iDreamPost
android-app
ios-app

Somu Veerraju, BJP – నిన్న జీవీఎల్‌… నేడు సోము అప్పులు చేస్తే రాష్ట్రాలే దివాళా తీస్తాయా?

  • Published Dec 29, 2021 | 2:50 PM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
Somu Veerraju, BJP – నిన్న జీవీఎల్‌… నేడు సోము అప్పులు చేస్తే రాష్ట్రాలే దివాళా తీస్తాయా?

నిన్న జీవీఎల్‌.. నేడు సోము వీర్రాజు.. ఒకే మాట.. ఒకటే పాట. ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని. తొలుత బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్శింహం.. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజులు ఒక లైన్‌లో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సోము మాట్లాడుతూ ‘అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు’ అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. ఇక్కడ సోము కూడా ‘గురివింద గింజ తన కింద ఉన్న నలుపును గుర్తించదు’ అన్న చందాన ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ అప్పులు ప్రస్తావిస్తున్న వీరు గడిచిన ఏడున్నరేళ్ల కేంద్రంలో తమ బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాట మాత్రమైన ప్రస్తావించడం లేదు. అప్పులు చేస్తే రాష్ట్రాలు మాత్రమే దివాళా తీస్తాయి అన్నట్టుగా… కేంద్రం మాత్రం దీనికి అతీతం అన్నట్టుగా బీజేపీ స్థానిక నేతల విమర్శలు కొనసాగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం కూడా భారీగానే అప్పులు చేసింది. నరేంద్ర మోడీ అధికారంలోకి రాక ముందు కేంద్రం చేసిన అప్పులు రూ.50 లక్షల కోట్లు. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇది కాస్తా రూ.1.30 లక్షల కోట్లకు చేరింది. ఏడేళ్లలో అక్షరాలా రూ.80 లక్షల కోట్లు అప్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వం కనీసం చేసిన అప్పుల మీద నిజాలు ఒప్పుకున్న సందర్భం లేదు, సరికదా ఎందుకు ఖర్చు పెట్టారో కూడా వివరించలేదు. అంతేకాదు.. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరిచారు. గడిచిన రెండేళ్లుగా వస్తున్న ఆదాయం కన్నా అదనంగా ఏడాదికి రూ.ఐదు లక్షల కోట్లు చొప్పున రూ.పది లక్షల కోట్లు ఆదాయం పొందింది. అయితే ఈ సొమ్ములు ఎక్కుడిపోతున్నాయో మాత్రం బహిరంగంగా చెప్పే సాహసం చేయదు.

ఇదే విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలు గతంలో ప్రశ్నించినా బీజేపీ తెలుగు నేతల నుంచి సమాధానం రాలేదు. మిగిలిన రాష్ట్రాలలో అడిగేవారు లేరు. కేంద్రంలో చెప్పేవారు అంతకన్నా లేరు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో 1.30 లక్షల కోట్లు వివిధ పథకాల ద్వారా ప్రజల ఎకౌంట్లలో జమ చేశారు. అది కూడా చాలా పారదర్శకంగా. కేంద్రం అలా చెప్పిన సందర్భం లేదు. ఇవన్నీ బీజేపీ నేతలకు తెలియనిది కాదు. అయినా నోరు మెదపరు. ఎంతసేపూ ఏపీ అప్పుల గురించి మాత్రమే ఆయన చెబుతారు.

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిన విషయం బహిరంగ రహస్యం. ప్రభుత్వమే బహిరంగంగా వెల్లడిస్తోంది. ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో కోవిడ్‌ రావడం, ఆర్థిక స్థితి అస్తవ్యస్తం కావడం వలన ఆదాయం దారుణంగా పడిపోయింది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడం, గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు భారీగా వడ్డీ చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వం అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టో హామీలు అమలు చేస్తున్నారు. ఈ నగదు బదిలీ పథకాల వల్లే కోవిడ్‌ సమయంలో ఆకలి చావులు చోటు చేసుకోలేదు. మనీ సర్కుల్యేట్‌ అవడం వల్లే అన్ని వ్యవస్థలు నడిచాయి.

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఆర్థిక వేత్తలు చెప్పింది కూడా కోవిడ్‌ సమయంలో ప్రభుత్వాలు మనీ సర్క్యులేట్‌ చేయమనే. అప్పులు చేస్తున్న విషయం రాష్ట్రంలోని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం దాయడం లేదు. బహిరంగంగానే ప్రకటిస్తోంది. ఇందుకు కారణాలు కూడా వివరిస్తోంది. అయినా కూడా ఇదేదో రహస్యంగా చేస్తున్నట్టు బీజేపీ నేతలు విమర్శలు చేయడాన్ని సామాన్యులు తప్పుపడుతున్నారు. కేంద్రంలోనే కాదు… బీజేపీ పాలిత ప్రభుత్వాలు సైతం భారీగా అప్పులు చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి మరీ ఏపీ ప్రభుత్వాన్ని అప్పుల విషయంలో తప్పుపట్టడం విడ్డూరంగా ఉందని జనం చెప్పుకుంటున్నారు.

Also Read : సోషల్‌ మీడియా సెటైర్లు వేసినా.. సోము ఊహించని ఫలితం దక్కింది..