iDreamPost
android-app
ios-app

BJP, Karnataka, Urban Local body Elections – కర్ణాటక స్థానిక ఎన్నికల్లో బీజేపీకి షాక్

  • Published Dec 30, 2021 | 1:13 PM Updated Updated Dec 30, 2021 | 1:13 PM
BJP, Karnataka, Urban Local body Elections – కర్ణాటక స్థానిక ఎన్నికల్లో బీజేపీకి షాక్

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. అధికార బలంతో దూకుడు ప్రదర్శించాలనుకుంటున్న ఆ పార్టీకి ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. నవంబరులో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్యంగా ఒక సీటు గెలుచుకున్న కాంగ్రెస్ ఈ నెల మొదట్లో 25 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీతో సమానంగా 11 సీట్లు గెలిచి గట్టి పోటీ ఇచ్చింది. ఇక తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. వివిధ కేటగిరీలకు చెందిన వార్డుల్లో బీజేపీ కంటే ఎక్కువ ఫలితాలు సాధించి అధికార పార్టీని కంగుతినిపించింది. ఈ ఎన్నికల్లో జేడీఎస్ మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఓట్లపరంగా చూస్తే కాంగ్రెస్ 42.06 శాతం, బీజేపీ 36.90 శాతం, జేడీఎస్ కేవలం 3.81 శాతం ఓట్లు సాధించాయి.

ఫలితాల వివరాలు

రాష్ట్రంలోని 58 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, టౌన్ పంచాయతీల పరిధిలో ఈ నెల 27న ఎన్నికలు జరిగాయి. గురువారం ఫలితాలు ప్రకటించారు.

-ఎన్నికలు జరిగిన 441 మున్సిపల్ కౌన్సిల్ సీట్లలో కాంగ్రెస్ 201, బీజేపీ 176, జేడీఎస్ 21, ఇతరులు 43 సీట్లలో గెలిచారు.

-నగరపాలక సంస్థల పరిధిలో మొత్తం 1187 స్థానాల్లో కాంగ్రెస్ 508, బీజేపీ 437, జేడీఎస్ 45, ఇతరులు 197 స్థానాలు చేజిక్కించుకున్నారు.

-166 సిటీ మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 67, కాంగ్రెస్ 61, జేడీఎస్ 12, ఇతరులు 26 చోట్ల విజయం సాధించాయి.

-577 టౌన్ పంచాయతీ వార్డులకు గానూ కాంగ్రెస్ 236, బీజేపీ 194, జేడీఎస్ 12, ఇతరులు 135 వార్డుల్లో విజయం సాధించారు.

వరుస షాకులతో ఆందోళన

యడ్యూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మై సీఎం పదవి చేపట్టిన తర్వాత వరుసగా జరిగిన మూడు ఎన్నికల్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురుకావడం ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. నవంబరులో సిందగి, హనగల్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగ్గా సిందగిలో మాత్రమే బీజేపీ గెలిచింది. హనగల్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అనంతరం ఈ నెల మొదట్లో స్థానిక సంస్థల కోటాలో 25 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలోనూ బీజేపీ హవాను కాంగ్రెస్ అడ్డుకుంది. ఈ రెండు పార్టీలు చెరో 11 సీట్లు గెలుచుకున్నాయి. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత పుంజుకుని బీజేపీ కంటే ఎక్కువ సీట్లు ఓట్లు సాధించడం విశేషం. రాష్ట్రంలో మరో ఏడాదిన్నరలో అంటే 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఫలితాలు కాంగ్రెసులో జోష్ నింపితే.. బీజేపీకి నిరాశ కలిగించాయి. జేడీఎస్ పరిస్థితి మరీ దారుణం. పేరుకు మూడో స్థానంలో ఉన్న కేవలం నాలుగు శాతంలోపే ఓట్లు పొందడం పార్టీని కుంగదీస్తోంది.

Also Read : పార్టీలకు ఆ చింత తీరింది