iDreamPost
iDreamPost
మందుబాబులను ఆకట్టుకోవడానికి వైఎస్సార్ సీపీ, భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నాయని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యానించి, ఆ రెండు పార్టీలను ఒకే గాటన కట్టే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మందుబాబుల ఓట్లు కొల్లగొట్టేందుకు ఆ రెండు పార్టీలు పథక రచనలు చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.70కే అమ్మిస్తామంటూ సారాయి వీర్రాజు మేనిఫెస్టోలో పెడతామంటున్నారని విమర్శించారు. రెండున్నరేళ్లు సొంత బ్రాండ్‌లు అమ్మిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్.. ఇప్పుడు ప్రీమియం బ్రాండ్లు అమ్ముతామంటోందని అన్నారు. మద్య నిషేధం హామీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని రామకృష్ణ విమర్శించారు.
ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకతను వైఎస్సార్ సీపీకి అంట గట్టే యత్నం..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమ పార్టీకి అంటగట్టే యత్నం చేస్తున్నారని సీపీఐ రామకృష్ట వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ నేతలు తప్పుపడుతున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో జాప్యం వంటి కారణాలతో బీజేపీని ఏపీలో జనం ఏవగించుకుంటున్నారు. దీనికితోడు స్థానిక నాయకత్వం కూడా ఇక్కడి జనం మనోభావాలను కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి, సమస్యలను పరిష్కరించే యత్నం చేయడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేసిందేమీ లేదనే అభిప్రాయం జనంలో ఏర్పడింది. అందుకే ఆ పార్టీ ఎంతగా యత్నించినా ఇక్కడ ఏ ఎన్నికల్లోనూ గెలవలేకపోతోందని వైఎస్సార్ సీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.70కే అమ్మిస్తామంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటనను, వైఎస్సార్ సీపీ మద్యం ధరలు తగ్గించడాన్ని ముడిపెట్టేసి రెండు పార్టీలను ఏకకాలంలో జనంలో చులకన చేయాలని సీపీఐ రామకృష్ట యత్నిస్తున్నారని అంటున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ చేసిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలు ఎంత హాస్యాస్పదమో అందరికీ తెలిసిందే. బాధ్యతారహితంగా సోము చేసిన వ్యాఖ్యలను, మద్యపాన నిషేధానికి చిత్తశుద్ధితో యత్నిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని ఒకే గాటన కట్టడం ద్వారా రామకృష్ట తన పచ్చపాత బుద్ధిని బయట పెట్టుకున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
టీడీపీ హయాంలో ఊరూ వాడా బెల్ట్‌షాపులతో మద్యం ఏరులై పారినప్పుడు నోరు మెదపని రామకృష్ణ.. మొత్తం బెల్ట్‌షాపులను రద్దు చేయడమే గాక, గణనీయంగా మద్యం షాపులను తగ్గించిన వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటి? మద్యపాన నిషేధం అమలులో భాగంగానే వాటి ధరలను షాక్ కొట్టే స్థాయిలో ప్రభుత్వం పెంచింది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఇక్కడకు అక్రమ మార్గాల్లో రావడాన్ని అడ్డుకోవడానికే వాటి ధరలను తగ్గించాల్సి వచ్చింది. ఇవన్నీ తెలిసినా రామకృష్ణ కావాలనే బురద జల్లుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
వారు మందుబాబులను ఆకట్టుకుంటే మీరు బాబును ఆకట్టుకుంటున్నారా?
దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని పేరున్న సీపీఐ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి టీడీపీ నేత చంద్రబాబునాయుడు మెప్పు పొందడానికి సర్దుబాటు ధోరణితో పోతోంది అన్న విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ముగింపు సభలో బీజేపీతో కలసి వేదిక పంచుకోవడానికి కూడా వెనుకాడలేదు. బాబు శాసిస్తే సీపీఐ పాటిస్తుంది అన్నట్టు ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఉంది. తెల్లారితే బుర్జువా పార్టీలు అంటూ విమర్శలు చేసే కమ్యూనిస్టులు… బుర్జువాకు నిలువెత్తు నిదర్శనమైన టీడీపీతో కలసి అడుగులు వేస్తూ ఇతర పార్టీలపై బురద జల్లడమే విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.