బెంగాల్లో విజయం కోసం ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్న భారతీయ జనతా పార్టీ అత్యంత దిగువ స్థాయి పేదలకు టికెట్లు ఇవ్వడం ద్వారా కొత్త ప్రచారానికి నాంది పలికింది. అందులోనూ ఇద్దరూ మహిళలు కావడం, ఒకరు పని మనిషి అయితే మరొకరు ఉపాధి హామీ కూలీ కావడం యాదృచ్చికం అయితే కాదు. రాజకీయ ప్రయోజనంతో పాటు తమ పార్టీ పేదల పార్టీ అని సంకేతాన్ని ఇచ్చేందుకే బిజెపి వారికీ టికెట్లు కేటాయించిందన్న విమర్శలు వస్తున్నాయి.
సాధారణంగా రాజకీయాలన్నీ డబ్బు, పరపతి చుట్టే తిరుగుతాయి అనేది అందరూ అనుకునే మాట. అంగ బలం, ఆర్ధిక బలం ఉన్నవారికే పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. ధనవంతులైతే ఎన్నికల ప్రచారంలో ఖర్చులన్నీ వారే చూసుకుంటారని పార్టీలు భావిస్తాయి. అందుకే క్యాష్ పార్టీలకు మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తుంటాయి. ఈ రోజుల్లో రాజకీయాలు, ఎన్నికలు అంటే చాలా కాస్ట్లీగా మారాయి.
అయితే పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. బీజేపీ ఓ కామన్ మ్యాన్ కి అదీ పనిమనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి కలితా మాంజీ అనే పని మనిషిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది బీజేపీ. ఆమెకి టికెట్ ఇవ్వడం రాష్ట్రంలో చర్చకు దారితీసింది. స్థానిక బీజేపీ కార్యకర్తలు సైతం ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలీ కలితా ఎవరు? అంటూ ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. సుమారు 30 మంది వరకు ఆశావహులు ఉన్న ఈ నియోజకవర్గంలో బిజెపి అనూహ్యంగా ఒక పని మనిషి ని రంగంలోకి దింపడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కలితా మాంజీ.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. ఓ చెరువు పక్కన పూరింట్లో ఉంటుంది. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేదు. ప్రతీరోజూ నాలుగిళ్లలో పనిచేస్తుంది. నెలకు రూ. 2,500 వరకూ సంపాదిస్తుంది. ఇక ఆమె భర్త ప్లంబర్. దంపతులు రోజంతా కష్టపడితే కానీ నాలుగు మెతుకులు దొరకవు. అదే సమయంలో కలితా మాంజీ ఐదేళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది. బిజెపి తరఫున ఆమె ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై గత కొంత కాలంగా పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఇటు తన పని చేసుకుంటూనే తీరిక సమయాలు చూసుకొని పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నారు ఆమె.
వెస్ట్ బెంగాల్ ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి.. మాంజి మరింత యాక్టివ్ అయ్యింది. బీజేపీ టిక్కెట్ ఇవ్వడంతో ప్రస్తుతం ఆమె నెల రోజుల పాటు సెలవు పెట్టి ప్రచారం కొనసాగిస్తోంది. తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శలు సంధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల ప్రచారంలో నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే విమర్శల బాణం ఎక్కుపెట్టింది. ఆట ఆడదాం అని ఎన్నికల ప్రచారంలో దీదీ చేస్తున్న నినాదాన్ని ఉద్దేశించి… ‘‘మోకాలి గాయంతో ఎన్నికల ఆటను మమత ఎలా ఆడతారు’’ అంటూ వ్యంగ్యాస్తాల్రు సంధిస్తోంది కలితా మాంజీ.
Also Read : బీజేపీ టిక్కెట్ అడుగుతున్న ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరు..?
”నాకు ఇలాంటి అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రస్తుం ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాను. ముందుకు సాగమని, ఎన్నికల్లో విజయం సాధించాలని… నా తోటి పని మనుషులు నన్ను ప్రోత్సహించారు” అని కలితా చెప్పారు. కలితా తాను ఇంటి సహాయకురాలిని కావడం, దీనికితోడు పేద కుటుంబానికి చెందిన దాన్ని కావడంతో అందరి కష్టాలు తనకు తెలుసని కలితా మాంజీ అన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే పేదలకు మరింత సాయం చేయగలుగుతానని చెబుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కలితా మాంజీ.
మరో కూలీకి సైతం!
బ్యాంకులో 6,335 రూపాయలు. చేతిలో 25,650 ల నగదు మాత్రమే ఉందని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఉపాధి హామీ కూలీ చందన బౌరి ను సైతం బీజేపీ తన అభ్యర్థిగా రంగంలోకి దింపింది. బంకురా జిల్లా, సెల్టోరా అసెంబ్లీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా చందనపల్లి లో ఉన్నారు. ఆమె 2018 పంచాయతీ ఎన్నికల నుంచి బిజెపిలో కొనసాగుతున్నారు. జిల్లా బిజెపి కమిటీలోనూ సభ్యురాలిగా ఉన్నారు. చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న ఆమె ఎన్నో కష్టాలను ఎదిరించి జీవితంలో ముందుకు సాగారు. ఆమె భర్త శ్రాబాన్ సైతం భవన నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజువారీ 300 వేతనం తో ముందుకు సాగే వీరి జీవితంలో ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని చందన చెబుతోంది.
అయితే దీనిని బిజెపి రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేస్తూ, పేదలకు సైతం అక్కున చేర్చుకొని గల పార్టీ తమదే అంటూ ఎన్నికల్లో ఈ అవకాశాన్ని కూడా వాడుకునేందుకు ఉపయోగించుకుంటోంది. చేసింది మంచి పని అయినా, దానిలో రాజకీయాలు వెతకడం ద్వారా బీజేపీ అసలు రంగు బయటపడుతుందని విపక్ష పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది బెంగాల్ ఎన్నికల్లో ఎంతమేర ప్రభావం చూపుతుంది అన్నది త్వరలోనే తెలుతుంది.
Also Read : దేశంలో ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసా..!