iDreamPost
android-app
ios-app

బడ్జెట్‌ 2022–23 : తొలిసారి ప్రకృతి వ్యవసాయం మాట

బడ్జెట్‌ 2022–23 : తొలిసారి ప్రకృతి వ్యవసాయం మాట

మారిన జీవనశైలి, కొత్త వైరస్‌లు, వ్యాధులు మానవాళిని చట్టుముడుతున్న నేపథ్యంలో.. వాటిని తట్టుకుని జీవించేందుకు రోగనిరోధకశక్తి ఎంత అవసరమో తాజాగా కరోనా వైరస్‌ ద్వారా తేటతెల్లమైంది. మంచి ఆహారం ద్వారా మాత్రమే రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆధునిక పద్ధతుల ద్వారా రసాయనిక ఎరువులు వినియోగించి పండించే ధాన్యం, ఇతర ఆహార పదార్థాల వల్ల రోగనిరోధక శక్తి ఏ మాత్రం పెరగబోదని వివిధ పరిశోధనల్లో తేలింది. అందుకే ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులనే ఆహారంగా తీసుకుంటున్నారు. కొంతకాలంగా సేంద్రీయ (ప్రకృతి) వ్యవసాయం, తద్వారా పండించిన ఉత్పత్తుల వల్ల జరిగే మేలుపై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. రైతులకు కూడా పెట్టుబడి భారీగా తగ్గడంతోపాటు ఆదాయం కూడా లభిస్తోంది. పొలానికి ప్రకృతి వ్యవసాయం ఎంతగానో మేలు చేస్తోంది.

ఈ పరిణామాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. అందుకు తమ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని ప్రకటించారు. ఈసారి కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయానికి(సేంద్రీయ వ్యవసాయం) తగిన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. హానికరమైన రసాయనాలు ఉపయోగించకుండా పూర్తిగా సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం ప్రస్తుత కరోనా సమయంలో చాలా ముఖ్యమని మంత్రి తెలిపారు. అందుకే ఆ దిశగా కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

Also Read : ఏపీ సర్కారు ఆక్వా రైతుకు ఎలాంటి చేయూత అందిస్తోంది..?

మొదటి దశలో గంగానది పరివాహక ప్రాంతాల్లోని 5 కిలోమీటర్లలోపు ఉన్న వ్యవసాయ భూముల రైతులతో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపడతామన్నారు. అలాగే రాష్ట్రాలు కూడా ఈ విధాన్ని ఊతమిచ్చేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సిలబస్‌లో మార్పు చేసి సేంద్రీయ వ్యవసాయానికి మద్దతుగా పాఠ్యాంశాలు తీసుకురావాలని కోరారు. మోడ్రన్-డే అగ్రికల్చర్‌లకు ప్రోత్సాహకాలను తగ్గించాలని మంత్రి నిర్మల తెలిపారు. అప్పుడే సేంద్రీయ వ్యవసాయం ఆచరణలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నాలుగు దశాబ్ధాల క్రితం మన దేశంలో సేంద్రీయ పద్ధతుల్లోనే వ్యవసాయం సాగింది. స్థానికంగా లభించే పశువుల వ్యర్థాలు, పచ్చిరొట్ట లాంటి ఎరువులను భూసారం కోసం వినియోగించేవారు. అయితే దిగుబడి తక్కువగా వచ్చేది. దేశంలో సమృద్ధిగా జలవనరులు, సారవంతమైన భూములు ఉన్నా.. ఆహార కొరత తలెత్తేది. దీనికి పరిష్కారంగా.. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఫలితంగా ఆహార కొరత తీరింది. అయితే కాలం గడిచే కొద్దీ వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది. ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడం, ఖర్చులు పెరగడం, భూమి సత్తువ కోల్పోవడం, దిగుబడి తగ్గడం, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వంటి పరిణామాల వల్ల.. రైతులు అప్పులపాలవుతున్నారు. అంతిమంగా ఈ పరిణామాలు రైతులు ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పుతున్నాయి. ప్రతి ఏడాది దేశంలో వందలాది రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం పూర్వం చేసే సేంద్రీయ వ్యవసాయం ద్వారానే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా సేంద్రీయ వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామం. 

Also Read : బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌.. పద్దు 39.45 లక్షల కోట్లు..