iDreamPost
android-app
ios-app

సోము వీర్రాజు తాజా హామీ.. ఈ సారి అదిరిపోయింది..!

  • Published Jan 03, 2022 | 12:20 PM Updated Updated Jan 03, 2022 | 12:20 PM
సోము వీర్రాజు తాజా హామీ.. ఈ సారి అదిరిపోయింది..!

తల్లికి పట్టెడన్నం పెట్టనివాడు పినతల్లికి పట్టుచీర కొనిపెడతాను అన్నట్టు ఉంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరి. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హాదా ఇవ్వాలని పార్లమెంట్‌లో గట్టిగా డిమాండ్‌ చేసిన పార్టీ.. తీరా తామే అధికారంలోకి వచ్చాక ఆ హామీని అటకెక్కించింది. కనీసం విభజన చట్టంలోని హామీలను పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని గెలిపిస్తే మూడు విడతల్లో రూ.10వేల కోట్లతో అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చేశారు.

సోమవారం సోము వీర్రాజు పెనుగంచిప్రోలులో మీడియాతో మాట్లాడుతూ 2024లో తాము అధికారంలోకి వచ్చి మూడు విడతల్లో అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. పెనగంచిప్రోలు అమ్మవారి సాక్షిగా తాను ఈ హామీ ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. రాజధాని నిర్మిస్తామన్న చంద్రబాబు కట్టలేకపోయారని, అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి వైజాగ్ వెళ్లిపోతామంటున్నారని.. ఇక రాజధానిని తామే నిర్మాణం చేస్తామన్నారు. రూ.10వేల కోట్లతో అత్యద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని సోమువీర్రాజు స్పష్టం చేశారు.

ఎవరైనా నమ్ముతారా?

ఇప్పటికి ఏడున్నరేళ్లుగా కేంద్రంలో అధికారం చలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తోందని జనం భావిస్తున్నారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హాదా ఇస్తామని హామీ ఇచ్చారు. అయిదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హాదా ఇవ్వాలని అప్పటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిమాండ్‌ చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో ఇంకేముంది మనకు ప్రత్యేక హోదా వచ్చేస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు మంజూరవుతాయని జనం నమ్మారు.

తెలుగుదేశంతో కలసి నాలుగేళ్లు కేంద్రంలోను, రాష్ట్రంలోనూ అధికారం పంచుకున్న బీజేపీ చాలా విజయవంతంగా ప్రత్యేక హోదాను అటకెక్కించింది. అందుకు టీడీపీ అధినేతకు ప్రత్యేక ప్యాకేజీని ఎరగా వేసింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణ భారం కూడా రాష్ట్రంపైకి నెట్టేసింది. ఇప్పుడు తెలివిగా ఆనాడు చంద్రబాబు అడిగారు కనుక అలా చేశాం అంటూ తప్పించుకుంటోంది. వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న నిధులు ఇవ్వడం మానేసింది. ఆంధ్రుల హక్కుగా భావించిన.. ఎన్నో త్యాగాలు, బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడానికి తెగబడింది.

ఇన్ని అనుభవాల కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు అని జనం ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందుకే ఆ పార్టీని 2014, 2019 ఎన్నికల్లో జనం చిత్తుగా ఓడించారు. అయినా ఆత్మ విమర్శ చేసుకోని ఆ పార్టీ నాయకులు కొత్త హామీలతో మళ్లీ జనం ముందుకు వస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే ఈ తరహా హామీలను ఇటీవల చకచకా ఇచ్చేస్తున్నారు. రూ.50 కే చీప్‌ లిక్కర్‌, గుంటూరు జిన్నా టవర్‌, విశాఖ కేజీహెచ్‌, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీల పేర్ల మార్పు, ఇప్పుడు రూ.10వేల కోట్లతో అమరావతి అభివృద్ధి. కేంద్రంలో అధికారంలో ఉండి ఇన్నేళ్లూ రాష్ట్రాన్ని పట్టించుకోని బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే ఇవి చేస్తాం.. అవి చేస్తాం అంటే జనం నమ్ముతారా?

అసలు అధికారంలోకి వచ్చే సీన్‌ ఉందా?

పరిస్థితి ఎంత దిగజారిపోయినా, జనాదరణ నానాటికీ కోల్పోతున్నా టీడీపీ నాయకులు వచ్చే ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తామంటే జనంలో కొందరైనా నమ్ముతారు. ఎందుకంటే కొన్నేళ్లు అధికారం చలాయించిన చరిత్ర, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం వంటివి జనానికి కళ్ల ముందు కనిపిస్తున్నాయి. కానీ బీజేపీకి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా లేదు. తాము ఆంధ్రప్రదేశ్‌ కోసం ఇది చేశాం అని చెప్పుకోవడానికంటూ ఏమీ లేని బీజేపీ 2024లో అధికారంలోకి వచ్చేస్తామని ఎలా అనుకుంటోంది. లీడర్లే తప్ప కేడర్‌ లేని బీజేపీకి తిరుపతి, బద్వేల్‌ ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్లు చూశాక కూడా సోము వీర్రాజు ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇవ్వడమే విడ్డూరం! ఏపీకి మేలు చేయకపోతే పోనీ హాని చేసే నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీపై జనం ఆగ్రహంగా ఉన్నారు. పుండు మీద కారం చల్లినట్టు అమరావతిని నిర్మించేస్తాం అంటూ హామీ ఇస్తే ఇంకా ఏవగించుకుంటారు. ఎందుకంటే మూడు రాజధానుల ద్వారానే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి జరగాలని మెజార్టీ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు.

Also Read : బొత్స లాజిక్‌ పాయింట్‌.. నిజమే కదా సోము..?