iDreamPost
android-app
ios-app

అమ్మకానికి బిఎస్ఎన్ఎల్…!

అమ్మకానికి బిఎస్ఎన్ఎల్…!

కరోనా వేళ అవకాశంగా చూసుకుని మోడీ సర్కార్‌ ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ఒక్కోటిగా ప్రయివేటుకు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) మహానగర టెలిఫోన్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటిఎన్‌ఎల్‌)కు చెందిన ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. వీటికోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (డిఐపిఎఎం) ఏర్పాటు చేసింది. ఈ రెండు ప్రభుత్వ రంగ టెలికం కంపెనీలకు చెందిన ఆస్తుల విక్రయానికి కేంద్రం కన్సల్టెంట్లను నియమించిందని ఓ జాతీయ వార్త సంస్థ కథనం ప్రచురించింది.

ఈ పిఎస్‌యుల ఆస్తుల విక్రయం కోసం సిబిఈఆర్‌, జెఎల్‌ఎల్‌, నైట్‌ఫ్రాంక్‌ సంస్థలు కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నాయి. 2020 జులై ముగింపు నాటికి కన్సల్టెంట్‌ సంస్థలు కేంద్రానికి ఓ రిపోర్ట్‌ను అందించనున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.37,500 కోట్ల విలువ చేసే బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌ఎల్‌ల ఆస్తులను విక్రయించే అవకాశం ఉందని గత వారం ప్రధానితో జరిగిన సమావేశంలో టెలికం శాఖ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం.

ఆస్తుల ప్రాధాన్యత, విలువపై టెలికం శాఖ ఇప్పటికే ఓ అంచనాకు రాగా.. ఈ ప్రక్రియను వేగవంతం చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. సంస్థల ఆస్తుల విక్రయానికి కన్సల్టెంట్ల నియామకం తొలి అడుగు ఆని బిఎస్‌ఎన్‌ఎల్‌ సీనియర్‌ అధికారి తెలిపారు. ఆ సంస్థలు కొన్ని వివరాలు కోరాయనీ.. తాము పూర్తి చేశామన్నారు. వాటాల విక్రయం కోసం దీపమ్‌తో కలిసి టెలికం శాఖ పని చేస్తుందన్నారు.