iDreamPost
android-app
ios-app

Body Shaming, Politics – రాజకీయాల్లో బాడీ షేమింగ్ జాఢ్యం ఎప్పటి నుంచి ఉంది..?

  • Published Dec 29, 2021 | 1:27 PM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
Body Shaming, Politics – రాజకీయాల్లో బాడీ షేమింగ్ జాఢ్యం ఎప్పటి నుంచి ఉంది..?

బాడీ షేమింగ్.. తెలంగాణలో ఈ మధ్య దీనిపై పెద్ద వివాదం రాజుకుంది. ఇప్పటికీ దానిపై చర్చ జరుగుతూనే ఉంది. బాడీ షేమింగ్ అంటే వ్యక్తుల శరీరాకృతిని వెక్కిరిస్తూ విమర్శించడం. తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు, సీఎం కేసీఆర్ మనవడైన హిమాంశు బొద్దుగా ఉండటాన్ని విమర్శిస్తూ బీజేపీకి చెందిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు తీవ్ర కలకలం రేపాయి. రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేని కుర్రాడిని రాజకీయాల్లోకి లాగి.. కించపరిచేలా బాడీ షేమింగ్ కు పాల్పడటం, కించపరచడం దారుణమని మల్లన్నపై విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి కేటీఆర్ నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకే ఫిర్యాదు చేశారు. బాడీ షేమింగ్ కొత్త కాదని గతంలోకి తొంగి చూస్తే తెలుస్తుంది. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా బాడీ షేమింగ్ బాధితులేనని అర్థమవుతుంది.

పదమే కొత్తది..

ఇంగ్లీషుకు అలవాటు పడిన మనకు ఇటీవలి కాలంలోనే ప్రచారంలోకి వచ్చిన బాడీ షేమింగ్ అనే ఈ పదం కొత్తది కావచ్చు. కానీ వ్యక్తుల శరీరాకృతి, వర్ణం, ఒడ్డుపొడుగులను బట్టి మారు పేర్లతో పిలవడం ఈనాటిది కాదు. తరతరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ జాఢ్యం పాతుకుపోయింది. ఇప్పటికీ గ్రామాల్లోకి వెళితే ఇది కనిపిస్తుంది. గ్రామాల్లో సాధారణంగా పేదలు, నిమ్నవర్గాలకు చెందినవారిని అసలు పేర్లతో కాకుండా వారి శారీరక లోపాలను ఎత్తి చూపేలా పేర్లు పెట్టి పిలుస్తుంటారు. బండోడు, బక్కోడు, కుంటోడు, కర్రోడు, లంబు, జంబు వంటి పేర్లతో పిలవడం ఆధునిక పరిభాషలో బాడీ షేమింగ్ కిందకే వస్తాయి. గ్రామాల్లో వ్యక్తులను చిన్నబుచ్చడానికో, కొన్ని సందర్భాల్లో ముద్దుగానో ఇలా పిలుస్తుంటారు. కానీ ఈ జాఢ్యం రాజకీయాల్లో పలకడం.. విమర్శించడానికి వేరే అంశాలు దొరకనప్పుడు బాడీ షేమింగ్ కు తెగబడటం తరచూ జరుగుతోంది.

తాత కూడా ఒకప్పటి బాధితుడే..

కేటీఆర్ తనయుడు హిమాంశు ఇప్పుడు అవమానానికి గురయ్యాడు. కానీ ఆయన తాత, సీఎం కేసీఆర్ ఒకప్పుడు బాడీ షేమింగ్ బాధితుడే. 2009లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో కేసీఆర్ ఒంటిపై చొక్కా లేకుండా ఉన్న ఫోటో పత్రికల్లో వచ్చింది. సహజంగా బక్కపలచగా ఉండే కేసీఆర్ ను ఆ రూపంలో చూసిన అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, కర్నూల్ జిల్లాకు చెందిన మసాలా ఈరన్న కేసీఆర్ ను టీబీ పేషన్ట్ అని అభివర్ణించారు.

-తెలుగుదేశం పార్టీ ఏర్పడిన కొత్తలో ప్రభుత్వ అధికారిగా ఉన్న పర్వతనేని ఉపేంద్ర ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరి ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. ఆయన కారునలుపు మనిషి. అప్పట్లో కొన్ని ఆంగ్ల పత్రికల్లో ఉపేంద్రను చార్ కోల్ బ్లాక్ జనరల్ సెక్రటరీ అనే రాసేవారు. అలా రాయవద్దని ఉపేంద్ర బతిమాలుకోవాల్సి వచ్చింది.

-ఉత్తమ పార్లమెంటేరియన్ గా పేరుపొందిన కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి 1987, 88 ప్రాంతంలో జనతాదళ్ లో ఉన్నప్పుడు పార్లమెంటులో బోఫోర్స్ కుంభకోణంపై చర్చ సందర్బంగా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీపై విమర్శలతో విరుచుకు పడ్డారు. దాంతో అప్పటి కేంద్రమంత్రి కేకే తివారీ రెచ్చిపోయి.. జైపాల్ పై బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు. మీ కాళ్లలాగే మీ మెదడు కూడా వంకర తిరిగినట్లుంది.. అందుకే మీ ఆలోచనలు వంకరగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే తర్వాత తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.

-1980 ప్రాంతంలో బాలీవుడ్ నటి నర్గీస్ దత్ రాజ్యసభ సభ్యురాలిగా ఉండేవారు. ఆ సమయంలో ఒక గ్యాంగ్ రేప్ ఘటనపై చర్చ సందర్భంగా బీహారుకు చెందిన ఒక సభ్యురాలు (ఆమె నల్లగా, పొట్టిగా, లావుగా ఉంటారు) నాటి ఇందిర సర్కారు పై విరుచుకుపడుతున్నారు. నర్గీస్ ఆమెను అడ్డుకుని ‘నీకెందుకు భయం.. నిన్నెవరూ రేప్ చేయరులే’.. అని బిగ్గరగా అరిచారు.

శరీర లోపాలపై నేతల స్వీయ కామెంట్లు

బాడీ షేమింగ్ విమర్శలు పక్కన పెడితే తమ శారీరక లోపాలపై స్వీయ కామెంట్లు చేసుకున్న నేతలు కూడా ఉన్నారు. 2010లో జైపాల్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. అప్పట్లో సీఎం రోశయ్యను మార్చాలన్న ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. కొత్త సీఎం రేసులో జైపాల్ రెడ్డి కూడా ఉన్నారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. దానిపై జైపాల్ స్పందిస్తూ ‘నాకు కాళ్ళే లేవు.. ఇక రేసులో ఎలా ఉంటాను’ అని తన లోపాన్ని గుర్తుచేసేలా వ్యాఖ్యానించారు. ఇక మరో రేణుకా చౌదరి ఖమ్మం ఎంపీగా ఉన్నప్పుడు పలువురు జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీపై కోపంగా ఉన్నారని విలేకరులు ప్రస్తావించగా.. ఆమె స్పందిస్తూ ‘నేను డయాస్ పై మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే.. నావెనుక వేదికపై ఆశీనులైన ఎమ్మెల్యేల్లో కనీసం నలుగురు కనిపించరు. బహుశా అందుకే వారికి నాపై కోపం ఉండవచ్చు’.. అంటూ లావుగా ఉండే శరీరాకృతిని గుర్తుచేసేలా వ్యాఖ్యానించారు.