైర్మన్ విచక్షణకు అవకాశం లేదన్నారు. సమయం పాటించకపోతే బిల్లు అనుమతి విషయంలో ప్రస్తావించాలే తప్ప, ఇలా సెలక్ట్ కమిటీ అనడం సరికాదన్నారు. ఆశ్చర్యకరంగా వ్యవహరించారన్నారు. సభ నవ్వులాటగా మార్చేశారని విమర్శించారు. బలం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు కనిపించిందన్నారు. చైర్మన్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు స్పష్టమవుతోందన్నారు. లేని అధికారాన్ని ఉపయోగించి సెలక్ట్ కమిటీకి బిల్లులు పంపించినట్టు వివరించారు. శాసన వ్యవస్థను పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదన్నారు. ప్రాధమిక సూత్రాలకు భిన్నంగా సాగుతోందన్నారు. ప్రజల తరుపున, ప్రజల ద్వారా ఎన్నికయిన ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను తిరస్కరించడం తగదన్నారు. పెద్దల సభను ప్రవేశపెట్టడానికి కారణాలు వేరుగా ఉన్నాయన్నారు. పెద్దల సభ సలహాలు ఇవ్వాల్సి ఉండగా , ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు.
ప్రజల తీర్పు మాకు ఇస్తే, దానిని వదిలిపెట్టి రాజకీయ లక్ష్యాలతో అడ్డుకోవడం అద్వాన్నంగా ఉందన్నారు. మంత్రులంతా చైర్మన్ కి చెప్పామని, ఇతర అన్ని పక్షాల నేతలు కూడా సలహా ఇచ్చినా అమలుకాలేదన్నారు. చైర్మన్ సీటుకి ఎదురుగా నాలుగు గంటల సేపు చంద్రబాబు గ్యాలరీలో కూర్చోవాల్సిన అవసరం ఏముందన్నారు. ఆయన రావా్లసిన అవసరం ఏముందన్నారు. ఎప్పుడూ లేనిది , ఈ సందర్భంగా రావడం ద్వారా ఆయన ప్రభావితం చేసే ప్రయత్నం చేసినట్టు స్పష్టమవుతోందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
యనమల పూర్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రులు తాగి వచ్చారని ఆయన మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ఉద్దేశపూర్వంగానే ఇలాంటి ప్రయత్నాలు చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టాల రూపకల్పనను అడ్డుకోవడం తగదన్నారు. అన్ని పక్షాలు చెప్పినా చైర్మన్ మాత్రం తప్పు చేస్తున్నానని అంగీకరించి, చంద్రబాబు వైపు చూసి సెలక్ట్ కమిటీకి పంపించడం జీర్ణం కాని విషయంగా మారిందన్నారు. చైర్మన్ తప్పిదం కన్నా చంద్రబాబు ప్రభావితం చేయడమే పెద్ద నేరంగా చూడాలన్నారు. సెలక్ట్ కమిటీకి ఇచ్చే విచక్షణాధికారం లేదని బుగ్గన వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మండలికి రోజుకి 15లక్షల చొప్పున 60 కోట్లు సంవత్సరానికి ఖర్చవుతుంటే ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడం ఇక అర్థం లేని పనిగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన సభ ముందు ప్రస్తావించారు.