iDreamPost
iDreamPost
మన ఆర్మీ వాళ్ళు ఎక్కడో దేశం సరిహద్దుల్లో, మంచుతో ఉన్న ప్రదేశాల్లో కొండల్లో, లోయల్లో మనకోసం కాపలా ఉంటూ రక్షిస్తారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇంటికి వెళ్లి వస్తూ ఉంటారు. ఇక వారు సొంత పెళ్ళికి కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఓ జవాన్ కి పెళ్లి కుదిరింది. వివాహానికి ఇంటికెళ్లాలి. అతను విధులు నిర్వహించే ప్రదేశం వద్ద మొత్తం మంచుతో కప్పుకొని, రహదారి మూసుకుపోయింది. మరి ఇంటికెళ్లేదెలా? దీంతో ఆర్మీ ఏం చేసిందో తెలుసా??
జమ్మూ-కశ్మీర్‌లోని మచిల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద నారాయణ బెహెరా అనే బీఎస్‌ఎఫ్ సైనికుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. మే 2న ఒడిశాలోని తన స్వగ్రామంలో వివాహం. నారాయణ పనిచేసే ప్రదేశం ప్రస్తుతం పూర్తిగా మంచుతో నిండిపోయి వెళ్ళడానికి దారిలేకుండా అయింది.
అతని తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, తమ కుమారుడు వచ్చేలా చేయమని ఆర్మీ అధికారుల్ని కోరారు. వారికి స్పందించి బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్, మంచులో చిక్కుకుపోయిన నారాయణ బెహెరాని, చీతా హెలికాప్టర్‌లో శ్రీనగర్ కి తరలించాలని ఆదేశించారు. గురువారం తెల్లవారుజామున ఆ జవాన్ ని హెలికాప్టర్‌లో ఎక్కించుకుని శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. అక్కడినుంచి ఒడిశాలోని తన స్వగ్రామానికి బయలుదేరాడు ఆ సోల్జర్. నారాయణని సకాలంలో ఇంటికి చేర్చేందుకు కృషి చేసిన ఆర్మీ అధికారులని అతని కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు పలువురు అభినందిస్తున్నారు.