iDreamPost
android-app
ios-app

భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్…

భారత రాజ్యాంగ  నిర్మాత  డా.బాబా సాహెబ్ అంబేద్కర్…

సాంఘిక విప్లవ మూర్తి, నవ భారత నిర్మాత,భారత దేశ మార్గదర్శి, మహోన్నత వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం, సమోన్నత విలువలకు సాక్షాత్తు రూపం భారత రత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.భీమ్ రామ్ జీ అంబేద్కర్1891 ఏప్రిల్14న మధ్యప్రదేశ్ లోని మౌలో రాంజీ,భీమా బాయి దంపతులకు జన్మించారు బాల్యం నుండి కుల వివక్షను, అంటరానితనాన్ని స్వానుభవంతో తెలుసుకున్న అంబేద్కర్ ఈ దురాచారాల నిర్మూలనకు ఆ పసి మెదడు లోనే బీజాలు పడ్డాయి. అంటరాని కుటుంబంలో జన్మించినా అన్ని రకాల అసమానతలు, బానిసత్వం, వివక్ష సంకెళ్లు తెంచుకుని అతడు ఎదిగిన క్రమం ఏ తరానికైనా నిత్య స్పూర్తే.తన ఆశయ సాధనలో ఏరోజూ తన నమ్మిన విలువ లకు తిలోదకాలివ్వలేదు. ఆత్మగౌరవానికే ప్రాధాన్యత ఇచ్చారు.

అనేక కష్టాల మధ్య హైస్కూల్, కళాశాల విద్య పూర్తి చేసిన అంబేద్కర్ కు మెట్రిక్ పాసైన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభకు హాజరైన ప్రసిద్ధ మరాఠీ రచయిత, సంస్కర్త అయిన కృష్ణాజీ అర్జున్ కేలూస్కర్ గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర కానుకగా ఇచ్చాడు. ఈ పుస్తకం అంబేద్కర్ జీవనంలో గణనీయమైన మార్పు తేవడమే కాకుండా ఆయన హేతుబద్ధతకు కారణభూతంగా నిలిచింది.

1912 లో బిఏ పట్టా పుచ్చుకున్న అంబేద్కర్ ,1913 లో బరోడా మహారాజు సహాయంతో అమెరికా వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించారు. వారి భారతదేశంలో కులాలు వాటి వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాల రచనకు పలువురి ప్రశంసలు లభించాయి. నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా & హిస్టారికల్ అండ్ అనలిటికల్ స్టడీ వ్యాసానికి గానూ కొలంబియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. ఈ పుస్తకాన్నే తన ఉన్నత విద్యకు సహకారాలందించిన బరోడా మహరాజు కు అంకితమిచ్చారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన అంబేద్కర్కు తాను ఎంతటి మేథావి ఐనా కులరక్కసి రాజ్యమేలుతున్న రోజులలో అడుగడుగునా అవమానాలే స్వాగతం పలికాయి. అయినా అంబేద్కర్ ఎన్నడూ మనో‌నిబ్బరం కోల్పోలేదు సరికదా ఈ వ్యవస్థ రూపాన్ని మార్చాలనే కసి పట్టుదల మరింత పెంచుకున్నారు.

కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ ‘మూక నాయక్’ అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు.

32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కాని ఆఫీసు జవానులు కూడా ఈయనను అస్పృశ్యుడుగా చూచారు.

1927లో మహద్‍లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్‍ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకుండా అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేని సమయంలో అంబేద్కర్ నాయకత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది.

1927లో అంబేద్కర్ ‘బహిష్కృత భారతి’ అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు.తిలక్ గనుక అంటరానివాడుగ పుట్టివుంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’అని ఉండడు. ‘ అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు’ అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదుల బాధను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది.

1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్ ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన పలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు.1927 డిసెంబర్ 25న అంబేద్కర్ ‘మనుస్మృతి’ని బహిరంగంగా కాల్చటం మరో సంచలనం కల్గించింది. ఆ విషయంగా మాట్లాడుతూ సవర్ణ హిందువుల దృష్టిని బలవంతాన ఆకర్షించడానికి అపుడపుడు అలాంటి తీవ్ర చర్యలు అవసరమవుతాయన్నాడు. అంతేకాదు, మనుస్మృతి లోని అన్ని భాగాలు నిందనీయాలు కావు అన్నాడు.

1931లో రెండవ రౌండ్ టేబిల్ సమావేశ సన్నాహాల సందర్భంగా అంబేద్కర్ గాంధీజీని కలుసుకున్నాడు. “ఏ దేశంలో లేదా ఏ మతంలో తమను కుక్కలకన్నా, పిల్లులకన్నా హీనంగా చూస్తున్నారో అదేశాన్ని గురించి తానే విధంగాను భావించలేను అంటూ గాంధీజీ, ‘ఐ హేవ్ నో హోమ్ ల్యాండ్'”అని చాటి చెప్పాడు. ఆ తర్వాత రౌండుటేబుల్ సమావేశాలకు లండన్ వెళ్లాడు.1932లో బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. దాని ప్రకారం అస్పృశ్యులకు ప్రత్యేక స్థానాలు లభించాయి. ఎరవాడ జైలులో వున్న గాంధీజీ నిరాహారదీక్ష ప్రారంభించాడు. “మహాత్ములు వస్తుంటారు. పోతుంటారు. అంటరాని వారు మాత్రం అంటరాని వారుగానే వుంటున్నారు.” అన్నాడు అంబేద్కర్.కొన్ని సంవత్సరాలు అస్పృశ్యతా నివారణ కోసం దళిత జాతుల హక్కుల కోసం పోరాటం సాగించాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావటం, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం.

నాటి కేంద్రమంత్రి టి.టి కృష్ణమాచారి  ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ ‘రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో వుండి పోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు, అన్నాడు.
అంబేద్కర్ తన 56 ఏట 1948లో సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సవితా(శారదా కబీర్) ను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది.

కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబర్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు.1956 అక్టోబర్ 14న నాగ్ పూర్ లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. గాంధీజీతో అనేక విషయాలలో భేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు.

నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు వూపిరిపోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు.
అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ’, ‘ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా’, ‘ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్’, ‘ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ’ ప్రధానమైనవి.

ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు.మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమారావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న కన్ను మూశాడు.