Idream media
Idream media
జీవితంలో పెళ్లి చేసుకోకూడదని భీష్మించుకున్న ఒక బ్రహ్మచారిని దారికి తెచ్చుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయి కథ బ్రహ్మచారి సినిమా. 1968లో వచ్చిన ఈ కథలో ANR , జయలలిత హీరోహీరోయిన్లు. ఇదే పేరుతో కమలహాసన్ సినిమా కూడా ఉంది. అయితే కథ లైన్ ఒకటే అయినా , విషయం వేరే.
తర్వాత వచ్చిన పెద్దరికం, కాటమరాయుడులో కూడా ఆడగాలి సోకని మగవాళ్లు ఉంటారు.
బ్మహ్మచారిలో హీరోకి ఆడవాళ్లు నచ్చరు. బ్రహ్మచారిగా ఉండిపోవాలనే నియమం పెట్టుకున్నాడు. హీరోయిన్ ఇష్టపడుతుంది. కానీ అతను దగ్గరికి రానివ్వడు. ఒకరోజు చేతిలో బిడ్డను ఎత్తుకుని హీరో తల్లిదండ్రుల దగ్గరికెళ్లి , తమకు పెళ్లైందని, బిడ్డ కూడా ఉన్నాడని చెబుతుంది.
సాక్ష్యాలుగా హీరో రాసిన ప్రేమ లేఖ, కౌగిలించుకున్న ఫొటో చూపిస్తుంది. హీరో తనకి ఏ పాపం తెలియదంటాడు. ఆ బిడ్డ ఎవరు? ఆమె ఈ నాటకం ఆడడానికి కారణం ఏమిటి? ఇదంతా క్లైమాక్స్. తమిళ రచయిత బాలమురగన్ కథకి , భమిడిపాటి మాటలు రాశాడు. హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ లేకపోయినా , బోర్ కొట్టకపోవడానికి కారణం కామెడీ. డైలాగ్స్ చాలా చోట్ల నవ్విస్తాయి.
గయ్యాలి పాత్రలు వేసే సూర్యకాంతం, విలన్ వేషాలు వేసే నాగభూషణం ఈ సినిమాలో చాలా సాఫ్ట్‌గా ఉంటారు. నాగభూషణం తన 16వ ఏట ఏం జరిగిందో తెలుసా అని అడిగి , అయినా నీకెందుకు చెప్పడం దండగ అని ముగిస్తాడు.
ఇదే మానరిజం. అడవి రాముడు సినిమాలో జంద్యాల ‘చరిత్ర అడక్కు చెప్పింది విను’ అని ఫాలో అయ్యాడు. చలం , రమాప్రభ హాస్య జంట. రాజబాబు చిన్నపాత్రలో కనిపిస్తాడు.
పాము కనిపిస్తే భయంతో హీరోయిన్ హీరోని కౌగిలించుకునే రొటీన్ సీన్ దీంట్లో కూడా ఉంది. చివర్లో ఫైట్. ఫైటింగ్ చేయడానికి ANR చాలా కష్టపడతాడు. Steps వేయడంలో దిట్ట అయిన ANRకి సినిమాలో ఒక్క డ్యాన్స్ కూడా లేదు.
తేనె మనసులు హీరోయిన్ సుకన్య గెస్ట్ ఆర్టిస్ట్‌గా నటించారు. తమిళ కథ అంటే ఆ రోజుల్లో చాలా Over Drama ఉండేది. దీంట్లో హెవీ సీన్స్ లేకపోవడం ఒక విశేషం.
సినిమా మొత్తం హైదరాబాద్‌లోనే తీసినా, ఔట్‌డోర్ సీన్స్ ఎక్కువ లేకపోవడంతో అప్పటి హైదరాబాద్ చూసే భాగ్యం దక్కలేదు.