ప్రాంతాల మధ్య అసమానతలకు అభివృద్ధి కేంద్రీకరణ ప్రధాన కారణం. ఒకే రాష్ట్రంలోని వేరు వేరు ప్రాంతాల మధ్య అసమ అభివృద్ధి ప్రజల్లో అసంతృప్తికి కారణంగా మారుతుంది. ఫలితంగా ప్రాంతీయ ఉద్యమాలు అనివార్యమవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుభవాలు చెప్తున్న పాఠాలివి. రాష్ఱ్ర విభజనకు మూలంగా నిలిచింది కూడా అసమ అభివృద్ధే. మరోమారు ప్రజల్లో అలాంటి అసంతృప్తికి అవకాశం కల్పించకూడదనుకుంటే అన్ని ప్రాంతాల అభివృద్ధిపైనా ప్రభుత్వాలు దృష్టిసారించాల్సి ఉంటుంది. ఆ దిశలో అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది. మూడు రాజధానుల ప్రతిపాధనతో ప్రజలముందుకు వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న ప్రతిపక్షాలు రాజధాని చుట్టూ ఓట్ల రాజకీయం నడుపుతుండడం విషాదం.
గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించి అభివృద్ధిని పూర్తిగా ఒకే ప్రాంతంలో కేటాయించడాన్ని సరిచేస్తూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాధనను ముందుకు తెచ్చింది. విశాఖపట్టణాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా ప్రతిపాధించిన బిల్లును ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్ సైతం ఈ బిల్లుపై ఆమోదముద్ర వేశారు. కానీ… ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయాన్ని నిత్యం చర్చనీయాంశంగానే పరిగణిస్తున్నాయి. అమరావతి రైతుల పేరిట ఏడాదికిపైగా నిరసనలు చేపడుతున్న వారూ ఉన్నారు. రాజధానికోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుందనే వాదనను బలంగా వినిపిస్తున్న ప్రతిపక్షాలు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి చర్చించకపోవడం గమనార్హం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. అందుకు కారణం సాగునీటి ప్రాజెక్టుల ప్రయోజనాలు కోస్తా ప్రాంతానికి చేరినంతగా ఇతర ప్రాంతాలకు చేరకపోవడం. తద్వారా వ్యవసాయ, వ్యాపార రంగాల అభివృద్ధి నిర్థిష్ట ప్రాంతాల్లో జరిగింది. విశాఖ, కాకినాడ లాంటి ప్రాంతాల్లో ఎగుమతులు, దిగుమతులకు అవకాశం ఉండడం వల్ల పరిశ్రమల ఏర్పాటు సాధ్యమైంది. కానీ ఇతర ప్రాంతాల అభివృద్ధికి సరైన ప్రణాళికలు లేకపోవడంతో ప్రాంతీయ అసమానతలు పెరిగి, చివరకు రాష్ట్ర విభజన వరకు వెళ్లింది. ఇప్పటికీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి నామమాత్రమనే చెప్పాలి. అలాంటి అసమానతలను సరిచేయడానికి అభివృద్ధి వికేంద్రీకరణ అనివార్యం. అందులో భాగంగా ముందుకు వచ్చిందే మూడు రాజధానుల డిమాండ్.
ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న ప్రతిపక్ష పార్టీల్లో ప్రజల ప్రయోజనాల పట్ల గల చిత్తశుద్ధి కంటే, రాజకీ లబ్ది కోసం పడుతున్న ఆరాటమే ఎక్కువ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వేళ్లూనుకునేందుకు తహతహలాడుతున్న బీజేపీ కూడా ఇప్పుడు మూడు రాజధానులకు వ్యతిరేకమని చాటుకుంది. అమరావతే రాష్ట్ర రాజధానిగా ఉండాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించాడు. తాను ప్రధాని మోదీ ప్రతినిధిగా ఈ మాట చెబుతున్నానంటూ కొత్త వివాదానికి తెరతీశారు. ఇంతకాలం మూడు రాజధానుల విషయంలో నోరు మెదపని కేంద్రం తరుపున సోము వీర్రాజు వకాల్తా తీసుకున్నారు. అమరావతిలో అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం బీజేపీ అధికారం కట్టబెట్టాలని కోరారు. సోము వీర్రాజు మాటలు ఆంధ్రరాష్ట్రంలో అధికారం కోసం చేసిన వ్యాఖ్యలుగా అర్థం చేసుకోవచ్చు.
సోము వీర్రాజు వ్యాఖ్యలతో మూడు రాజధానుల విషయంలో బీజేపీ వైఖరి స్పష్టమైంది. కానీ ఆయన మోదీ ప్రతినిధిగా మాట్లాడుతున్నానని చెప్పుకోవడంలో అసలు సమస్య ఉంది. మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం ఉండబోదంటూ ఇప్పటికే కేంద్రం హోంశాఖ ప్రకటించింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల ఏర్పాటును తప్పుబట్టలేమని తేల్చింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని, కేంద్రం రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే ఆర్థిక సాయం మాత్రమే చేస్తుందని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. కానీ…. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాత్రం ప్రధానికి ప్రతినిధిగా మూడు రాజధానుల ఏర్పాటును తప్పుబట్టడం విడ్డూరంగా ఉంది. మొత్తానికి ప్రాంతాల మధ్య అసమ అభివృద్ధిని రూపుమాపాలనే ఆలోచన బీజేపీకి లేదని మరోమారు నిరూపించుకుంది. ఈ విషయంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.