iDreamPost
android-app
ios-app

బీజేపీతో మాయావతి పొత్తు.. అంతవరకేనట..!

బీజేపీతో మాయావతి పొత్తు.. అంతవరకేనట..!

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో శాసన సభ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికలు, పొత్తులు, సీట్లు, ఓట్ల వేట, ప్రత్యర్థులను బలహీనం చేసే వ్యూహాలకు రాజకీయ పార్టీలు సన్నద్దం అవుతున్నాయి. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికలు ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలను వేడెక్కించాయి. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉండగా.. ప్రతిపక్షంలో ఉన్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి.

రాజ్యసభ ఎన్నిల్లో ఎస్పీ రెండో అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో నెగ్గనీయబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవల ప్రకటించారు. ఇందుకోసం అవసరమైతే బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తామని కూడా స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని పది రాజ్యసభ స్థానాలకు గాను 8 బీజేపీ గెలుచుకోగా, ఎస్పీ, బీఎస్పీ చెరొక స్థానం దక్కించుకున్నాయి. అయితే ఎస్పీ అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కూడా సిద్ధమని ప్రకటించిన మాయావతిని ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు లక్ష్యంగా చేసుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోబోతోందని ప్రచారం చేయసాగాయి. ఈ ప్రచారం ద్వారా బీఎస్పీకి ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును దూరం చేయాలని ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు యత్నిస్తున్నాయి.

అయితే జరగబోయే నష్టాన్ని గుర్తించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి నష్టనివారణ చర్యలు చేపట్టారు. అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను గానీ ఎన్నికల్లో బీజేపీతో మాత్రం పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. బీజేపీ, బీఎస్పీ పార్టీల భావ జాలం పూర్తి భిన్నమైనది, పొత్తు ఏమాత్రం సాధ్యం కాదని చెబుతూ తన పొత్తు వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. ముస్లింలను బీఎస్పీకి దూరం చేయాలనే లక్ష్యంతో ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు తన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

బీజేపీతో పొత్తుపై ఇలా చెబుతున్న మాయావతి.. మరో వైపు రాబోయే శాసన సభ ఎన్నికల్లో ఎస్పీ రెండో అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయబోమని చెబుతున్నారు. ఎస్పీ రెండో అభ్యర్థిని ఓడించేందుకు అవసరమైతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని పేర్కొంటున్నారు. మాయావతి వ్యాఖ్యలను భిన్నంగా ఉన్నా.. పొత్తుపై క్లారిటీతోనే ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాయావతి ప్రత్యర్థి అయిన ఎస్పీ రాజ్యసభ, శాసన మండలి అభ్యర్థులను ఓడించేందుకు మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని, ఎన్నికల్లో మాత్రం పొత్తు పెట్టుకోరని మాయావతి మద్ధతుదారులు చెబుతున్నారు. శాసన సభ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర ఉందనగా ఉత్తరప్రదేశ్‌లో మొదలైన పొత్తు రాజకీయాలు.. రాబోయే రోజుల్లో ఎటుదారితీస్తాయో చూడాలి.