iDreamPost
android-app
ios-app

ఎవరూ అనుకరించలేని విలక్షణ ఉపేంద్ర – Nostalgia

  • Published Sep 18, 2021 | 12:19 PM Updated Updated Sep 18, 2021 | 12:19 PM
ఎవరూ అనుకరించలేని విలక్షణ ఉపేంద్ర – Nostalgia

మనకు ఎప్పటినుంచో అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల హయాం నుంచి చరణ్ తారక్ ల దాకా హీరోయిజం ఎప్పుడూ కొన్ని సూత్రాలకు లోబడే ఉంటుంది. దానికి ఎదురీది ఏ దర్శకుడూ సాహసించని ఒక కొత్త తరహా ఫార్ములాని పరిచయం చేసిన ఘనత కన్నడ హీరో ఉపేంద్రకే దక్కుతుంది. ఆయన జీవిత విశేషాలు చూద్దాం. ఉపేంద్ర రచయితగా తన ప్రస్థానం 90 దశకంలో ప్రముఖ హీరో, దర్శకుడు కాశీనాథ్ దగ్గర మొదలుపెట్టారు. ఆయన దగ్గరే ఎన్నో మెళకువలు నేర్చుకుని 1992లో ‘తర్లే నన్ మగ’తో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టారు. మొదటి అడుగే విజయవంతం. రెండో ప్రయత్నంగా చేసిన హారర్ కామెడీ ‘ష్'(1993) కూడా సూపర్ హిట్ కొట్టింది.

ఈసారి అందరిలాగే తాను రొటీన్ సబ్జెక్టులతో సినిమాలు తీస్తే లాభం లేదని గుర్తించిన ఉపేంద్ర ఈసారి స్టార్ హీరో శివ రాజ్ కుమార్ తో వయొలెంట్ లవ్ స్టోరీ ‘ఓం’ని ప్లాన్ చేసుకున్నారు. 1995లో రిలీజైన ఈ సినిమా కర్ణాటకలో చరిత్ర సృష్టించింది. రికార్డులు చెల్లాచెదురయ్యాయి. ఇప్పటిదాకా ఐదు వందల సార్లు ఒక రాష్ట్రంలో మళ్ళీ మళ్ళీ విడుదలైన ఏకైక చిత్రం ఇదే. దీన్నే తెలుగులో రాజశేఖర్ హీరోగా ఉపేంద్రే రీమేక్ చేశారు కానీ ఫలితం దక్కలేదు. తర్వాత చేసిన ‘ఆపరేషన్ అంత’ ఫ్లాప్ కావడం ఉపేంద్రకు షాక్. స్టార్ హీరోలను పదే పదే నమ్ముకుంటే ప్రయోగాలు చేయలేనని గుర్తించిన ఉపేంద్ర అప్పుడు రాసుకున్న కథే ‘A’

1998లో తనే హీరోగా అప్పటిదాకా ఏ తెరా చూడని ఒక సరికొత్త హీరోయిజంని ప్రేమకథకు ముడిపెట్టి ఆవిష్కరించారు. అందులో ఉప్పి నటనకు యువత వెర్రెక్కిపోయింది. కర్ణాటకలో సిల్వర్ జూబ్లీ ఆడిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ సైతం శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. పూరి లాంటి ఎందరో దర్శకులకు ఇది పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన మాట వాస్తవం. 1998లో తీసిన ‘స్వస్తిక్’ యావరేజ్ కాగా తన పేరునే టైటిల్ గా పెట్టి ‘ఉపేంద్ర’ తీసిన సినిమా మరో బ్లాక్ బస్టర్. అందులో మనసులో ఒకటి బయటికి ఒకటి మాట్లాడే మనుషుల మనస్తత్వాలను ఎండగట్టిన తీరు ఆ తర్వాత ఆ స్థాయిలో ఇంకెవరు చూపలేదన్నది వాస్తవం.

ఇంత సక్సెస్ అందుకున్నా కూడా అనూహ్యంగా ఉపేంద్ర దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చి పూర్తి స్థాయి నటుడిగా కెరీర్ ని స్టార్ట్ చేశారు. తెలుగులోనూ అవకాశాలు వెల్లువెత్తాయి. కన్యాదానం, ఒక్క మాట, రా, స్టుపిడ్, నీతోనే ఉంటాను, సన్ అఫ్ సత్యమూర్తి ఇవన్నీ తను హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో వచ్చిన స్ట్రెయిట్ మూవీస్. అయితే హీరోగా మాత్రం శాండల్ వుడ్ లో తనదంటూ బలమైన ముద్ర వేయగలిగారు. తిరిగి 2010లో డైరెక్టర్ గా మరోసారి మెగాఫోన్ పట్టిన ఉపేంద్ర తనకు నయనతారను జంటగా చేసుకుని నిర్మించిన ‘సూపర్’ మరో సూపర్ హిట్. 2015లో సీక్వెల్ గా ‘ఉప్పి 2’ తీశారు కానీ ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయింది. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా సాగుతున్న ఉపేంద్ర త్వరలో తెలుగులో వరుణ్ తేజ్ ‘గని’ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు

Also Read :  పల్లెటూరి నేపథ్యంలో పసందైన డ్రామా – Nostalgia