వారిలో ఎవరు తుగ్లక్ లో చెప్పండి రాజుగారు..?!

రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు సహజం. అయితే ఆ విమర్శలు చేసేముందు నాయకులు ముందూ వెనకా ఆలోచించాలి. తాము చేసే విమర్శలు, ఆరోపణల్లో సహేతుకత ఉందా లేదా.. అవి వారికి వర్తిస్తాయా లేదా అన్నది ఆలోచించి మరీ చేయాలి. లేనిపక్షంలో అవి బూమరాంగ్ అయ్యి విమర్శలు చేసిన వారినే నవ్వుల పాల్జేస్తాయి. వారి అజ్ఞానాన్ని బయటపెడతాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపైన, జీవీఎంసీ అధికారులపైన చేసిన విమర్శలు ఆ కోవలోకే వస్తాయి.

ఎవరిది తుగ్లక్ చర్య..?

చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన విష్ణుకుమార్ రాజు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించడాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. సెకండ్ వేవ్ ఉద్ధృతి ఉన్న పరిస్థితుల్లో ఇటీవల సాక్షాత్తు ప్రధాని మోదీ పలు సందర్భాల్లో మాట్లాడుతూ అవసరమైతే రాష్ట్రాల్లో జన సంచారాన్ని కట్టడి చేసేందుకు నైట్ కర్ఫ్యూ విధించాలని.. దాన్ని కరోనా కర్ఫ్యూగా వ్యవహరించాలని పేరు కూడా సూచించారు. ఇతర రాష్ట్రాలతో పాటు ఏపీలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. ప్రధానితో సహా ఆయా రాష్ట్రాల చర్యలన్నీ తుగ్లక్ చర్యలేనని విష్ణుకుమార్ రాజు చెప్పగలరా?

ఇక విశాఖలో అక్రమ భవనాల కూల్చివేత అంశాన్ని ప్రస్తావిస్తూ అధికారులు కూల్చివేతలపై చూపుతున్న శ్రద్ధ కరోనా నియంత్రణపై చూపడంలేదని ఆరోపించారు. కరోనా చర్యల పేరుతో మిగిలిన పాలనా వ్యవహారాలన్నీ నిలిపివేయాలన్నది రాజుగారి డిమాండ్ లా కనిపిస్తోంది. జనసమూహాలను ఆకర్షించి కరోనాను మరింత ఎగదోసే కుంభమేళాలు, ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానిది తప్పు గానీ.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను కూల్చడం ఎలా తప్పో ఆయనే సెలవివ్వాలి. కరోనా నియంత్రణ చర్యలు పక్కాగా చేపట్టాలని కోరడంలో ఎటువంటి తప్పులేదు. కానీ ఆ పేరుతో మిగతా కార్యక్రమాలన్నీ నిలిపివేస్తే ప్రజాపాలన స్తంభిస్తుందన్న విషయం బీజేపీ నేత విస్మరిచడమే విడ్డూరం.

Also Read : అవినీతి ఎఫెక్ట్ : ధూళిపాళ్ల చేజారిన సంగం డెయిరీ

జీఎస్టీ ఎవరి పరిధిలో ఉందో తెలియదా..

విష్ణుకుమార్ చేసిన మరో డిమాండ్ ఆయన అవగాహన రాహిత్యాన్ని బట్టబయలు చేసింది. కోవిడ్ కేసులు పెరిగి.. ప్రజలపై వైద్య ఖర్చుల భారం పెరిగినందున ఔషధాలపై మూడు నెలలపాటు జీఎస్టీ పన్ను లేకుండా చూడాలని కోరారు. ప్రజాహితం కోణంలో ఆయన కోరిక మంచిదే.. కానీ జీఎస్టీ పన్ను విధింపు అధికారం రాష్ట్రాలకు లేదని.. అది పూర్తిగా కేంద్రం పరిధిలోకి వస్తుందన్న విషయం ఆయనకు తెలియడనుకోవాలా.. ఆ విన్నపమేదో తమ పార్టీ నేతృత్వంలో పనిచేస్తున్న కేంద్రాన్నే నేరుగా కోరవచ్చు కదా.. అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విష్ణురాజు విమర్శించారు. వాస్తవానికి గత ఏడాది కోవిడ్ తొలిదశలోను.. ప్రస్తుత రెండో దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న పకడ్బందీ చర్యలపై రాజకీయ ఆరోపణలే తప్ప మేధావులు, వైద్య నిపుణుల నుంచి ఎటువంటి ఆక్షేపణలు లేవు సరికదా.. ప్రశంసలు అందుతున్నాయి.. అదే సమయంలో దేశంలో కోవిడ్ నియంత్రణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జాతీయ, అంతర్జాతీయ మీడియా ఏకి పారేస్తున్న విషయం గమనిస్తే విష్ణుకుమార్ ఇటువంటి విమర్శలు చేసి ఉండరు.

Also Read : పంపిణీ సరే… టీకాలు ఏవీ మోడీజీ..?

Show comments