బీజేపీకి అంబేద్కర్ మీద ఎందుకంత ప్రేమ..?

  • Published - 11:55 AM, Sun - 6 December 20
బీజేపీకి అంబేద్కర్ మీద ఎందుకంత ప్రేమ..?

బీజేపీ అధికార టీఆర్ఎస్ తో అన్ని విషయాల్లో పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. హిందుత్వ రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చే కాషాయ పార్టీ టీఆర్ఎస్ కు ఏ విషయంలో తీసిపోమని చాటుకోవాలనుకుంటోంది. అదే సమయంలో ఏ వర్గాలకూ తాము వ్యతిరేకం కాదని చెప్పుకోవాలనుకుంటోంది. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ప్రకటనే అందుకు నిదర్శనం.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు. అందరికీ సమన్యాయం జరగాలన్న అంబేద్కర్ ఆశయాలను బీజేపీ నెరవేరుస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారారు. పనిలో పనిగా అధికార పార్టీపైన విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ జయంతి, వర్థంతిలను విస్మరించిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మైనార్టీల మీద దాడులు పెరిగాయనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంబేద్కర్ పట్ల ప్రేమను ప్రకటించడం ద్వారా దళితుల మనసులో చోటు దక్కించుకోవాలనుకుంటోంది బీజేపీ. మరోవైపు అధికార టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలనుకుంటోంది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నగరంలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఆ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంఅవుతుందన్నారు. అందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలోని 36 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది. విగ్రహంతో పాటు మ్యూజియం, లైబ్రరీ, సమావేశ మందిరాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 140 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన విగ్రహ నమూనాను ఇప్పటికే విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఎత్తుకున్న ఈ నినాదాన్నే ఇప్పుడు బీజేపీ ఎత్తుకుంది. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని బీజేపీ హామీ ఇస్తోంది. ఇది కాకతాళీయం ఏమాత్రం కాదు. హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ వాదనకు బీజేపీ చెక్ పెట్టాలనుకుంటోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చుతామని హామీ ఇవ్వడంలోని ఆంతర్యం కూడా ఇదే. గడిచిన ఆరేళ్లలో ఐటీ అభివృద్ధికి విశేష కృషి చేశామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ వాదనను త్రోసిపుచ్చేందుకు పోటీగా ఇలాంటి ఐబీ అభివృద్ధి హామీని ముందుకు తెచ్చింది బీజేపీ. అధికార టీఆర్ఎస్ చేపట్టిన అంబేద్కర్ విగ్రహ నిర్మాణం విషయంలోనూ బీజేపీ అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రకటనతో అట్టడుగు వర్గాలకు దగ్గరవ్వొచ్చనే ఆలోచన కూడా బీజేపీ మదిలో ఉందనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి బీజేపీ ఎత్తుగడలు ఎంతమేరకు సత్ఫలితాలిస్తాయో చూడాలి మరి.

Show comments