iDreamPost
android-app
ios-app

Somu Veerraju, Sir Arthur Cotton Barrage – కాటన్ మహాశయుడి గురించి తెలియదా సోము..?

  • Published Dec 31, 2021 | 2:09 PM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
Somu Veerraju, Sir Arthur Cotton Barrage – కాటన్ మహాశయుడి గురించి తెలియదా సోము..?

చీప్‌ లిక్కర్‌ పై హామీతో చీప్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు అని విమర్శలు వెళ్లువెత్తినా ఆయన లెక్కచేయడం లేదు. ఏపీలో తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ తక్కువ ధరకే ఇస్తామనే హామీతో దేశవ్యాప్తంగా బీజేపీ ఇమేజ్‌ను కాస్తా డ్యామేజ్‌ చేసినా కూడా ఆయన వెనక్కు తగ్గడం లేదు. ఆయన ఇచ్చిన హామీపై రాజకీయ నాయకులు విరుచుకుపడుతున్నా… నెెటిజన్లు సెటైర్లు వేస్తూ ట్రోల్ చేేస్తున్నా… పార్టీకి నష్టంగా మారిందన్నా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లెక్కచేయడం లేదు. తన వ్యాఖ్యలను సమర్ధించుకోవడమే కాదు… మరోసారి వివాదాస్పదమైన హామీలతో రాష్ట్రంలో వర్గాల మధ్య ఉద్రిక్తలు రెచ్చగొట్టేలా మాట్లాడారు.

ఇప్పటికే గుంటూరు జిన్నా టవర్‌ వివాదం నెలకొన్న సమయంలో ఆయన తాజాగా హైదరాబాద్‌ను భాగ్యనగరంగా పిలుస్తున్నామని… పనిలో పనిగా తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని విశాఖపట్నం కేజీహెచ్‌… కాటన్‌ బ్యారేజ్‌‌ ల పేరు మారుస్తామని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ కొత్త వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు.
గోదావరి జిల్లాలు సస్యశ్యామలం అయ్యాయంటే అందుకు కాటన్‌ నేతృత్వంలో నిర్మించిన ఆనకట్ట మాత్రమే కారణం. అంతకుముందు ఉభయ గోదావరి జిల్లాల్లో నిత్యం కరువుకాటకాలతో ఉండేదనేది చరిత్ర చెబుతోంది. 1852లో దీనిని నిర్మించారు. నేటికి 169 సంవత్సరాలు అవుతున్నా పాత ఆనకట్ట చెక్కుచెదరలేదు. నాడు నిర్మించిన హెడ్‌ స్లూయిజ్‌లు, ఇరిగేషన్‌ కార్యాలయాలు ఇప్పటికీ పటిష్టంగానే ఉన్నాయి. ఇందుకు ఆధ్యుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ మహానుభావుడని ఈ జిల్లా వాసుల ప్రగాఢ విశ్వాసం.

1985లో కొత్త బ్యారేజ్‌ అందుబాటులోకి వచ్చినా కాటన్‌ ఆనకట్ట కట్టడం వల్లే గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా మారాయని ఈ తరం వారు కూడా నమ్ముతారు. ఈ ఆనకట్ట నిర్మాణం తరువాత ఆయన స్వదేశం వెళ్లిపోయారు. ఆయన 1889లో మరణించారు. అంటే ఇప్పటికి 132 ఏళ్లు. కాటన్‌ ఈ లోకాన్ని వదిలిన తరువాత ఇది మూడవ తరం. అయినా కాటన్‌ను గోదావరి జిల్లా వాసులు మహానుభావునిగా కొలుస్తారు. విగ్రహాలు పెడతారు. జయంతి, వర్థంతులు ఘనంగా నిర్వహిస్తారు. కుల, మత, జాతి, ప్రాంతాలకు అతీతంగా కాటన్‌ ను కొలిచే గోదావరి జిల్లాలకు చెందిన సోము వీర్రాజు తమ పార్టీ అధికారంలోకి వస్తే కాటన్‌ బ్యారేజ్‌కు పేరు మారుస్తామని ప్రకటించడం ద్వారా కాటన్‌ను అభిమానించే రైతులు, వారి కుటుంబాల వారి మనోభావాలను ఆయన దెబ్బతీశారు.

గోదావరి జిల్లాకు చెందిన వీర్రాజు ఆనకట్ట నిర్మాణ చరిత్ర తెలిసి కూడా కాటన్‌ పేరు తొలగిస్తానన్నారా? లేక నిజంగానే ఆయనకు చరిత్ర తెలియదా? అనే కొత్త అనుమానం సామాన్యులకు కలిగేలా మాట్లాడడం విని పలువురు నొచ్చుకుంటున్నారు. కాటన్‌ పేరు తొలగించి ఆనకట్ట నిర్మాణంలో పాలుపంచుకున్న స్థానిక ఇంజనీరు వీణం వీర్రాజు పేరు పెడతామని సోము కొత్త వివాదాన్ని లేపారు. వీణం ఆనకట్ట నిర్మాణంలో కీలక భాగస్వామి. ఒక విధంగా చెప్పాలంటే కాటన్‌కు ముఖ్య అనుచరుడు. హైదరాబాద్‌కు భాగ్యనగరంగా పేరు మార్చాలని కనీసం బీజేపీ పార్టీ తొలి నుంచి డిమాండ్‌ చేస్తోంది. కాని కాటన్‌ బ్యారేజ్‌ పేరు మార్పు చేయాలనే డిమాండ్‌ లేదు. కనీసం గోదావరి జిల్లాల్లో ఈ ప్రస్తావన చిన్నగా కూడా లేదు.

కేవలం ఒక వర్గం వారి ఓట్ల కోసం… వారి మెప్పు కోసం వీర్రాజు మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో లక్షల మంది రోగులకు వైద్య సేవలందించిన విశాఖపట్నంలోని పురాతన కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ (కేజీహెచ్‌) పేరు కూడా మారుస్తామని వీర్రాజు అక్కడ వారి మనోభావాలను కూడా దెబ్బతీశారు. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకోవడమే తప్ప… బీజేపీ నాయకులు ఏదో విధంగా మత ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయరని సామాన్యులు ఆరోపిస్తున్నారు. సోము చేస్తున్న ఈ వివాదాస్పద ప్రకటనల వల్ల తమ పార్టీకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తోందని బీజేపీ కార్యకర్తలే వాపోతున్నారు.