iDreamPost
android-app
ios-app

BJP, Gvl Narasimha Rao, YCP – బీజేపీ ఫోకస్‌ పెడితే వైఎస్సార్‌ సీపీ నేతల అడ్రస్‌లు గల్లంతట!

  • Published Dec 29, 2021 | 3:58 PM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
BJP, Gvl Narasimha Rao, YCP – బీజేపీ ఫోకస్‌ పెడితే వైఎస్సార్‌ సీపీ నేతల అడ్రస్‌లు గల్లంతట!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ పై ఫోకస్‌ పెడితే వైఎస్సార్‌ సీపీ నేతల అడ్రస్‌లు గల్లంతవుతాయంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ పతనం ప్రారంభమైందనడానికి  ప్రజా ఆగ్రహ సభ విజయవంతం కావడమే నిదర్శనమని వ్యాఖ్యానించారు. బీజేపీపై జాలిగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం విడ్దూరంగా ఉందని, ఆయన మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్రమోదీ పాలన సుపరిపాలనకు అద్దం పడితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి పాలన సుపరిపాలనకు అడ్డంగా మారిందని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ పాలనతో జనం విసిగి వేసారి పోయారని అన్నారు. ఎవరో మాట్లాడిస్తే మాట్లాడే దుస్థితిలో బీజేపీ లేదని అన్నారు.

మరి ఎందుకు ఊరుకున్నారు?

బీజేపీ ఫోకస్‌ పెడితే వైఎస్సార్‌ సీపీ నేతల అడ్రస్‌లు గల్లంతు అవుతాయని చెబుతున్న జీవీఎల్‌ మరి ఆ పని చేయకుండా ఎందుకు ఊరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తామే అసలైన ప్రతిపక్షం అని, 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేతలు తరచు అంటుంటారు. మరి అలాంటప్పుడు అధికార వైఎస్సార్‌ సీపీ నేతల అడ్రస్‌లు గల్లంతు చేసేంత శక్తి ఉంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌పై ఎందుకు ఫోకస్‌ చేయడం లేదు? చేయవద్దని ఎవరు అడ్డు చెబుతున్నారు! ఆ ఫోకస్‌ ఏదో పెట్టేసి, వైఎస్సార్ సీపీ నేతలను అడ్రస్‌ లేకుండా చేసేసి ఇక్కడ బీజేపీని బలపడేటట్టు చేయవచ్చు కదా? ఇంకా ఎందుకు ఆలస్యం?

బీజేపీపై జాలిగా ఉందంటూ సజ్జల చేసిన వ్యాఖ్యల్లో స్పష్టంగా భయం కనిపిస్తోందంటున్న జీవీఎల్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. బీజేపీ నేతలను చూసి భయపడిపోవాల్సినంత గొప్పగా ఏమీ ఆ పార్టీ జనంలో స్థానం సంపాదించలేదని, ఆంధ్రప్రదేశ్‌ లో బీజేపీకి ఉన్న శక్తి ఎంతో అందరికీ తెలిసిందేనని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం ప్రతిపక్షాలన్నీ కలిసినా వైఎస్సార్‌ సీపీని భయపెట్టేంత సీనులేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జనంలో తిరిగితే జగన్‌ అంటే ఏమిటో తెలుస్తుంది..

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి పాలన సుపరిపాలనకు అడ్డంగా మారిందని అంటున్న జీవీఎల్‌ నరసింహారావు రాష్ట్రంలో పర్యటిస్తే జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై జనం ఏమనుకుంటున్నారో తెలుస్తుందని వైఎస్సార్‌ సీపీ నేతలు సవాల్‌ చేస్తున్నారు.

ప్రజల్లో ఏమాత్రం పలుకుబడి లేకుండా, కేవలం మీడియా పులుల్లా మారిన నేతలు ఏపీ బీజేపీలో ఎక్కువ ఉన్నారు. వారు మీడియా ముందు హడావుడి చేయడం మినహా పార్టీకి ఏమాత్రం ఉపయోగపడరు. వారికి జనం కష్టాలు, వారి ఆకాంక్షలు తెలియవు. అలాంటి వారు జగన్‌ పాలనపై కామెంట్లు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌ సీపీ నాయకులు అంటున్నారు. హామీ ఇచ్చిన నవరత్నాల పథకాలే కాక  మరికొన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని జనం గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే 2019 తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఎన్నికకు ఓటు బ్యాంకు పెంచుకుంటూ వైఎస్సార్‌ సీపీ దూసుకుపోతుంటే, ప్రతిపక్షాలు కనీస పోటీ ఇవ్వలేకపోతున్నాయి.

జీవీఎల్‌ చెబుతున్నట్టు జగన్‌ పాలనతో జనం విసిగి వేసారి పోయి ఉంటే ఈ విజయాలు ఎలా సాధ్యం?  ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర నిధుల మంజూరు, ప్రత్యేక హాదా, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, విభజన హామీల అమలు వంటి అంశాలనేవి చర్చించకుండానే ప్రజా ఆగ్రహ సభ విజయవంతం అయిందని చెబుతున్న ఆయనకు, ఆ పార్టీకి ప్రజలంటే ఎంత చులకనో అర్థం అవుతోంది. వారు ఎంత డాంభికాలు పలికినా బీజేపీతో సహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఏపీలో టీడీపీ ఎజెండానే ఫాలో అవుతున్నాయని జనం నమ్ముతున్నారు. అందుకే ఎన్నికల్లో టీడీపీతోపాటు వాటిని తిరస్కరించి, మా పార్టీకి పట్టం కడుతున్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు.