నూపుర్ శర్మ వివాదం: క్ష‌మాప‌ణ‌లు చెప్పండి, అర‌బ్ దేశాల డిమాండ్.. భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీకి చెందిన ఇద్దరు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం పెల్లుబకడంతో భారత్ ఇరుకున‌ప‌డింది. అదేస‌మయంలో కొన్ని భాగస్వామ్య దేశాలను శాంతింప చేయాల్సి వచ్చింది.

బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, టీవీ చర్చలో ఈ వ్యాఖ్యలు చేయ‌డం వివాదానికి బీజం. . అక్క‌డితో ఆగిఉంటే బాగుండేదికాని, దిల్లీ బీజేపీ విభాగానికి చెందిన నవీన్ కుమార్ జిందాల్, ఈ విష‌యంపై ట్వీట్‌ చేశారు.

నూపుర్ శర్మ వ్యాఖ్యలు ముస్లిం సమాజానికి కోపం తెప్పించాయి. అక్కడక్కడ నిరసనలకు కారణమయ్యాయి. వెంట‌నే తేరుకున్న‌ బీజేపీ కూడా, ఏ మతాన్నీ, వర్గాన్ని అవమానించే, కించపరిచే భావజాలానికి వ్య‌తిరేక‌మ‌ని, అలాంటి వ్యక్తులను పార్టీ ప్రోత్సహించద‌ని బీజేపీ ప్రకటనలో గ‌ట్టిగానే చెప్పింది. ఈ వివాదానికి కారణమైన బీజేపీనేతలిద్దరూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. బీజేపీ వారిని సస్పెండ్ చేసింది. అక్క‌డితో వివాదానికి పుల్ స్టాప్ చెప్పాల‌నుకున్నా, నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

ఈ వ్యాఖ్యలపై ముస్లిందేశాల నుంచి విమ‌ర్శ‌లు, అభ్యంత‌రాలు ఎదుర‌వుతున్నాయి. ముఖ్యంగా మ‌న‌తో వ్యాపార లావాదేవీలు, స్నేహ‌సంబంధాలున్న ముస్లిం దేశాలుకూడా మండిప‌డుతున్నాయి. కొన్నిదేశాలు తమ దేశంలోని భారత ప్రతినిధులకు సమన్లు జారీ చేయ‌డం, భార‌తదేశానికి న‌చ్చ‌లేదు. ఐవోసీ వ్యాఖ్యలకు భారతీయ విదేశాంగ శాఖ‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది.

ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్ కో ఆపరేషన్ -IOC ఒక ప్ర‌క‌ట‌న చేసింది. భారతదేశంలో ఇస్లాం పట్ల ద్వేషం, విమర్శలు, ముస్లింలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విధానాలు బైట‌ప‌డ్డాయ‌ని ఓ ప్రకటన విడుదల చేసింది. అంతే, భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ తీవ్రంగా స్పందించారు. ఐవోసీ వ్యాఖ్యలు అసంబద్ధమైనవ‌ని, అన్ని మతాలను భారత ప్రభుత్వం సమానంగానే చూస్తుందని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అస‌లు వ్యాఖ్య‌లు చేసిన వాళ్లు బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. పార్టీ వాళ్ల‌ను మంద‌లించింది, బ‌హిష్క‌రించింది. మ‌రి భార‌త‌దేశ అంత‌రంగిక వ్య‌వ‌హారాల్లో ఇత‌ర దేశాల జోక్యం ఏంటి? వాళ్లెందుకు త‌ల‌దూర్చుతున్నారు?

వివాద‌స్ప‌ద‌ వ్యాఖ్యలు వ్యక్తిగతం. భారత ప్రభుత్వానికి సంబంధించినవి కావని బాగ్చీ తేల్చిచెప్పారు. వ్యాఖ్యలు చేసిన శర్మ, జిందాల్‌లపై వేటు కూడా పడిందని బాగ్చీ గుర్తు చేశారు. అందుకే ఐవోసీ ప్ర‌క‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు.

అలాగ‌ని వివాదం ఇక్క‌డితో ఆగేలాలేదు. మహమద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను గల్ఫ్‌ దేశాలు తీవ్రంగానే ప‌రిగ‌ణిస్తున్నాయి. అన్ని మతాలను, విశ్వాసాలను భార‌త‌దేశం గౌరవించాలన్న‌ సౌదీ అరేబియా విదేశాగం శాఖ, ఒక ప్రకటన విడుదల చేసింది. బీజేపీ తీసుకున్న చర్యలను స్వాగతించింది.

ఖ‌త‌ర్ కాస్త తీవ్రంగానే స్పందిస్తోంది. వ్యాఖ్యలపై భారత ప్రభుత్వమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది. కువైట్‌ కూడా ఖతర్ ను అనుస‌రిస్తోంది. భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇరాక్‌ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది.

జ్ఞానవాపి మసీదు చర్చ సందర్భంగా ఓ టీవీ డిబేట్‌లో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ, మహమద్‌ ప్రవక్తను ఉద్దేశించి ఖ్యలు చేశారు. బీజేపీ మీడియా చీఫ్‌ నవీన్‌ జిందాల్ కూడా ప్రవక్త మీద ఓ ట్వీట్ చేశారు. అదికాస్తా విమర్శలకు దారి తీయడంతో వెంటనే డిలీట్ చేశారు. అక్క‌డ నుంచి వివాదం ముదిరింది. కాన్పూర్ లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగాయి.

ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్ధంచేసుకున్న‌ బీజేపీ, సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుంది. ఇ‍ద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, అప్పటికే చాలా డ్యామేజ్‌ జరిగిపోయింది. బీజేపీ నేతల వ్యాఖ్యలపై ముస్లిం దేశాలు తీవ్రంగా ప్ర‌తిస్పందించాయి.

Show comments