iDreamPost
iDreamPost
మత ప్రాతిపదికన రాజకీయాలు వర్కవుట్ కాకపోవడం తో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి కులం కార్డును నమ్ముకుంటోందన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో 25 శాతానికిపైగా ఉన్న కాపుల గురించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతం ఇస్తున్నాయి. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అత్యధిక జనాభా ఉన్నా.. కాపు సామాజిక వర్గం రాజకీయంగా నష్టపోయిందని అన్నారు.
బీజేపీతోనే ఆ వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి కాపులకు తమ పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం విస్తృతంగా నిధులు సమకూర్చిందని.. అయినప్పటికీ కేంద్రం ఇచ్చిన ప్రయోజనాలపై గుడ్డ కప్పే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పార్లమెంట్‌లో టీడీపీ, వైఎస్సార్ సీపీ ఎన్డీయేకు అనుకూలంగా వ్యవహరించాయని గుర్తుచేశారు. స్టీల్‌ప్లాంట్, పోలవరం వంటి అంశాలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించినట్లు ఎక్కడా వినలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని జీవీఎల్ అన్నారు.
కాపుల ఓట్ల కోసం ఎప్పటి నుంచో యత్నం
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కాపుల ఓట్లపై బీజేపీ ఎప్పుడో కన్నేసింది. అందుకే గతంలో కన్నా లక్ష్మీనారాయణను ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుతం అదే సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజును కొనసాగిస్తోంది. మరోపక్క ముందు జాగ్రత్తగా జనసేనతో పొత్తును కొనసాగిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. కన్నాను తప్పించి సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించడం ఎడం చేతికి బదులు పురచేతికి బాధ్యతలు బదలాయించినట్టు అయింది. పార్టీ అధ్యక్షుడు మారినా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. ఇందుకు వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలే తార్కాణం. గంపెడాశలతో జనసేనతో పెట్టుకున్న పొత్తు కూడా బీజేపీకి ఓటింగ్ శాతాన్ని పెంచలేకపోయింది. పైగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ టీడీపీని, బీజేపీని ఎలాగైనా కలపాలనే టాస్క్‌తో పనిచేస్తున్నారు తప్ప తన సొంత పార్టీని బలపరచడం పై దృష్టి సారించడం లేదు. ఆయన పార్ట్ టైమ్ పాలిటిక్స్ వల్ల జనసేన పుంజుకోవడం లేదు.
అసలు సొంత పార్టీనే సీరియస్‌గా తీసుకోని పవన్ తమకేమి అక్కరకు వస్తారని బీజేపీ భావిస్తోంది. మొత్తం మీద జనసేనతో బీజేపీ నేతలు ఊహించిన మిత్రలాభం దక్కడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని బీజేపీ నేతలు ఇలా స్టేట్‌మెంట్లు ఇచ్చి కాపులను మచ్చిక చేసుకోవాలని యత్నిస్తున్నారు. తనకంటూ సొంత ఓటు బ్యాంకును పెంచుకొనే ప్రయత్నం చేయకుండా, మతాన్నో, కులాన్నో నమ్ముకుని ఒక జాతీయ పార్టీ రాజకీయం చేయడమే విచిత్రం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలవరం నిర్మాణానికి సహకరించరా?
రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని జీవీఎల్ చెప్పడం ద్వారా పరోక్షంగా పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నట్టు అంగీకరించినట్టయింది. ఆ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుంది కనుక దాన్ని అడ్డుకోవడానికి ఇరిగేషన్ కాంపోనెంట్ నాటకం ఆడుతోందని అర్థమవుతోంది. లేకుంటే జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణంలో పూర్తి బాధ్యత కేంద్రానిది కాగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేతులు ఎత్తేస్తుంది? కేంద్రం నుంచి ఆర్థిక సహకారం లేకపోతేనే కదా? అలాగే స్టీల్‌ప్లాంట్, పోలవరం వంటి అంశాలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించినట్లు ఎక్కడా వినలేదని జీవీఎల్ పేర్కొనడం మరీ చోద్యం.
ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ వీటితోపాటు ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీని అడుగుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి బుగ్గన, అధికార పార్టీ ఎంపీలు సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరానికి నిధులు మంజూరు చేయాలని చాలాసార్లు విజ్ఞప్తి చేశారు. మొన్నటికి మొన్న సీఎం జగన్ ప్రధానిని, ఆర్థిక మంత్రిని కలిసి వివరించిన అంశాల్లో ఇవే ప్రధానమైనవి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాక, సీఎం జగన్ ప్రధానికి లేఖ కూడా రాశారు. ఇవేమీ వినలేదని జీవీఎల్ చెప్పడాన్ని బట్టే ఆయన జనాన్ని పక్కదోవ పట్టించడానికి యత్నిస్తున్నారని అర్థమవుతోంది. రాష్ట్ర సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేమిని సూచిస్తోంది.