iDreamPost
iDreamPost
దక్షిణాదిలో పాగా వేయాలని దశాబ్దాలుగా కలలుగంటున్న భారతీయ జనతాపార్టీకి.. ఆ విషయంలో మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా నిరాశనే మిగిల్చాయి. వీటితోపాటు జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ఫలితాలు ఆ పార్టీకి పెద్ద షాక్ గా పరిణమించాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడాన్ని కలలో కూడా ఊహించలేని ఆ పార్టీ నేతలు.. కనీసం అధికార వైఎస్సార్సీపీకి ప్రత్యామ్నాయంగానైనా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నేతలు పార్టీ అగ్రనాయకత్వంలో ఆ రకమైన ఆశలు కల్పించారు. అయితే తిరుపతి ఫలితం వారి ఆశలను తుంచేసింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీగా వీర్రాజు పదవీకాలం ముగిసింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన్ను కొనసాగిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ప్రభావం చూపని నాయకుడు
గత టీడీపీ హయాంలో ఆ పార్టీతో ఉన్న పొత్తులో భాగంగా బీజేపీ నాయకుడైన సోము వీర్రాజు శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నోరున్న నేతగా పేరున్న ఆయన శాసనమండలిలో పలుమార్లు గళం విప్పారు కూడా. పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టాలన్నది ఆయన చిరకాల వాంఛ. కన్నా లక్ష్మీనారాయణకు ముందు ఈయన్నే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారని భావించారు. అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నాకు ఆ పదవి దక్కడంతో నిరాశ చెందారు. కానీ ఏదో చేస్తారని ఆశించిన కన్నా వల్ల పార్టీకి అదనపు బలం చేకూరకపోగా.. సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హార్డుకోర్ బీజేపీ నేతగా.. రాష్ట్రంలో బలమైన సామాజికవర్గంలో పేరున్న నేతగా చెలామణీ అవుతున్న సోమును గత ఏడాది జూలైలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ నాయకత్వం నియమించింది. అధ్యక్ష పదవి చేపట్టిన కొత్తలో రాష్ట్రంలో కాస్త హడావుడి చేసి పనిచేస్తున్నారని అనిపించుకున్న వీర్రాజు.. తర్వాత కాలంలో పెద్ద ప్రభావం చూపలేకపోయారు.
తిరుపతి ఫలితంతో తుస్సు
రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి చేపట్టిన వెంటనే వీర్రాజు రాష్ట్రమంతా కలియదిరిగారు. ముఖ్యంగా బలమైన కాపు సామాజికవర్గ నేతలను, నిష్క్రియపరత్వంలో ఉన్న టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారు. చాలా మందితో చర్చలు జరిపారు. ఇంకేముంది పార్టీలోకి వలసలు ప్రారంభమవుతాయని అనుకున్నారు. కానీ అటువంటివేవీ జరగలేదు. ఇక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయంలో సోము చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని.. తిరుపతి ఉప ఎన్నికతో ఆ విషయం రుజువు చేస్తామంటూ ఆరేడు నెలల ముందు నుంచే హడావుడి చేశారు. మిత్రపక్షమైన జనసేన ప్రమేయం లేకుండా.. తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తుందని ఏకపక్షంగా ప్రకటించారు. పవన్ ను అందుకు బలవంతంగా ఒప్పించారు. ఉప ఎన్నికల్లో మంచి అవకాశాలు ఉన్నాయని.. రెండో స్థానంలో ఉంటామని అగ్రనాయకత్వాన్ని ఊదరగొట్టి.. ప్రచారానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా తదితరులను రప్పించారు. దానికి విరుద్ధంగా ప్రచార సభలు పేలవంగా జరగడంతో వారు సోముపై అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నిక ఫలితం దాన్ని మరింత రాజేసింది.
ఇంత ఆర్భాటం చేసి హైప్ క్రియేట్ చేసినా.. జనసేన మద్దతుతో ఉన్నా బీజేపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ ఉప ఎన్నిక తర్వాత బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతాయని.. రాష్ట్రంలో పార్టీ వెలిగిపోతుందని అగ్రనాయకత్వానికి ఇచ్చిన హామీలను తిరుపతి ఫలితం నీటి బుడగలా పేల్చేసింది. ఈ పరిణామాలు సోము నాయకత్వ పటిమపై జాతీయ నాయకత్వంలో అపనమ్మకానికి దారితీశాయి. ఎమ్మెల్సీ గా రిటైర్ అయిన సోము మళ్లీ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఎలాగూ లేదు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన్ను కొనసాగించేందుకు జాతీయ నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు లేదు.
Also Read : రాజకీయంతో కాదు మనస్సుతో చూడిండి చినబాబు..!