iDreamPost
android-app
ios-app

ఏపీని ఆఫ్ఘాన్‌ గా మారుస్తుంటే మీరేం చేస్తున్నారు?

  • Published Jan 11, 2022 | 12:01 PM Updated Updated Jan 11, 2022 | 12:01 PM
ఏపీని ఆఫ్ఘాన్‌ గా మారుస్తుంటే మీరేం చేస్తున్నారు?

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ను ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ నేతలు తప్పుపడుతున్నారు. మంగళవారం కర్నూలులో విలేకరులతో మాట్లాడిన విష్ణువర్థన్ రెడ్డి వై సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రాను తాలిబన్లుగా పాలిస్తున్నారని… వైఎస్సార్‌ సీపీ ఉగ్రవాద పార్టీ అని తాలిబన్లు ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎంల రూపంలో పాలిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటన్నారు. ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య జరిగింది కాదన్నారు. వైఎస్సార్‌ సీపీ, బీజేపీ మధ్య జరిగిన సంఘటన అని తెలిపారు.

అధికార పార్టీ నేతలను కేసు నుంచి తప్పించేందుకు మత ఘర్షణలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎస్డీఎఫ్ రూపంలో ఉగ్రవాదమూకలు పని చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం జగన్, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మధ్య జరిగిన చర్చలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర ఆఫీస్ సూచనలతోనే ఆత్మకూరులో దాడులు చేశారన్నారు. ఆత్మకూరుకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకున్నవాళ్ళు డిప్యూటీ సీఎంను ఎందుకు పంపారని ప్రశ్నించారు. ఐపీసీని వైఎస్సార్‌ సీపీగా మార్చేస్తారా అని నిలదీశారు. ఆత్మకూరు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌ సీపీ పులులు ఢిల్లీలో పిల్లులు అంటూ విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ సామర్థ్యాన్ని శంకిస్తున్నారా?

వైఎస్సార్‌ సీపీపై వీరావేశంతో విష్ణువర్థన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న తన పార్టీ ప్రభుత్వ సామర్థ్యాన్ని శంకిస్తున్నట్టు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయని వైఎస్సార్‌ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రంలో ఉగ్రవాద పార్టీ తాలిబన్లు మాదిరిగా పాలిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ఆఫ్ఘనిస్తాన్‌గా, ఐపీసీని వైఎస్సార్‌ సీపీగా మార్చేస్తే.. ఏమీ చేయలేని చేతకానితనంతో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పరిపాలిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎంలను తప్పుపడుతూ ఆత్మకూరు ఘటనను రెండు పార్టీల మధ్య వైరంగా చిత్రీకరించాలని విష్ణువర్థన్ రెడ్డి యత్నించడం దురదృష్టకరమని, మత రాజకీయాలు చేసి ప్రజల్లో చీలిక తేవాలని యత్నించడం దుర్మార్గమని అంటున్నారు.

Also Read : ఆత్మకూరులో ఉద్రిక్తత…విధ్వంసం

చట్టం ప్రకారం పోలీసులు తమ పని తాము చేస్తుంటే ఎస్డీఎఫ్ రూపంలో ఉగ్రవాదమూకలు పని చేస్తున్నాయని ఆరోపించడం పూర్తి బాధ్యతారాహిత్యమే కాక వారి ఆత్మ స్థైర్యం దెబ్బతీసేలా ఉంది. ఏ చిన్న ఘటన జరిగినా మతానికి ముడిపెట్టేసి రాజకీయ లబ్ధి పొందాలనే ధోరణి బీజీపీ నేతల్లో ఎప్పటి నుంచో ఉండగా ఇటీవల మరీ ఎక్కువైంది. ప్రజాగ్రహ సభ తర్వాత బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేస్తాం, దూకుడు పెంచుతాం అంటూ ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశాల్లో ఇలా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. వైఎస్సార్‌ సీపీ పులులు ఢిల్లీలో పిల్లులు అనడం కూడా కేంద్రంలోని తమ పార్టీ ప్రభుత్వాన్ని ఒక భూతంలా చూపడమేనని అంటున్నారు. బీజేపీ అగ్రనేతలు మిగతా పార్టీ వారితో వ్యవహరించేటప్పుడు అధికారాన్ని అడ్డంపెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలకు పాల్పడతారనే అర్థం అందులో ధ్వనిస్తోందని అంటున్నారు.

భావ దారిద్య్రంతో.. టీడీపీ బాటలో…

రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వేసిన బాటలోనే నడుస్తున్నాయి. అధికార పక్షంపై చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ చేసిన అర్థం పర్థంలేని వ్యాఖ్యలనే అన్ని పార్టీల వారు వల్లె వేస్తుంటారు. ఇప్పుడు తాజాగా బీజేపీ నేతలు ఆ పని చేస్తున్నారు. అధికార పార్టీని తాలిబన్లతో పోలుస్తూ ఈ తరహా విమర్శలు టీడీపీ నేతలు గతంలో పెద్ద ఎత్తున చేశారు. దానివల్ల టీడీపీకి ప్రయోజనం లేకపోగా వైఎస్సార్‌ సీపీ జనంలో మరింత బలపడిందని ఆ తర్వాత వచ్చిన వరుస ఎన్నికల్లో రుజువైంది. దీంతో ప్రజల్లో బలమైన పట్టున్న పార్టీపై ఆ తరహా వ్యాఖ్యలు చేస్తే ఉపయోగం లేదని అర్థమైందో ఏమో టీడీపీ ఇలాంటి విమర్శలు మానేసింది.

అయితే బీజేపీ ఇంకా వాటినే పట్టుకొని వేలాడుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. మా పార్టీ ఆ స్థాయికి ఎదుగుతుంది. మేమే అసలైన ప్రత్యామ్నాయం అని చెప్పుకొనే బీజేపీ నేతలు భావ దారిద్య్రంతో ఈ విధంగా తెలుగుదేశం బాటలో నడుస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తమది జాతీయ పార్టీ అని, సిద్ధాంత నిబద్ధత ఉన్న పార్టీ అని గొప్పలు చెప్పుకొనే బీజేపీ ఇలా ఒక ప్రాంతీయ పార్టీ దారిలోనే నడుస్తూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఎదుగుతుంది అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై బురద జల్లితే బీజేపీ రాష్ట్రంలో బలపడదు అన్న సంగతి ఆ పార్టీ నాయకులు గుర్తిస్తే మంచిది అన్న సూచనలు వినిపిస్తున్నాయి.

Also Read : మతోన్మాద ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్, కఠిన చర్యలకు ఆదేశం