iDreamPost
iDreamPost
రాజీనామాకు సిద్ధమని సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించిన తర్వాత, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది శివసేన. తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే లేవనెత్తిన హిందుత్వ వాదానికి ఉద్ధవ్ థాకరే నిన్ననే సమాధానమిచ్చారు. అయినా తిరుగుబాటు కొనసాగుతోంది. అందుకే ఈరోజు శివసేన వ్యూహం మార్చింది. మీరు కోరినట్లుగానే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నుంచి బైటకొచ్చే ఆలోచన చేస్తాం. కాని మీరు 24 గంటల్లోగా తిరుగుబాటుదారులు రావాలని శివసేన చెప్పింది.
గౌహతిలోని ఒక హోటల్‌లో 42 మంది ఎమ్మెల్యేలు శివసేన తిరుగుబాటుదారుడు ఏక్‌నాథ్ షిండేతో కలిసి పోజులిచ్చిన వీడియోలు, ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఫోటో షూట్ కోసం ఎమ్మెల్యేలు హాల్‌లో గుమిగూడినట్లు కనిపించింది. దీని అర్థం, మహారాష్ట్రలో త్వరలో బల పరీక్షకు ఇది ట్రైలర్ వేసినట్లే.
శివసేనకు వచ్చిన రాజకీయ సంక్షోభాన్ని తప్పించడానికి, ఏకంగా రెబల్ ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా నియమించాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సూచించినట్లు శివసేన వర్గాలు చెప్పాయి. ఈ కూటమిలో ఉన్న మరో పార్టీ కాంగ్రెస్. ఈలోగా, ఏక్‌నాథ్ షిండేను తమ నాయకుడిగా ప్రకటిస్తూ శివసేన తిరుగుబాటుదారులు గవర్నర్‌కు లేఖ రాశారు.
మరి బీజేపీ రాజకీయ వ్యూహమేంటి? శివసేన ప్రభుత్వం ఎలాగూ కుప్పకూలుతుంది. అప్పటిదాకా వేచిచూద్దాం. ఆ తర్వాతనే ప్రభుత్వ ఎర్పాటు సంగతి చూద్దామన్నది బీజేపీ అంచనా. మేం ఏక్‌నాథ్ షిండేతో మాట్లాడలేదు. ఇది శివసేన పార్టీ అంతర్గత విషయం. మాకు దీనితో సంబంధం లేదని బీజేపీ అంటోంది.