iDreamPost
android-app
ios-app

కర్ణాటకలో మరో వివాదం

కర్ణాటకలో మరో వివాదం

కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. ఇప్పటికే హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ చేరి ఇటీవలే తీర్పు వెలువడింది. హిజాబ్ ను విద్యాసంస్థల్లో వాడకూడదని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక తాజాగా మరో వివాదం వార్తల్లో నిలిచింది.

కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న క్లారెన్స్ హైస్కూల్ లో విద్యార్థులు.. ప్రతిరోజు బైబిల్ ను తీసుకొని పాఠశాలకు వచ్చేలా ఆదేశించిందని హిందూ జనజాగృతి సమితి ఆరోపించింది. ఈ సందర్భంగా హిందూ జనజాగృతి సమితి రాష్ట్రప్రతినిధి గౌడ మాట్లాడుతూ.. ‘సదురు పాఠశాలలో చదివే క్రైస్తవేతర విద్యార్థులను తప్పనిసరిగా బైబిల్ ను తీసుకెళ్లి చదవాలని కోరిందని ఆరోపించారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించినట్లేనని అన్నారు.

ఈ వివాదం దుమారం రేపడంతో పాఠశాల యాజమాన్యం తమను తాము సమర్థించుకుంది. ఈ నేపథ్యంలో క్లారెన్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ జెర్రీ జార్జ్ మాథ్యూ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మా పాఠశాల చట్టాన్ని గౌరవిస్తామని’ అన్నారు. మేం మా న్యాయవాదులను సంప్రదించామని.. ఈ విషయంలో వారి సలహాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రస్తుతం ఈ వివాదం కన్నడ నాట మరో రాజకీయ దుమారానికి తెరదీసింది. దీనిపై కర్ణాటక ప్రాథమిక మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ స్పందించారు. ఏ విద్యాసంస్థ కూడా ఒక నిర్ధిష్ట మతపరమైన ఆచారాన్ని అనుసరించమని ప్రజలను బలవంతం చేయదని.. అలా చేస్తున్నసంస్థలు కనిపిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని బీసీ నగేశ్ అన్నారు

మైనారిటీ అయినా.. ఇతర సంస్థలు అయినా మతపరమైన ఆచారాలు అనుమతించబడవు అని మంత్రి బీసీ నగేష్ స్పష్టం చేశారు. విద్యార్థులను మతపరమైన ఆచారాలకు విరుద్ధమైన దానిని ఆచరించమని ఏ సంస్థ ఎవరినీ బలవంతం చేయదు.. ఒకవేళ చేస్తే.. డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకుంటుంది అని కర్ణాటక మంత్రి హెచ్చరించారు. త్వరలో కర్ణాటక విద్యాశాఖ మంత్రిని కలుస్తామని, ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హిందూ జనజాగృతి సమితి తెలపడంతో ఈ వివాదం ఎటు వెళుతుందో చూడాలి.