దుబ్బాక దారిలో తిరుపతి, బీజేపీ నేతల అత్యాశ

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే తెలంగాణాలో బీజేపీకి మొన్నటి సాధారణ ఎన్నికల్లో దక్కిన ఫలితాల కన్నా ఇదే ఎక్కువ సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ముంగిట హోరాహోరీ పోరులో విజయం సాధించడం రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. స్వయంగా ముఖ్యమంత్రి కుమార్తెను ఓడించిన ధర్మపురి అరవింద్ గెలుపు కన్నా ట్రంప్ కార్డ్ అనుకునే హరీష్‌ రావు ఎత్తులను చిత్తు చేసిన రఘునందన్ రావు విజయమే జోష్ నింపుతుంది. అదే ఊపులో త్వరలోనే బీజేపీని తెలంగాణాలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలపాలని కమలనాధులు కలలు కంటున్నారు. అందుకు అనుగుణంగా వాతావరణం ఉండడంతో మరింతగా విజృంభించే అవకాశం ఉంది.

కానీ ఏపీలో పరిస్థితి దానికి పూర్తి భిన్నం. అయినా తెలంగాణా విజయం సాధించిన ఉత్సాహం ఏపీ బీజేపీ నేతలను కూడా ఆవరించింది. తాము కూడా అదే బాటలో వెళ్లాలనే అత్యుత్సాహం చూపుతున్నారు. అంతకుమించి ఏకంగా తిరుపతి ఎంపీ స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నికలను కూడా దుబ్బాకతో పోల్చేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా సునీల్ దేవదర్ వంటి బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే తామే గెలుస్తున్నామనేటంత రీతిలో ఉంది. కానీ తెలంగాణాలో బీజేపీ పునాదికి ఏపీలో ఆపార్టీ క్షేత్రస్థాయి బలానికి చాలా వైరుద్యం ఉంది. అసలు పోలికే లేదు. పైగా తిరుపతి లాంటి చోట్ల బీజేపీకి కనీస బలం కూడా ఉన్నట్టు కనిపించదు. అయినా కానీ దుబ్బాక సీన్ రిపీట్ చేస్తామనే ధీమా వ్యక్తపరుస్తున్న తీరు విశేషంగానే చెప్పాలి.

వాస్తవానికి దుబ్బాకలో బీజేపీ విజయం ఆపార్టీ బలం కన్నా కేసీఆర్ మీద వ్యతిరేకత ప్రధాన కారణం అని అంతా అంగీకరిస్తారు. రఘునందన్ రావు వ్యక్తిగత ఇమేజ్ దానికి దోహదపడింది. వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలవుతున్న సానుభూతి సహకరించింది. అందుకు అనుగుణంగా అన్ని పార్టీలు కేసీఆర్ వ్యతిరేకతతో బీజేపీని బలపరిచాయి. తమ సొంత పార్టీ అభ్యర్తులున్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీ అనే తేడా లేకుండా అంతా బీజేపీ విజయానికి తోడ్పడ్డారు. చివరకు టీఆర్ఎస్ లోని అసంతృఫ్తి వాదులు కూడా బీజేపీ విజయంలో భాగస్వామ్యం అన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు కలిసివచ్చి సాధించిన విజయాన్ని ఏకంగా తిరుపతి ఎంపీ స్తానంలో సాధించగమని చెప్పడం రాజకీయంగా ప్రచారానికి పనికొస్తుంది గానీ పార్టీ విజయానికి దోహదపడే అంశం కాదు.

తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొన్ని మండలాల్లో నేటికీ బీజేపీ కి జెండా కట్టే నాథుడే లేడు అంటే అతిశయోక్తి కాదు. అయినా గానీ తామే విజయం సాధిస్తామని చెప్పడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని భావించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే జనసేన తమకు మిత్రపక్షం ఉండగా , టీడీపీ కూడా పోటీ నుంచి తప్పుకుని తమను బలపరిచేలా ఒత్తిడి పెంచే దిశలో బీజేపీ ఉందని అర్థమవుతుంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం తమ వైపు మళ్లించుకోవాలనే సంకల్పంతో ఉన్నట్టు స్పష్టమవుతుంది. కానీ తిరుపతిలో కాంగ్రెస్, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ వంటి వారు నేటికీ ఉనికి చాటుకుంటున్నారు. దాంతో బీజేపీ ఆశలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. అదే సమయంలో బీజేపీ ఒత్తిడికి తలొగ్గి పోటీ నుంచి విరమించుకుని బీజేపీకి ప్రత్యక్ష లేదా పరోక్ష మద్ధతు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడితే ఇక అది ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదాని ఆపార్టీకి కట్టబెట్టేందుకు సంసిద్ధత అన్నట్టుగా మారుతుంది. తద్వారా టీడీపీ సొంత బలం త్యాగం చేసేందుకు తయారీ అన్నట్టుగా మారుతుంది.

ఏమయినా దుబ్బాక ఫలితాల తర్వాత గంపెడాశలు పెట్టుకున్న బీజేపీకి తిరుపతిలో అలాంటి పరిస్థితి ఉండదని తెలుసు. అయినా గానీ రాజకీయంగా ఎత్తులు వేస్తూ తమ బలం పెంచుకునే ప్రయత్నంలో కమలనాథులు టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే అంశం అవుతుందని ఆశిస్తున్నారు. దుబ్బాక మాదిరిగా గెలవకపోయినా తిరుపతిలో కొంత ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

Show comments