iDreamPost
android-app
ios-app

Bollywood : బాలీవుడ్ క్రియేటివిటీకి మనమే దిక్కు

  • Published Jan 18, 2022 | 9:28 AM Updated Updated Jan 18, 2022 | 9:28 AM
Bollywood : బాలీవుడ్ క్రియేటివిటీకి మనమే దిక్కు

మన సినిమాల రీమేక్ హక్కుల కోసం బాలీవుడ్ నిర్మాతలు ఎంతగా పరితపించిపోతున్నారో ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఒకప్పుడు కథల కొరతతో టాలీవుడ్ దర్శకులు హిందీ క్యాసెట్లు సిడిలు వేసుకుని చూసి దాన్నుంచి వచ్చిన స్ఫూర్తితో ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు రాసుకునేవాళ్ళు. పలుమార్లు మంచి హిట్లు కూడా దక్కాయి. కానీ ఇప్పుడదంతా గతం. నార్త్ ఆడియన్స్ మన సినిమాలంటే పడి చచ్చిపోతున్నారు. మాస్ ని మెప్పించే కంటెంట్ ఇవ్వడంతో తిరుగులేని మన శైలి ఒకటి రెండు కాదు ఏకంగా పాతిక దాకా రీమేకులను అక్కడి సెట్స్ పైన ఉంచేసింది. ఆ లిస్టు చూస్తే వామ్మో ఇన్ని ఉన్నాయాని ఆశ్చర్యం కలగక మానదు.

జెర్సీ, అల వైకుంఠపురములో, హిట్, ఖైదీ, విక్రమ్ వేదా, గద్దలకొండ గణేష్, అపరిచితుడు, 16, దృశ్యం 2, రాక్షసుడు, రెడ్, కోమలి, నగరం, యుటర్న్, నాంది, హెలెన్, భీమ్లా నాయక్, మానాడు, అరువి, ఆకాశం నీ హద్దురా, మాస్టర్, ఛత్రపతి డ్రైవింగ్ లైసెన్స్, ఎఫ్2, గాడ్ ఫాదర్, బ్రోచేవారెవరురా ఉన్నాయి. వీటిలో కొన్ని రిలీజ్ కు సిద్ధంగా ఉండగా మరికొన్ని సగం పైగానే చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. మరికొన్ని అతి త్వరలో షూటింగ్ ప్రారంభించుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇవన్నీ తెలుగు, తమిళం, మలయాళం బాషలవే కావడం గమనార్హం. కెజిఎఫ్ ప్రభావం ఎంత ఉన్నా కన్నడ సినిమాలు మాత్రం ఎందుకో నార్త్ ప్రొడ్యూసర్లను ఆకట్టుకోలేకపోతున్నాయి.

ఇవి కాకుండా మరో పదికి పైగా చర్చల దశలో ఉన్నాయి. గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం స్టార్ట్ కావడానికి ఎక్కువ టైం పట్టదు. అసలే కథల కొరతతో కొట్టుమిట్టాడుతున్న సినీ పరిశ్రమకు ఒక భాషలో ఏదైనా హిట్ అవ్వడం ఆలస్యం మన నేటివిటీకి సెట్ అవుతుందా లేదా అనేది ఆలోచించకుండా మరీ రీమేకులకు రెడీ అయిపోతున్నారు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాకపోయినా ఇటీవలి కాలంలో మాత్రం తీవ్రమైన మాట వాస్తవం. వరల్డ్ సినిమా సబ్ టైటిల్స్ సహాయంతో అరచేతుల్లోకి వచ్చిన రోజుల్లోనూ ఇన్నేసి రీమేకులు జరగడం విచిత్రమే. దీన్ని బట్టి బాలీవుడ్ క్రియేటివిటీ ఏ స్థాయిలో తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

Also Read : Box Office : ఈ వారం కూడా బాక్సాఫీస్ డల్లే