వేలకోట్లకు పడగలెత్తిన రాజకీయ పార్టీలు.. లోగుట్టు పెరుమాళ్ళకెరుక..

  • Published - 01:30 PM, Tue - 23 March 21
వేలకోట్లకు పడగలెత్తిన రాజకీయ పార్టీలు.. లోగుట్టు పెరుమాళ్ళకెరుక..

భారతదేశంలోని రాజకీయ పార్టీలు ఎంత ధనికంగా తయారయ్యాయో.. వాటికి భారీ నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయి అన్నది ఇప్పటికీ తేలని అంశం. భారతదేశంలోని రాజకీయ పార్టీలు వద్ద అసలు ఎంత నిధులు ఉన్నాయి అన్న దానిమీద ఏడిఆర్ ( అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ )
సర్వే చేసి అసలు భారత రాజకీయ పార్టీలు వద్ద ఉన్న నిధులు గురించి ఆరా తీయగా మొత్తం పార్టీలు వద్ద ఉన్న జాబితా బయటపడింది. భారతదేశంలోని జాతీయ పార్టీలు వద్ద 7,372 రెండు కోట్ల నిధులు పోగుపడినట్లు తేలింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వద్ద 2,900 కోట్ల నిధులు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీల కంటే అత్యధిక నిధులు ఉన్నది బీజేపీ దగ్గరేనని నివేదిక తెలిపింది.

2018 19 సంవత్సరానికి దేశంలో ఉన్న ఏడు జాతీయ పార్టీలు, నలభై ఒక్క ప్రాంతీయ పార్టీలు 5,349 కోట్ల నిధులను చూపితే అవి ప్రస్తుతం 2,023 కోట్లు పెరిగాయి. అంటే 2019 ఎన్నికల సమయంలో జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు అత్యధికంగా నిధులు అందినట్లు తేలింది. దీంతోనే భారీగా పెరుగుదల నమోదైంది.

ఏడు జాతీయ పార్టీలో బిజెపి తన వద్ద 2,904.18 కోట్ల రూపాయల చర, స్థిర ఆస్తులు ఉన్నట్లు పేర్కొనది. అలాగే కాంగ్రెస్ పార్టీ 928.84 కోట్లు, బహుజన్ సమాజ్ పార్టీ 738 కోట్లు ఉన్నట్లు తెలిపాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లు అధికంగా ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. ఇక కమ్యూనిస్టు పార్టీల ఆర్ధిక బలం క్రమక్రమంగా తగ్గుతున్నట్లు తెలపడం విశేషం.

ఇక దేశంలోని ప్రాంతీయ పార్టీల వరకు వస్తే మొత్తం నలభై ఒక్క ప్రాంతీయ పార్టీలు తమ నిధుల వివరాలను తెలిపాయి. అయితే వీటిలో టాప్ టెన్లో ఉన్న పది పార్టీలు ఆస్తులే 1921 కోట్లు ఉంటే, ఇది ప్రాంతీయ పార్టీల వద్ద ఉన్న మొత్తం ఫండింగ్ లో 94.92 శాతంగా తేలింది. మిగిలిన 31 పార్టీలు వద్ద నామమాత్రంగానే నిధులు ఉన్నట్లు నివేదిక తేల్చింది.

ప్రాంతీయ పార్టీ లో అత్యధికంగా సమాజ్వాదీ పార్టీ వద్ద 572.21 కోట్లు ఆస్తులు, బీజు జనతాదళ్ వద్ద 232.27 నిధులతో ప్రాంతీయ పార్టీల్లో రెండో స్థానంలో ఉంది. తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడిఎంకె వద్ద 206.75 కోట్లు ఉన్నాయి. ఇక ప్రాంతీయ పార్టీల వద్ద ఫిక్స్డ్ డిపాజిట్ లు 1319 కోట్లు ఉన్నట్లు అవి చెప్పాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక పార్టీగా తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో ఉంది. 193 కోట్లతో తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో, దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితి 188 కోట్ల తన ఆస్తులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. అలాగే దేశం మొత్తం మీద ఆరో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ గా ఉన్న వైఎస్సార్సీపీ వద్ద 93 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల్లో ఎనిమిదవ స్థానంలో వైసిపి నిలిచింది. ఇక తెలుగుదేశం పార్టీ వద్ద 115 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, టిఆర్ఎస్ 152 కోట్లు, వైసిపి వద్ద 79 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు ఏడియర్ నివేదిక వెల్లడించింది.

అయితే వీరు ఏ రకంగా ఈ జాబితాను తీసుకున్నది చెప్పలేదు. పైగా 2018-19 లెక్కలను పరిగణనలోకి తీసుకుని వీటిని విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Also Read : ఏబీఎన్ నుంచి కూడా వెంకట కృష్ణ అవుట్, అసలు కారణమేంటీ..?

Show comments